'శ్రీకాకుళం' హీరో ఎవరు?.. రూమర్స్ పై వెన్నెల కిషోర్ క్లారిటీ!
దీంతో వెన్నెల కిషోర్ చిన్న సినిమా ప్రచారానికి సహకరించడం లేదంటూ రూమర్స్ వైరల్ అయ్యాయి.
క్రిస్మస్ సీజన్ లో బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకోడానికి వస్తున్న సినిమాలలో ''శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్'' కూడా ఒకటి. డిసెంబర్ 25వ తేదీన థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రమోషనల్ కంటెంట్ లో కమెడియన్ వెన్నెల కిషోర్ ను హైలెట్ చేయడంతో, ఈయనే ఈ సినిమాకి 'హీరో' అని అందరూ భావించారు. కానీ పోస్టర్స్ లో ప్రధానంగా కనిపిస్తున్న కిషోర్.. ప్రమోషన్స్ లో మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. దీంతో వెన్నెల కిషోర్ చిన్న సినిమా ప్రచారానికి సహకరించడం లేదంటూ రూమర్స్ వైరల్ అయ్యాయి. ప్రస్తుతం యూఎస్ లో ఉన్న కిషోర్ తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు.
ఇప్పటికీ 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' సినిమా స్టోరీ తనకు పూర్తిగా తెలియదని, దర్శక నిర్మాతలు తనకు కథ చెప్పలేదని వెన్నెల కిషోర్ స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. మొదట్లో సినిమాలో తనది మధ్యలో వచ్చే చిన్న పాత్ర అని, ఏడుగురిని విచారించే పాత్ర కోసం ఏడు రోజుల కాల్ షీట్స్ సరిపోతాయని చెప్పారట. షూట్ చేసిన తర్వాత, మళ్ళీ ఇంకా ఒక రోజు కావాలంటే వెళ్లి షూటింగ్ చేసి వచ్చారట కిషోర్. అయితే కొన్నాళ్ళకు మళ్ళీ వచ్చి సాంగ్ లో కనిపించాలని చెప్పి అదనంగా ఇంకో రోజు అడిగారట. ఇలా సినిమా కోసం మొత్తం పది వర్కింగ్ డేస్ తీసుకున్నారట.
అయితే గెటప్ శ్రీను, అనీష్ కురివెళ్ల లాంటి వారు ఫోన్ చేసి సినిమాలో హీరో మీరే అంట కదా? అని వెన్నెల కిషోర్ ను అడగడంతో.. ఇదే విషయాన్ని డైరెక్టర్ ను అడిగారట వెన్నెల కిశోర్. సినిమాలో హీరో వేరే ఉన్నాడని దర్శకుడు సమాధానమిచ్చారట. ఆ తర్వాత స్క్రీన్ ప్లే అంతా మార్చేసి మళ్లీ కిషోర్ తో కొత్తగా డబ్బింగ్ చెప్పించారట. కానీ ఇప్పుడేమో 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' సినిమాకి తనే హీరో అన్నట్లు ప్రొజెక్ట్ చేస్తూ ప్రమోషన్స్ చేస్తున్నారని వెన్నెల కిషోర్ అంటున్నారు. తానేదో సినిమా ప్రచారానికి సహకరించడం లేదనే విధంగా మాట్లాడుతున్నారని, తాను యుఎస్ వెళ్తున్నాననే విషయం కూడా చిత్ర యూనిట్ కు ముందే తెలుసని వివరణ ఇచ్చారు.
'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' సినిమాని కోలుగోలు చేసిన వంశీ నందిపాటి ఇటీవల మీడియా మీట్ లో ఇదే విషయం మీద కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రమోషన్స్ కు హీరో ఎందుకు రావడం లేదని ప్రశ్నించగా.. ''సినిమాలో వెన్నెల కిషోర్ హీరో కాదు. సినిమాకి కథే హీరో. సినిమా చూసినప్పుడు కథనే నమ్మాను. ఇప్పుడు కథను నమ్మే ముందుకు తీసుకెళ్తున్నాను. కథలో ఒక ప్రధాన పాత్రను ఆయన పోషించాడు. అంతే తప్ప హీరో కాదు'' అని వంశీ అన్నారు. వెన్నెల కిశోర్ ప్రమోషన్స్ కు ఎందుకు రాలేదనే దానిపై స్పందిస్తూ.. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారని తెలిపారు.
''ఒక కామన్ ఇంటర్వ్యూకి వచ్చారు. ప్రస్తుతం ఆయన యూఎస్ లో ఉన్నారు. ఆయనకున్న బిజీ షెడ్యూల్స్ వల్ల రాలేకపోతున్నాడు. ఒకటీ రెండు సార్లు రిక్వెస్ట్ కూడా చేసాం. కానీ కుదరలేదు. సహజంగానే ఆయన చాలా ఇంట్రావర్ట్. ఇంటర్వూస్ కి, ఈవెంట్స్ కి తనని దూరంగా ఉంచమని ముందే చాలా జెంటిల్ అండ్ సాఫ్ట్ గా చెబుతారు'' అని వంశీ నందిపాటి తెలిపారు. పర్టిక్యులర్ గా ఒక ఆర్టిస్టు అని కాకుండా కాకుండా, కంటెంట్ ను నమ్ముకొని ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఏదైనా సినిమా తీసినప్పుడు అది అందరి ప్రోడక్ట్.. కాకపోతే ప్రమోషన్స్ కి రావడానికి ఒక్కొక్కరికి కుదురుతుంది, ఒక్కొక్కరికి కుదరక రారు అని వంశీ చెప్పుకొచ్చారు.