మామా అల్లుళ్లు సంక్రాంతికి వస్తున్నారా లేదా?
పండక్కు వస్తుందా రాదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. మరి వెంకీ - చైతూ ఫెస్టివల్ కు వస్తారా లేదా?, మామా అల్లుళ్లు బాక్సాఫీస్ వద్ద తలపడే ఛాన్స్ ఉందా?
విక్టరీ వెంకటేశ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో 'Venky Anil3' అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. 'ఎఫ్ 2' 'ఎఫ్ 3' వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న ఈ హ్యాట్రిక్ మూవీకి 'సంక్రాంతికి వస్తున్నాం' అనే టైటిల్ రిజిస్టర్ చేయించారు. పేరుకి తగ్గట్టుగానే సంక్రాంతిని టార్గెట్ గా పెట్టుకొని, పక్కా ప్లానింగ్ తో జెట్ స్పీడ్ తో షూటింగ్ జరుపుతున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమా పండక్కి వస్తుందా లేదా? అనే దానిపై క్లారిటీ లేకుండా పోయింది.
చిరంజీవి హీరోగా నటిస్తున్న 'విశ్వంభర' సినిమాని 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేస్తామని మేకర్స్ చెబుతూ వచ్చారు. మరోవైపు రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న 'గేమ్ ఛేంజర్' మూవీని క్రిస్మస్ కు రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని సంక్రాంతికి తీసుకురావాలని నిర్ణయించుకోవడంతో, చిరు సినిమాని వాయిదా వేసుకున్నారు. అయితే 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాకి కూడా దిల్ రాజే నిర్మాత కావడంతో, ఈ మూవీ విడుదల తేదీపై సందిగ్ధత నెలకొంది.
నిర్మాత దిల్ రాజు తన రెండు సినిమాలను ఒకే సీజన్ లో రిలీజ్ చెయ్యడం వల్ల ఇబ్బందులు వస్తాయని, 'గేమ్ ఛేంజర్' కోసం వెంకటేష్–అనిల్ సినిమాని సంక్రాంతి రేసు నుంచి తప్పించాలనే ఆలోచనలో ఉన్నారని రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై వెంకీ మామ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. కొడుకు కోసం చిరంజీవి తన చిత్రాన్ని వాయిదా వేసుకోవచ్చు.. కానీ వెంకటేశ్ ఎందుకు తన రిలీజును త్యాగం చెయ్యాలని ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయం మీద డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా అలిగినట్లుగా వార్తలు వస్తున్నాయి.
నిజానికి దసరా వరకూ సంక్రాంతి సినిమాల మీద అందరికీ ఓ క్లారిటీ ఉంది. అప్పుడెప్పుడో రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న 'విశ్వంభర'.. ఫెస్టివల్ ను టార్గెట్ గా పెట్టుకొని షూటింగ్ జరుపుకుంటున్న వెంకటేష్ - అనిల్ రావిపూడి సినిమా.. పొంగల్ ను సెంటిమెంటుగా భావించే బాలయ్య NBK109 చిత్రాలు బాక్సాఫీస్ బరిలో ఉంటాయని అంతా ఫిక్స్ అయ్యారు. ఈ మూడు చిత్రాలతో పాటుగా మహా అయితే ఒక తమిళ డబ్బింగ్ మూవీ వచ్చే అవకాశం ఉందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా 'గేమ్ ఛేంజర్' రేసులోకి రావడంతో లెక్కలన్నీ మారిపోయాయి.
ఇప్పటికైతే 'గేమ్ ఛేంజర్', బాలకృష్ణ 109వ సినిమాలు సంక్రాంతికి కన్ఫర్మ్ అయ్యాయి. అజిత్ కుమార్ నటిస్తున్న 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీ 2025 పొంగల్ కు వస్తుందని మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించారు. ఇక క్రిస్మస్ కు రావాలనుకున్న నాగచైతన్య 'తండేల్' చిత్రాన్ని పెద్ద పండక్కు తీసుకొస్తారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అలానే 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా రిలీజ్ పై ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ లేదు. పండక్కు వస్తుందా రాదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. మరి వెంకీ - చైతూ ఫెస్టివల్ కు వస్తారా లేదా?, మామా అల్లుళ్లు బాక్సాఫీస్ వద్ద తలపడే ఛాన్స్ ఉందా? అనేది చూడాలి. ఒకవేళ ఈ రెండూ రాకపోతే మాత్రం మిగిలిన చిత్రాలకు అడ్వాంటేజ్ గా మారుతుంది.