'గగన మార్గన్': విజయ్ ఆంటోనీ మరో థ్రిల్లర్‌ కంటెంట్

లియో జాన్ పాల్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

Update: 2024-10-16 07:02 GMT

విభిన్నమైన కథలు, విస్మయపరిచే నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చిన విజయ్ ఆంటోనీ ఇప్పుడు మరో సస్పెన్స్ థ్రిల్లర్‌కి తెరలేపుతున్నాడు. ఈసారి డిటెక్టివ్ ఫిక్షన్‌ నేపథ్యంలో సాగే ఓ ఉత్కంఠభరితమైన మర్డర్ మిస్టరీ-క్రైమ్ థ్రిల్లర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విజయ్ ఆంటోనీ ఫిలిమ్స్ కార్పొరేషన్ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు. లియో జాన్ పాల్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.


ఈ చిత్రానికి ‘గగన మార్గన్’ అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు. సిద్ధార్ నిఘంటువులో ఈ పదానికి "గగనాన్ని దాటుకుని ప్రయాణించే వ్యక్తి" అనే అర్థం ఉంది. టైటిల్ వినిపించినప్పుడే ఇది సాధారణ కథ కాకుండా విలక్షణమైన కథనం కానుందని తెలుస్తోంది. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్ ఆడియెన్స్ దృష్టిని ఆకర్షించారు. విజయ్ ఆంటోనీ ఈ పోస్టర్ గాయాల‌తో ఉన్న గంభీరమైన లుక్‌లో కనిపిస్తున్నాడు. అందులోనే సముద్ర గర్భంలో అండర్‌వాటర్ స్టిల్ కూడా విడుదల చేసి ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచారు.

లియో జాన్ పాల్ టాలెంటెడ్ ఎడిటర్‌గా అనేక విజయవంతమైన చిత్రాలకు పనిచేసి ప్రేక్షకుల గుండెల్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అట్టకత్తి, సూదు కావ్వుం, ఇంద్రు నేట్రు నాళై, మయావన్ వంటి హిట్ చిత్రాలకు ఎడిటింగ్ చేసిన లియో, ఇప్పుడు ఈ సినిమా ద్వారా డైరెక్టర్‌గా మారడం విశేషం. 2013లో ‘ఇధర్కుతానే ఆసైపట్టై బాలకుమారా’ సినిమాకు ఉత్తమ ఎడిటర్‌గా తమిళనాడు రాష్ట్ర అవార్డు అందుకున్నాడు.

సినిమాలో సముద్రఖని, మహానటి శంకర్, పృథికా, బ్రిగిడా, వినోద్ సాగర్, అజయ్ దిషాన్, దీప్షిఖా, కళక్క పోవదు యారు అర్చన, కనిమొళి, అంతగరం నటరాజన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విజయ్ ఆంటోనీ ఎప్పటిలాగే సినిమాకు సంగీతం అందించడంతో పాటు, ఈ ప్రాజెక్ట్‌లో మరింత క్రియేటివ్ రోల్స్‌లో పని చేస్తున్నాడు. ఈ చిత్రానికి యువా ఎస్ సినిమాటోగ్రాఫర్‌గా, రాజా ఎ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

అత్యంత నైపుణ్యం ఉన్న ఈ టెక్నికల్ టీమ్‌ సినిమాలో అధునాతన విజువల్ ఎఫెక్ట్స్‌ను వినియోగించి ప్రేక్షకులకు ఓ కొత్త అనుభవం అందించనుంది. ప్రత్యేకంగా ముంబై సముద్రంలో చిత్రీకరించిన అండర్‌వాటర్ సన్నివేశాలు కథలో కీలకంగా నిలుస్తాయట. ‘గగన మార్గన్’ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా, కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రంగా రూపొందుతోంది. థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోన్న ఈ సినిమా విజయ్ ఆంటోనీ నుంచి మరో సూపర్ హిట్‌గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే సినిమా విడుదలపై మరొక అప్డేట్ ఇవ్వనున్నారు.

Tags:    

Similar News