ఆ టాలీవుడ్ డైరెక్టర్ తెలుగు హీరోలతో సినిమాలు చెయ్యడా?
నటుడిగా కెరీర్ ప్రారంభించిన వెంకీ అట్లూరి.. కొన్ని సినిమాలకు డైలాగ్ రైటర్ గా, రైటర్ గా వర్క్ చేశారు.
నటుడిగా కెరీర్ ప్రారంభించిన వెంకీ అట్లూరి.. కొన్ని సినిమాలకు డైలాగ్ రైటర్ గా, రైటర్ గా వర్క్ చేశారు. 'తొలి ప్రేమ' చిత్రంతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. డెబ్యూతోనే డీసెంట్ హిట్టు కొట్టిన వెంకీ.. ఆ తర్వాత 'మిస్టర్ మజ్ను' 'రంగ్ దే' సినిమాలను తెరకెక్కించారు. ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదు. దీంతో యువ దర్శకుడు కాస్త రూటు మార్చి 'సార్' సినిమా తీసి, బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. అయితే ఇప్పుడు ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.
'సార్' సినిమాతో వెంకీ అట్లూరి తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా తెరకెక్కిన ఈ ద్విభాషా చిత్రం.. తమిళ్ లో 'వాతి' పేరుతో రూపొందింది. బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ ఏడాది మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తో 'లక్కీ భాస్కర్' లాంటి తెలుగు మూవీ చేసి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు వెంకీ. దీపావళికి రిలీజైన ఈ సినిమా సైతం 100 కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది. ఇలా బ్యాక్ టూ బ్యాక్ రెండు బ్లాక్ బస్టర్లు పడటంతో వెంకీ క్రేజీ డైరక్టర్ గా మారిపోయారు.
అయినప్పటికీ వెంకీ ఈసారి కూడా తెలుగు స్టార్స్ తో కాకుండా ఇతర భాషల హీరోలతోనే ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవలే తమిళ స్టార్ సూర్యకు స్టోరీ నేరేట్ చేయడం, దానికి హీరో సైడ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం జరిగిపోయింది. కాకపోతే ఈ సినిమా పట్టాలెక్కడానికి టైమ్ పట్టే అవకాశం ఉంది. సూర్య ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. అవన్నీ కంప్లీట్ అయిన తర్వాతనే వెంకీతో సినిమా ఉంటుంది. అందుకే ఈ గ్యాప్ లో దర్శకుడు మరో మూవీ చెయ్యాలని భావిస్తున్నారట.
ఇందులో భాగంగా ధనుష్ తోనే వెంకీ మరో ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నారని టాక్ నడుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ లోనే ఈ కాంబో సెట్ కాబోతోందని అంటున్నారు. ధనుష్ ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో 'కుబేర' అనే త్రిభాషా చిత్రంలో నటిస్తున్నారు. అక్కినేని నాగార్జున ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ సినిమా దాదాపుగా కంప్లీట్ అయిపోయింది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు తన స్వీయ దర్శకత్వంలో 'ఇడ్లీ కడాయి' అనే తమిళ మూవీ చేస్తున్నారు ధనుష్. ఈ క్రమంలో వెంకీతో బైలింగ్వల్ ప్రాజెక్ట్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంతనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
ఏదేమైనా వెంకీ అట్లూరి ఇప్పట్లో టాలీవుడ్ హీరోలతో సినిమాలు చేసేలా కనిపించడం లేదు. తెలుగులోనే సినిమాలు చేస్తున్నప్పటికీ, ఇతర భాషల హీరోలతోనే వర్క్ చేస్తూ వస్తున్నారు. టాలీవుడ్ స్టార్స్ అంతా ఇతర కమిట్మెంట్స్ తో బిజీగా ఉండటం కూడా దీనికి కారణమని అనుకోవచ్చు. ఇక్కడ మరో విషయం ఏంటంటే, సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లోనే ఎక్కువగా సినిమాలు చేస్తున్నారు వెంకీ. సార్, లక్కీ భాస్కర్ చిత్రాలు ఇదే ప్రొడక్షన్ లో వచ్చాయి. త్వరలో ఆయన డైరెక్ట్ చేయబోయే రెండు ప్రాజెక్ట్స్ కూడా సితార నిర్మాణంలోని ఉంటాయని తెలుస్తోంది.