గామి కోసం విశ్వక్ కష్టం ఇది!
గామి కోసం భారీ సెట్స్ వేయడం మాత్రమే కాకుండా.. సముద్ర మట్టానికి 19 వేల అడుగుల ఎత్తులో, గడ్డకట్టించే -40 డిగ్రీల చలిలో సినిమా షూటింగ్ చేశారు.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నుంచి మూవీ వస్తుందంటే చాలు.. ఆడియన్స్ లో కొత్త ఉత్సాహం నెలకొంటుంది. ఎందుకంటే ఈ యంగ్ హీరోనే కాదు.. ఆయన సినిమాలు కూడా అంతే ఎనర్జిటిక్ గా ఉంటాయి. విశ్వక్ ఎంచుకునే కథలు కొత్తగా ఉంటాయి. ఫ్యాన్ పల్స్ పట్టుకోవడంలో విశ్వక్ సేన్ తోపు అనే చెప్పాలి. అలాంటి హీరో నుంచి ఒక అఘోర కథ వస్తుందనగానే అందరూ ఫస్ట్ షాకయ్యారు.
కానీ, సినిమాకు సంబంధించిన అప్డేట్స్ చూసిన తర్వాత మూవీపై అంచనాలు పెంచేసుకున్నారు. అయితే ఈ మూవీ గత నాలుగు సంవత్సరాలుగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాను మార్చి 8వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. దాంతో పాటు మేకింగ్ వీడియోను కూడా షేర్ చేశారు. ఒక మనిషి తన భయాన్ని జయించడానికి చేసే అసాధ్యమైన, తెలియని ప్రయాణం అంటూ విశ్వక్, చాందిని మంచు కొండల్లో ఉన్న విజువల్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.
గామి కోసం భారీ సెట్స్ వేయడం మాత్రమే కాకుండా.. సముద్ర మట్టానికి 19 వేల అడుగుల ఎత్తులో, గడ్డకట్టించే -40 డిగ్రీల చలిలో సినిమా షూటింగ్ చేశారు. ఈ మేకింగ్ వీడియో చూసిన తర్వాత టీమ్ కష్టం తెలియడమే కాకుండా.. ఫ్యాన్స్ లో మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. నిజంగా సినిమా మీద ప్యాషన్ ఉంటే ఎంత కష్టమైనా వెనుకాడరు అనడానికి ఈ మేకింగ్ వీడియో ఒక ఉదాహరణ అని చెప్పచ్చు.
ఇక గామి సినిమా కోసం విశ్వక్ సేన్ గత నాలుగు సంవత్సరాలుగా కష్టపడుతున్నారు. ఈ మూవీ డైరెక్టర్ విద్యాధర్ అయితే ఏకంగా 8 ఏళ్ల నుంచి ఈ సినిమా నరేషన్ మీదే కూర్చుని ఉన్నారు. ఒక డైరెక్టర్ ఒక సినిమా కోసం ఇంత సమయం కేటాయిస్తున్నారంటే కథ మీద ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ మూవీ షూటింగ్ లో తనను నిజంగానే అఘోర అనుకుని ధర్మం చేశారని చెప్పారు. చలికి గజ గజ వణుకుతూ షూట్ చేశామంటూ తన కషాన్ని గుర్తుచేసుకున్నారు.
క్రౌడ్ ఫండింగ్ చేసి మరీ 2018లో గామి సినిమాను స్టార్ట్ చేశారు. ఈ చిత్రంలో కలర్ ఫోటో ఫేమ్ చాందినీ చౌదరి హీరోయిన్ గా నటించగా.. నరేష్ కుమారన్ సంగీతం అందించారు. ఈ మూవీని సింగిల్ టేక్ లో 8 గంటల్లో డబ్బింగ్ పూర్తి చేశారట విశ్వక్. అయితే మరి ఈ సినిమా ఎలాంటి హిట్ కొడుతుందో చూడాలి.