అతిగా హుక్ స్టెప్పులు.. మహిళా కమిషన్ సీరియస్!
ఈ పరిణామాల నేపథ్యంలో మహిళా కమిషన్ దీనిపై అధికారికంగా స్పందించడం ఆసక్తికరంగా మారింది.;
సినిమాల్లో పాటలు ఎప్పుడూ కూడా ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. ముఖ్యంగా మాస్ పాటలు అయితే అభిమానులను థియేటర్లకు రప్పించే మేజర్ ఫాక్టర్‌గా మారతాయి. హీరోయిన్ల గ్లామర్, డ్యాన్స్ మూమెంట్స్, క్యాచీ ట్యూన్స్ ఇవన్నీ కలిసి పాటను ట్రెండింగ్‌లో నిలబెడతాయి. అయితే, ఇటీవల ఈ ట్రెండ్ మరింత బోల్డ్ అవుతోంది. పాటలకు హుక్ స్టెప్పులు అనే కాన్సెప్ట్ వచ్చాక, హీరో, హీరోయిన్ల డ్యాన్స్ మూమెంట్స్ లో స్పష్టమైన మార్పు వచ్చింది. అయితే ఈ హుక్ స్టెప్పులు కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా కాకుండా, అనవసరమైన వాదనలకు, విమర్శలకు దారి తీస్తున్నాయి.
అల్లు అర్జున్ ‘బుట్ట బొమ్మ’ వంటి పాటల సమయంలో హుక్ స్టెప్పులు అనేవి ప్రేక్షకులకు వినోదాన్ని అందించేవి. కానీ ఇప్పుడవి మరీ ఘాటుగా మారుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల వచ్చిన రాబిన్ హుడ్ సినిమాలోని ‘అదిదా సర్‌ప్రైజు’ పాట దీనికి తాజా ఉదాహరణ. ఇందులో కేతికా శర్మ చేసిన హాట్ మూమెంట్స్, ప్రత్యేకంగా డిజైన్ చేసిన డాన్స్ మూమెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. పాట విడుదలైన కొద్ది గంటలకే హుక్ స్టెప్పులపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ మొదలైంది.
ఈ పరిణామాల నేపథ్యంలో మహిళా కమిషన్ దీనిపై అధికారికంగా స్పందించడం ఆసక్తికరంగా మారింది. కొన్ని మూమెంట్స్ మహిళల అభిమానం దెబ్బతీసేలా ఉన్నాయని, వాటిని తొలగించాలని సూచిస్తూ ప్రొడక్షన్ హౌస్ కు నోటీసులు అందినట్లు తెలుస్తోంది, ‘అదిదా సర్‌ప్రైజు’ పాటలో వివాదాస్పద హుక్ స్టెప్పులను మేకర్స్ మారుస్తున్నారని టాక్. ఇది ఒకటే కాదు, గతంలో బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమాలో ‘దబిడి దిబిడే’ పాటలోనూ ఇలాంటి సమస్యలు తలెత్తాయి.
ఊర్వశి రౌతేలా, బాలయ్య మధ్య ఓ స్టెప్ పట్ల విమర్శలు రావడంతో, చిత్రయూనిట్ విడుదలకు ముందు దాన్ని తొలగించింది. ఇలాంటి ఘటనలు రిపీట్ అవుతున్న తరుణంలో దర్శకులు, కొరియోగ్రాఫర్లు తమ డాన్స్ మూమెంట్స్‌పై మరింత జాగ్రత్త వహించాలని పరిశ్రమలో చర్చ నడుస్తోంది. గ్లామర్, మాస్ మూమెంట్స్ ఒక కొలమానానికి మించి విస్తరిస్తే, ప్రేక్షకుల్లో అసంతృప్తి పెరుగుతుందనే అంశాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది.
గతంలోనూ కొన్ని హిట్ పాటలు బోల్డ్‌గా ఉండేవే కానీ, అవి ఇబ్బందిగా లేకుండా ఉండేవి. కానీ ఇప్పుడు మ్యూజిక్‌లో కంటే బోల్డ్ స్టెప్పులపై ఎక్కువ ఫోకస్ పెడుతుండటంతో ఈ దిశగా విమర్శలు పెరుగుతున్నాయి. మొత్తానికి, ఈ తరహా పాటలు పబ్లిసిటీకి సహాయపడినా, వివాదాలను కూడా తెచ్చిపెడుతున్నాయి. నిర్మాతలు, దర్శకులు హుక్ స్టెప్పుల విషయంలో మరింత జాగ్రత్తలు పాటించాలని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ పరిస్థితి ఇలాగే కొనసాగితే, భవిష్యత్తులో మరింత కఠినమైన నిబంధనలు, సెన్సార్ పరిమితులు రావడం ఖాయంగా కనిపిస్తోంది.