మలయాళంలో టాప్-5 యంగ్ హీరోలు వీరే!

మలయాళ నేచురల్ స్టార్ ఫహాద్ ఫాజిల్ 'ట్రాన్స్' 'అనుకోని అతిథి' 'మాలిక్' వంటి ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే డబ్బింగ్ సినిమాలతో తెలుగు ఆడియన్స్ కు పరిచయమయ్యాడు.

Update: 2024-07-31 03:52 GMT

ఒకప్పుడు మాలీవుడ్ అనగానే బీగ్రేడ్ సినిమాలు గుర్తుకు వచ్చేవి కానీ, ఇప్పుడు మలయాళ చిత్ర పరిశ్రమ అనగానే ఎవరికైనా కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలే గుర్తుకు వస్తాయి. లిమిటెడ్ బడ్జెట్ లో, ఎవరూ టచ్ చేయని పాయింట్స్ తో సినిమాలు తెరకెక్కిస్తూ, బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధిస్తున్నారు. ఓటీటీల పుణ్యమా అని కోవిడ్ టైములో మలయాళ సినిమాలు అన్ని భాషల వారికి అలవాటు అయిపోయాయి. మాలీవుడ్ హీరోలు సైతం తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఇంతకముందు మమ్ముట్టి, మోహన్‌లాల్ వంటి ఒకరిద్దరి పేర్లు మాత్రమే తెలిసేవి. కానీ ఇప్పుడు అనేక మంది యంగ్ హీరోల పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. నేడు మాలీవుడ్ లో రాణిస్తున్న ఆ యువ కథానాయకులెవరో తెలుసుకుందాం.

1. దుల్కర్ సల్మాన్:

మమ్ముట్టి తనయుడిగా ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టిన దుల్కర్ సల్మాన్.. తక్కువ సినిమాలతోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుస విజయాలు అందుకొని మాలీవుడ్ సూపర్ స్టార్ గా ఎదిగాడు. అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోగా మారాడు. మలయాళంతో పాటుగా హిందీ, తెలుగు, తమిళ భాషలలో సినిమాలు చేస్తూ.. పాన్ ఇండియా వైడ్ గా మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. ముందుగా డబ్బింగ్ చిత్రాలతో టాలీవుడ్ దృష్టిని ఆకర్షించిన DQ.. స్ట్రెయిట్ తెలుగు చిత్రాల్లో నటించే స్థాయికి వచ్చాడు. 'సీతారామం' సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయిన తర్వాత క్రేజీ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం 'లక్కీ భాస్కర్', 'ఆకాశంలో ఒక తార' వంటి మల్టీలాంగ్వేజ్ చిత్రాల్లో దుల్కర్ నటిస్తున్నారు.


2. పృథ్వీరాజ్ సుకుమారన్:

'కర్తవ్యం' అనే డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచితమైన మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌.. 'పోలీస్ పోలీస్' అనే స్ట్రెయిట్ మూవీ చేశాడు. తమిళ, హిందీ చిత్రాల్లోనూ నటించాడు. గతేడాది 'సలార్: పార్ట్ 1'లో వరద రాజమన్నార్ గా అదరగొట్టిన పృథ్వీరాజ్‌.. 'ఆడుజీవితం - ది గోట్‌ లైఫ్‌' సినిమాతో 160 కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. 'గురువాయూర్ అంబలనాదయిల్'తో డీసెంట్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నాడు. హీరోగానే కాకుండా నిర్మాతగానూ, డైరెక్టర్ గానూ రాణిస్తున్నాడు. ఆయన దర్శకత్వం వహిస్తున్న 'లూసిఫర్ 2' మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


3. ఫహద్ ఫాజిల్:

మలయాళ నేచురల్ స్టార్ ఫహాద్ ఫాజిల్ 'ట్రాన్స్' 'అనుకోని అతిథి' 'మాలిక్' వంటి ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే డబ్బింగ్ సినిమాలతో తెలుగు ఆడియన్స్ కు పరిచయమయ్యాడు. 'పుష్ప: ది రైజ్' మూవీతో విలన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఫహాద్.. పార్టీ లేదా పుష్పా అంటూ ఆకట్టుకున్నాడు. ఇటీవల 'ఆవేశం' సినిమాతో 150 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి, తన కెరీర్ లోనే పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం 'పుష్ప 2'తో పాటుగా 'వెట్టయాన్' మూవీలో నటిస్తున్నాడు. 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' అనే స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తున్నారు. అలానే కొన్ని మలయాళ చిత్రాల్లో భాగం అవుతున్నాడు.


4. టోవినో థామస్:

ఓటీటీల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ నటుడు టోవినో థామస్. 'ఫోరెన్సిక్' 'మాయానది' 'లూకా అలియాస్ జానీ' 'వ్యూహం' 'అండ్ ది ఆస్కార్ గోస్ టూ' 'కాలా' 'మిన్నల్ మురళి' 'తల్లుమాల' వంటి డబ్బింగ్ సినిమాల‌తో విశేషంగా ఆకట్టుకున్నాడు. 2018 చిత్రంతో 170 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన టోవినో.. ఇటీవల 'అన్వేషిప్పిమ్‌ కండెతుమ్‌' చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఆయన నటించిన 'నడికార్‌' మూవీ మాత్రం ప్లాప్ అయింది. ప్రస్తుతం 'అజాయంతే రందం మోషణం' సినిమాతో పాటుగా పలు క్రేజీ చిత్రాల్లో నటిస్తున్నాడు.


5. నివిన్ పౌలీ:

టాలీవుడ్ జనాలకు కాస్త ఆలస్యంగా పరిచయమైన మలయాళ నటుడు నివిన్ పౌలీ. అక్కినేని నాగచైతన్యతో రీమేక్ చేయబడిన 'ప్రేమమ్' మూవీ మాతృకలో హీరో ఇతనే. ఎన్నో మంచి సినిమాలు తీసిన నివిన్ ఈ మధ్య కాలంలో ఆశించిన సక్సెస్ సాధించలేకపోతున్నారు. 'మహవీర్యర్' అనే చిత్రాన్ని తెలుగులోనూ ప్రమోట్ చేసారు కానీ, ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయినా సరే మాలీవుడ్ లో అతని స్టార్ డమ్ ఏమాత్రం తగ్గలేదు. చివరగా 'మలయాళీ ఫ్రమ్ ఇండియా' మూవీతో అలరించిన పౌలీ, ఇప్పుడు ఓ తమిళ చిత్రంలో నటిస్తున్నారు.


వీరితో పాటుగా కుంచకో బోబన్, జయసూర్య లాంటి మరికొందరు హీరోలు కూడా మలయాళ చిత్ర పరిశ్రమలో తమ హవా కొనసాగిస్తున్నారు. మన హీరోలతో పోల్చుకొని చూస్తే వీరందరి మార్కెట్ తక్కువే అయినప్పటికీ.. మాలీవుడ్ లో మాత్రం అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కథానాయకులుగా నిలిచారు.

Tags:    

Similar News