వెండి తెరకు తీహార్ జైలు స్టోరీ!
తాజాగా తీహాడ్ జైలు వాస్తవ కథను విక్రమాదిత్య మోత్వాని తెరపైకి తెచ్చే బాధ్యత తీసుకున్నారు.
వాస్తవ కథలకిప్పుడు మంచి డిమాండ్ కనిపిస్తుంది. బలమైన భావోద్వేగాలు వాస్తవ కథల్లో దొరకడంతో మేకర్స్ అంతా అటువైపు దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ వెబ్ సిరీస్ ల పరంగా చూస్తే ఇదో ట్రెండ్ లా కొనసాగుతుంది. తాజాగా తీహార్ జైలు వాస్తవ కథను విక్రమాదిత్య మోత్వాని తెరపైకి తెచ్చే బాధ్యత తీసుకున్నారు. 'బ్లాక్ వారెంట్' టైటిల్ తో ఆ జైలు కథను వెండి తెరకెక్కిస్తున్నారు. జైలు నేపథ్యంలో సాగే తొలి జైలు సిరిస్ ఇదే అవుతుంది.
ఇంత వరకూ జైలు నేపథ్యంలో ఇండియాలో పెద్దగా సినిమాలు గానీ, సిరీస్ లు గానీ రాలేదు. దీంతో ఆసియాలోనే అతి పెద్ద జైలు అయిన తీహాడ్ జైలు కథను తెరపైకి తేవడం ఆసక్తికరంగా మారింది. ఇంత పెద్ద జైలు ఇండియాలో తప్పా ఇంకెక్కడా లేదు. తీహార్ జైలు లో చోటు చేసుకున్న నిజ జీవిత కథల్ని ఆవిష్కరించనున్నారు. అయితే ఇందులో నటీనటులు ఎవరు? మెయిన్ లీడ్ లో ఎవరు నటిస్తున్నారు? సాంకేతిక నిపుణుల వివరాలు మాత్రం రివీల్ చేయలేదు.
ఇంత వరకూ కేవలం ప్రకటనగానే కనిపిస్తుంది. అప్లాజ్ ఎంటర్ టైన్ మెంట్స్- కాన్ ప్లూయోన్స్ మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సిరిస్ వచ్చే ఏడాది ఓటీటీ వేదికగా రిలీజ్ చేస్తారు. విక్రమాదిత్య మోత్వాని దర్శకత్వం వహించిన 'కంట్రోల్' చిత్రం ఇటీవలే రిలీజ్ అయింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. బాలీవుడ్ లో దర్శకుడిగా ఆయనకు మంచి పేరుంది.
దీంతో బ్లాక్ వారెంట్ పై అంచనాలు భారీగా ఏర్పడుతున్నాయి. ఇందులో నటించడానికి టాప్ స్టార్లే పోటీ పడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. 'బ్లాక్ వారెంట్ : కన్ ఫెషన్స్ ఆఫ్ ఏ తీహాడ్ జైలు పుస్తకం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతుంది. తీహార్ జైలు అన్నది దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న సంగతి తెలిసిందే.