ప్రముఖ నటుడి స్పాట్ బోయ్ లైంగిక వేధింపులు?
విజయ్ రాజ్ కి చెందిన స్పాట్ బాయ్ మత్తులో హోటల్ సిబ్బందిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు.
అజయ్ దేవగన్ చిత్రం 'సన్ ఆఫ్ సర్దార్ 2' నుంచి నటుడు విజయ్ రాజ్ ను తొలగించినట్లు కథనాలొస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ యునైటెడ్ కింగ్‌డమ్‌లో జరుగుతోంది. తాజా సమాచారం మేరకు.. సెట్‌లో రాజ్ అనుచితంగా ప్రవర్తించిన కారణంగా అతడిని మేకర్స్ తొలగించారు. అయితే నటుడు రాజ్ ఈ వాదనలను ఖండించాడు. తాను సెట్‌కి వచ్చినప్పుడు అజయ్ దేవగన్‌ను పలకరించనందున తొలగించినట్లు పేర్కొన్నాడు. అయితే ఈ సినిమా సహనిర్మాత కుమార్ మంగత్ పాఠక్ వెర్సన్ పూర్తి వేరుగా ఉంది. విజయ్ రాజ్ కి చెందిన స్పాట్ బాయ్ మత్తులో హోటల్ సిబ్బందిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు.
తాజా సమాచారం మేరకు.. విజయ్ రాజ్ స్థానంలో సంజయ్ మిశ్రాను తీసుకున్నట్లు కథనాలొస్తున్నాయి. మూవీ సహనిర్మాత కుమార్ మంగత్ పాఠక్ పింక్‌విల్లాతో మాట్లాడుతూ.. సెట్‌లో రాజ్ అనుచిత ప్రవర్తన కారణంగా అతనిని తొలగించామని తెలిపారు. రాజ్ స్పాట్ బాయ్ మత్తులో హోటల్ సిబ్బందిపై లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటనను కూడా పాఠక్ హైలైట్ చేశాడు. పెద్ద గదులు, ప్రీమియం వానిటీ వ్యాన్, అతడి సిబ్బందికి అధిక ఛార్జీలు చెల్లించాలని కోరడం, ఒక రాత్రికి రూ. 20,000 చెల్లించాలని కోరడం.. వంటి ఆరోపణలు రాజ్ పై ఉన్నాయి. చాలా మంది పాపులర్ స్టార్ల కంటే ఎక్కువ ఫీజు అడగడం కూడా రాజ్‌ని తొలగించడానికి కారణమని నిర్మాతలు చెప్పారు. షూట్‌లో పాల్గొన్న ప్రతిఒక్కరూ బ్రిటన్‌లోని హోటల్ లో ప్రామాణిక గదులను పొందారని రాజ్ ప్రీమియం సూట్ లు కావాలని పట్టుబట్టారని, అతడి డిమాండ్లు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయని పాఠక్ వివరించారు.
ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నించినప్పుడు రాజ్ సహకరించలేదు. ముగ్గురు వ్యక్తుల సిబ్బందికి రెండు కార్లు కూడా డిమాండ్ చేశాడు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నిరాకరించినప్పుడు రాజ్ అసభ్యంగా ప్రతిస్పందించాడని కూడా ఆరోపించారు. ఇది అతడిని సినిమా నుండి తొలగించాలనే నిర్ణయానికి దారితీసింది.
మరోవైపు విజయ్ రాజ్ వెర్షన్ వేరుగా ఉంది. అజయ్ దేవగన్ సెట్ కి వచ్చినప్పుడు తాను పలకరించనందున తొలగించారని పేర్కొన్నాడు. దేవగన్ బిజీగా ఉన్నందున ఇబ్బంది పెట్టకూడదనే ఆయనను పలకరించలేదని అన్నాడు. కొద్దిసేపటి తర్వాత తనను చిత్రం నుండి తొలగించినట్లు నిర్మాతలు చెప్పారని అన్నాడు. తన స్పాట్ బోయ్ హోటల్ సిబ్బందిపై వేధింపులకు పాల్పడ్డారన్న ఘటన గురించి స్పందిస్తూ తాను అలాంటివి ప్రోత్సహించనని అన్నారు. ఆ ఘటనను వేరే ఘటనకు ముడి వేస్తున్నారని రాజ్ ప్రత్యారోపణలు చేసారు. రాజ్‌ను తొలగించాలనే నిర్ణయం వల్ల ప్రొడక్షన్‌కు సుమారు రెండు కోట్ల నష్టం వాటిల్లిందని, వసతి గురించి రాజ్ ఫిర్యాదులు తీవ్రంగా ఉన్నాయని నిర్మాతలు వ్యాఖ్యానించారు.
సన్ ఆఫ్ సర్దార్ 2 అనేది 2012లో వచ్చిన సన్ ఆఫ్ సర్దార్ చిత్రానికి సీక్వెల్. ఇందులో అజయ్ దేవగన్, సోనాక్షి సిన్హా , సంజయ్ దత్ ప్రధాన పాత్రలు పోషించారు. అజయ్ తన పాత్రను పునరావృతం చేయనుండగా, సంజయ్ దత్ స్థానంలో రవి కిషన్‌ని ఎంపిక చేసారు. మృణాల్ ఠాకూర్ మహిళా ప్రధాన పాత్రలో నటించారు.