ఆ 35 రోజులు టాలీవుడ్ లో నాన్ స్టాప్ సినిమాలు..
ఈ ఏడాది సౌత్ నుంచి అత్యధిక పాన్ ఇండియా సినిమాలు ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సంగతి తెలిసిందే
ఈ ఏడాది సౌత్ నుంచి అత్యధిక పాన్ ఇండియా సినిమాలు ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సంగతి తెలిసిందే. వందల కోట్ల బడ్జెట్ తో భారీ కాన్వాస్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమాలన్నీ కూడా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ గా నిర్మాణ దశలో ఉన్నాయి. ప్రేక్షకులు కూడా ఈ మూవీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా సెప్టెంబర్ అక్టోబర్ నెలలు టాలీవుడ్ లో బిజినెస్ గట్టిగానే జరగనున్నట్లు అర్ధమవుతుంది. ఇక ఆ టైమ్ లో 35 రోజుల వ్యవధిలో మంచి క్రేజ్ ఉన్న సినిమాలు రాబోతున్నాయి.
వీటిలో సెప్టెంబర్ 27న మొదటిగా వచ్చే సినిమా ఓజీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పాన్ ఇండియా లెవల్ లో సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. కచ్చితంగా మూవీ వండర్స్ క్రియేట్ చేస్తుందని చిత్ర యూనిట్ బలంగా నమ్ముతోంది. నెక్స్ట్ అక్టోబర్ 10న దసరా కానుకగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీ గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.
300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ అయ్యి ఉంది. అదే రోజు సూర్య పవర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ పాన్ ఇండియా మూవీ కంగువ భారీ స్క్రీన్స్ పై రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చిన కంగువ టీజర్ మూవీపై అంచనాలు అమాంతం పెంచేసింది. నాగ చైతన్య, సాయిపల్లవి కాంబినేషన్ లో చందూ మొండేటి దర్శకత్వంలో సిద్ధం అవుతోన్న పాన్ ఇండియా మూవీ తండేల్ అక్టోబర్ 11న రిలీజ్ కాబోతోంది.
ఈ సినిమాను దాదాపు 60 కోట్ల బడ్జెట్ తో గీతా ఆర్ట్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాపై చిత్ర యూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. మరోవైపు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో చేస్తోన్న గేమ్ చేంజర్ మూవీ అక్టోబర్ 31న రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. మెగా అభిమానులు గేమ్ చేంజర్ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ జైభీమ్ ఫేమ్ జ్ఞాన్ వేల్ దర్శకత్వంలో చేస్తోన్న వెట్టియాన్ మూవీ అక్టోబర్ 21 గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఇది కూడా సౌత్ ఇండియాలో ఒక మంచి బజ్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఈ సినిమాలు దేనికవే ప్రత్యేకమైనవి కావడం విశేషం. కేవలం 35 రోజుల గ్యాప్ లోనే ఈ ఆరు సినిమాలు రిలీజ్ కాబోతూ ఉండటం ఆడియన్స్ కి పండగే అని చెప్పాలి.
నందమూరి నటసింహం బాలయ్య, బాబీ దర్శకత్వంలో చేస్తోన్న సినిమా కూడా అక్టోబర్ లోనే రిలీజ్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే ఈ మొత్తం 7 సినిమాలు మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ గా సెప్టెంబర్ ఆఖరు నుంచి అక్టోబర్ నెలాఖరు మధ్యలో రాబోతున్నట్లు లెక్క. మరి ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు ఎలాంటి కలెక్షన్స్ అందిస్తాయో చూడాలి.