''సార్'.. ఆ రీజన్ తో తెలుగు హీరోలంతా నో చెప్పారట!'

అయితే కెరీర్ లో సార్ మూవీతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న డైరెక్టర్ వెంకీ అట్లూరి.. తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Update: 2024-12-01 17:34 GMT

గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన సార్ మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. జీవితంలో చదువు, పట్టుదల ఉంటే ఏదైనా సరే సాధ్యమేనన్న కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఆ సినిమా ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. వరల్డ్ వైడ్ గా రూ.100 కోట్లకు పైగా వసూలు చేసిన ఆ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించారు.

కోలీవుడు నటుడు ధనుష్, మలయాళీ బ్యూటీ సంయుక్త హీరోహీరోయిన్లుగా నటించగా.. సముద్రఖని, సాయి కుమార్, రాజేంద్రన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అంతా తమ పాత్రల్లో ఒదిగిపోయి మెప్పించారు. అయితే సినిమా అంతా ఓకే అయినా క్లైమాక్స్ మాత్రం.. మూవీ కాన్సెప్ట్ కు విరుద్ధంగా ఉన్నట్లు అనిపిస్తుంది.

అయితే కెరీర్ లో సార్ మూవీతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న డైరెక్టర్ వెంకీ అట్లూరి.. తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను సార్ సినిమా స్టోరీ.. తెలుగు నటుల కోసమే రాశానని చెప్పారు. పలువురు హీరోలకు కథను వినిపించానని తెలిపారు. కానీ తాను స్టోరీ నెరేట్ చేశాక కొందరు హీరోలు మూవీని రిజెక్ట్ చేశారని పేర్కొన్నారు.

చాలా మంది హీరోలు.. క్లైమాక్స్ ను చేంజ్ చేయాలని చెప్పినట్లు తెలిపారు. తెలుగు ఆడియన్స్, నిర్మాతలు సినిమాలో హ్యాపీ ఎండింగ్ ఉండాలనుకుంటారని అభిప్రాయపడ్డారు. అందుకే సార్ మూవీ చేయడానికి తెలుగు హీరోలు ఆసక్తి చూపలేదని చెప్పారు. కానీ తాను క్లైమాక్స్ విషయంలో రాజీ పడకూడదని నిర్ణయించుకున్నానని తెలిపారు వెంకీ అట్లూరి.

అందుకే తెలుగు హీరోలు తన స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని చెప్పారు. అదే సమయంలో ధనుష్ ను కలిసి కథను చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు. ఆయన కథ అంతా విన్నాక పచ్చ జెండా ఊపారని తెలిపారు. క్లైమాక్స్ కు ఆయన ఓకే చేయడంతో తాను కూడా షాక్ అయినట్లు తెలిపారు. అలా మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చినట్లు పేర్కొన్నారు.

మరోవైపు, ఇటీవల వెంకీ అట్లూరి.. లక్కీ భాస్కర్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. మాలీవుడ్ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఆ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పీరియాడికల్‌ క్రైమ్‌ డ్రామా ఫిల్మ్‌ గా తెరకెక్కిన ఆ మూవీ.. బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో కూడా దూసుకెళ్తోంది. ట్రెండింగ్ లో టాప్-1లో నిలుస్తోంది.

Tags:    

Similar News