బాలీవుడ్ ఒంటరి మరణాల పై "ది కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్" సంచలన లేఖ!

బాలీవుడ్‌ ప్రముఖ ఆర్ట్‌ డైరెక్టర్‌ నితిన్‌ చంద్రకాంత్‌ దేశాయ్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే

Update: 2023-08-03 10:39 GMT

బాలీవుడ్‌ ప్రముఖ ఆర్ట్‌ డైరెక్టర్‌ నితిన్‌ చంద్రకాంత్‌ దేశాయ్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే పోలీసుల ప్రాథమిక విచారణలో అది ఆత్మహత్య అని తెలిసిందని అంటున్నారు. మరోపక్క... ఇతని ఆత్మహత్యకు కారణాలు కూడా చర్చకు తెస్తున్నారు. దీంతో రకరకాల వాదనలు తెరపైకి వస్తున్నాయి.

సాదారణంగా ఎవరైనా సెలబ్రెటీకి సంబంధించిన మరణం అసహజంగా జరిగినట్లు వార్తలు వస్తే... దానికి అనుబంధంగా రకరకాలా ఊహాగాణాలు సోషల్ మీడియా వేదికగా దర్శనమిస్తుంటాయి. ఎలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేయొద్దని పోలీసులు, కుటుంబ సభ్యులూ విన్నవిస్తున్నా.. కొంతమంది మాత్రం వారి పనిలో వారు నిమగ్నమైపోతుంటారు.

ఈ సమయంలో నితిన్ దేశాయ్ మరణానికి అప్పులే కారణం అని, మితిమీరిన ఆర్థిక ఇబ్బందులే ఆయన ఆత్మహత్యకు కారణం అని కొన్ని ఇంగ్లిష్ వెబ్‌ సైట్స్‌ లో కథనాలు ప్రచురితమవుతున్నాయి. మరోపక్క ఎలాంటి గాసిప్స్ స్ప్రెడ్ చేయొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారనీ తెలుస్తోంది. ఆ సంగతి అలా ఉంటే... "ది కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు" వివేక్ అగ్నిహోత్రి ట్విట్టర్‌ లో సంచలన పోస్టు పెట్టారు.

అవును... నితిన్ దేశాయ్ మరణం తర్వాత "ది కశ్మీర్ ఫైల్స్" దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ట్విట్టర్‌ లో సంచలన పోస్టు పెట్టారు. ఇందులో భాగంగా సుదీర్ఘమైన లేఖను పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా బాలీవుడ్ సినిమా రంగంపై ఒక బలమైన కామెంట్ తో మొదలైన ఈ లేఖ... వేదాంతం రూపంలో సాగుతుండటం గమనార్హం.

"నీవు ఎంత పెద్ద సక్సెస్ సాధించినా.. చివరకు నీవు ఓటమితోనే నీ జీవితాన్ని ముగించే రంగం బాలీవుడ్ సినిమా ప్రపంచం. అంతా నీ చుట్టే ఉన్నట్టు అనిపిస్తుంది.. కానీ చివర్లో నీతో ఏది ఉండదు. నువ్వు, నీకు నీవుగానే మిలిగిపోతావు" అంటూ వివేక్ అగ్నిహోత్రి తన లేఖలో పేర్కొన్నారు.

అనంతరం సక్సెస్ ఉన్నప్పుడు ఆడింది ఆట పాడింది పాటగా లైఫ్ ఉంటుందనేలా మరో పేరా రాశారౌ వివేక్. ఇందులో భాగంగా... "సినిమా పరిశ్రమలో పేరు, ప్రఖ్యాతులు, డబ్బు, అభిమానులు, కవర్లు, రిబ్బన్లు, అమ్మాయిలు, వారితో సంబంధాలు సక్సెస్‌ తోపాటు అన్నీ నీతో వేగంగా ప్రయాణిస్తాయి. సక్సెస్‌ లో ఉన్నప్పుడు నైతిక విలువలు, నీతి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. డ్రంక్ అండ్ డ్రైవింగ్, రేప్, టెర్రరిజం, హత్యలు చేసినా పట్టించుకోరు" అని ట్వీట్‌ లో వివేక్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇదే సమయంలో "బాలీవుడ్‌ లో సక్సెస్‌ సాధిస్తే డబ్బు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతుంది. కానీ నీవు మధ్య తరగతి వాడిగానే జీవించావు. ఊహించని విధంగా వచ్చిన డబ్బు ఏం చేయాలో తెలియదు. భారీగా పెట్టుబడులు పెడుతావు. జనం నిన్ను బాగా నమ్ముతారు. నీవు చాలా మందికి సలహాలు ఇచ్చే స్థాయికి ఎదుగుతావు. నీకు సలహాలు ఇచ్చేవాళ్లు కరువు అవుతారు. నీవు ఎవరినీ నమ్మని స్థితికి చేరుకొంటావు" అని వివేక్ తన ట్వీట్‌ లో పేర్కొన్నారు.

ఫైనల్ గా... "పరిశ్రమలోకి కొత్త జనరేషన్ వస్తూనే ఉంటుంది. నీవు నీ అస్థిత్వాన్ని క్రమంగా కోల్పుతుంటావు. నీవు పేరు ప్రఖ్యాతులు, డబ్బు మాయలోనే కొట్టుమిట్టాడుతుంటావు. నీలో ఇంకా డిమాండ్లు పెరిగిపోతుంటాయి. నీవు డిమాండ్ చేస్తూంటే నిన్ను ఈ ప్రపంచం ఒంటరివాడిని చేస్తుంది. అప్పుడు నీకు తెలియని చీకటి గుహలోకి మెల్లగా జారుకొంటావు. ఆ చీకటి ప్రపంచంలో ఏం జరుగుతుందో నీకు మాత్రమే తెలుస్తుంది. ఆ సమయంలో నీవు ఏదో చెప్పాలనుకొంటావు. కానీ నీ మాటలు వినే టైమ్ ఎవరికీ ఉండదు" అని వివేక్ అగ్నిహోత్రి భావోద్వేగంగా ట్వీట్ చేశారు..

ప్రస్తుతం ఈ స్థాయిలో వివేక్ అగ్నిహోత్రి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఎంతో లోతుగా ఈ ట్వీట్ ని పోస్ట్ చేశారని.. నితిన్ దేశాయ్ మరణం వివేక్ ని ఆ స్థాయిలో కలిచి వేసిందని అంటున్నారు.

ఇదే సమయంలో ఈ లేఖంతటినీ చదివినవారు.. నితిన్ దేశాయ్ ని దగ్గరగా చూసినవారు మాత్రం... ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులు మాత్రమే కారణం కాదు.. అంతకు మించి మరేదో ఉండి ఉండొచ్చు అనే అనుమానం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. అయితే ముందు ముందు విచారణలో ఎలాంటి క్లారిటీ రాబోతోందనేది వేచి చూడాలి.

Tags:    

Similar News