ఆయనిక అత్త..అమ్మ..నాయన అంటే పనవ్వదు!
మొత్తంగా ఈ రకమైన విమర్శతో ప్రేక్షకాభిమానులు త్రివిక్రమ్ కంటెంట్ లో మార్పులు కోరుకుంటున్నారని ఓ క్లారిటీ దొరికేసింది
గురూజీ త్రివిక్రమ్ కంటెంట్ పై వస్తోన్న విమర్శల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలే మహేష్ తో 'గుంటూరు కారం' తెరకెక్కించి ఎలాంటి విమర్శలు ఎదుర్కున్నారో తెలిసిందే. ఈ సినిమా తొలి రోజు ఎలాంటి మౌత్ టాక్ వచ్చిందో తెలిసిందే. 'అత్తారింటికి దారేది-2' లా ఉందంటూ అభిమానులే విమర్శిం చారు. ఫలితం పరంగా మరొక అజ్ఞాతవాసి అవుతుందని విమర్శలు గుప్పించారు. మొత్తంగా ఈ రకమైన విమర్శతో ప్రేక్షకాభిమానులు త్రివిక్రమ్ కంటెంట్ లో మార్పులు కోరుకుంటున్నారని ఓ క్లారిటీ దొరికేసింది.
ఎందుకంటే ఆయన ఇంతకుముందు అత్త..అమ్మ..నాయన..అక్కా-తమ్మడు సెంటిమెంట్ తో ఎమోషనల్ గా కొన్ని విజయాలు అందుకున్నారు. 'అలవైకుంఠపురములో' అమ్మ సెంటిమెంట్.. 'అరవింద సమేత వీరరాఘవ'లో నాయన సెంటిమెంట్.. అంతకు ముందు 'సన్నాఫ్ సత్యమూర్తి'లోనూ మరో నాయన సెంటిమెంట్.. ఇంకా ముందుకెళ్తే 'అత్తారింటికి దారేది'లో అత్త సెంటిమెంట్.. 'అ..ఆ' లో అన్నా-చెల్లి మెంటు ఇలా కొంత కాలంగా గురూజీ సినిమాలంటే సెంటిమెంట్..ఎమోషన్ తోనే నడిపించాడు.
వాటిలో కొన్ని సినిమాలు మంచి ఫలితాలు సాధించొచ్చు. కానీ కొత్త దనం ఎక్కడ అని ప్రశ్నించిన నోళ్లెన్నో? ఇటీవల రిలీజ్ అయిన 'గుంటూరు కారం' పై తొలిరోజు అభిమానులు నిప్పులు చెరగడానికి కారణం కూడా అదే. ఇది అమ్మ- కొడకుల సెంటిమెంట్. ఇలా రకరకాల సెంటిమెంట్ లతో త్రివిక్రమ్ సినిమా అంటే ఓ కలగూరలా గంపలా మారిపోయింది. వాటిలో కొత్త దనం ఏదైనా ఉందా? అంటే భూతద్దం పెట్టి వెతికినా ఎక్కడా కనిపించదు. ఇకపై ఇదే జోనర్ లో గురూజీ సినిమాలు చేస్తే గనుక మార్కెట్ లో పప్పులుడకడం కష్టమని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
తెలుగు సినిమా పాన్ ఇండియాలో..పాన్ వరల్డ్ లో దూసుకుపోతున్న సమయంలో ఇంకా రొటీన్ కంటెంట్ తో ప్రేక్షకుల్ని మెప్పించాలి అనే ప్రయత్నం ఇకపై వృద్ధా ప్రయత్నంగానే మిగిలిపోతుందని అంచనా వేస్తున్నారు. రాజమౌళి.. ప్రశాంత్ నీల్..సుకుమార్.. సందీప్ రెడ్డి వంగ..చందు మొండేటి లాంటి మేకర్స్ పాన్ ఇండియానే షేక్ చేసే ఇన్నోవేటివ్ కంటెంట్ తో వస్తుంటే? గురూజీ మాత్రం ఇంకా ఆ పాడుబడ్డ బంగ్లాలోనే ఉన్నారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. మరి ఈ విమర్శలకు గురూజీ ఎలాంటి బధులిస్తాడో చూడాలి.