'చెన్నైలో ఉండి బ‌తికిపోయాడు'.. ర‌థ‌న్‌పై డెబ్యూ డైరెక్టర్ ఫైర్‌!

ఈ సందర్భంగా దర్శకుడు యశస్వి మాట్లాడుతూ.. సినిమా ఇంత లేట్ అవ్వడానికి సంగీత దర్శకుడు రదన్ ప్రధాన కారణమంటూ విరుచుకుపడ్డారు.

Update: 2024-02-22 10:03 GMT

సంగీత ప్రియులకు మ్యూజిక్ డైరెక్టర్ రధన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. 'అందాల రాక్షసి' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన సంగీత దర్శకుడు.. ఎవడే సుబ్రహ్మణ్యం, అర్జున్ రెడ్డి, హుషారు, జాతి రత్నాలు, పాగల్, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి లాంటి సూపర్ హిట్ చిత్రాలకు పాటలు సమకూర్చారు. చిట్టీ, ఉండిపోరాదే లాంటి చార్ట్ బస్టర్ సాంగ్స్ అందించి మంచి పేరు తెచ్చుకున్న రదన్ పై.. ఇప్పుడు ఓ డెబ్యూ డైరెక్టర్ ఫైర్ అవ్వడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

రథన్ సంగీతం సమకూర్చిన లేటెస్ట్ మూవీ "సిద్ధార్థ్ రాయ్''. పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ ఈ సినిమాతో హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి వంటి స్టార్స్ డైరెక్టర్స్ దగ్గర పనిచేసిన యశస్వీ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రమోషన్ కంటెంట్ తో యూత్ ఆడియన్స్ ను ఆకట్టుకున్న ఈ సినిమా.. రేపు శుక్రవారం థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ఈ నేపధ్యంలో తాజాగా ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి కిరణ్ అబ్బవరం, త్రినాథ రావు నక్కిన, కోన వెంకట్ లాంటి ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు యశస్వి మాట్లాడుతూ.. సినిమా ఇంత లేట్ అవ్వడానికి సంగీత దర్శకుడు రదన్ ప్రధాన కారణమంటూ విరుచుకుపడ్డారు. అతను చెన్నైలో ఉండి బ‌తికిపోయాడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

"సిద్ధార్థ్ రాయ్ సినిమా షూటింగ్ త్వరగానే అయిపోయింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ డిలే డిలే అవుతూ వచ్చింది. దానికి కారణం రధన్ అనే మ్యూజిక్ డైరెక్టర్. నాలాగా ఎవరూ మోసపోకూడదనే ఈ విషయం చెప్తున్నాను. అతను అధ్బుతమైన టెక్నీషియన్ అనుకోని మనం అక్కడికి వెళ్తున్నాం. కానీ అతని చేతిలో పడి సినిమా నలిగిపోతోంది. రధన్ అనే వ్యక్తి గొడవ పడటానికే మాట్లాడతాడు" అని యశస్వి అన్నారు. దీనికి ఉదాహరణగా తమ మధ్య జరిగిన ఇన్సిడెంట్ గురించి చెప్పారు.

"ఒక సిచ్యువేషన్ కోసం డిస్కర్ చేయటానికి అపాయింట్ మెంట్ అడిగితే రేపు రేపు అంటూ పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాడు. ఒకరోజు నేను రెక్కీ కోసం వైజాగ్ వెళ్తున్నప్పుడు రాజమండ్రిలో అతని నుంచి నాకు ఫోన్ వచ్చింది.. ఆ కాల్ ఎండ్ అయ్యేసరికి వైజాగ్ వచ్చేసింది. రథన్ ఎంతగా ఆర్గుమెంట్ చేస్తాడో ఒక్కసారి ఊహించుకోండి. అతను ఎంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్, బాగా వర్క్ చేస్తాడు అనేది అటుంచితే.. సినిమాని కంప్లీట్ గా ఒక కార్నర్ కి తీసుకెళ్ళి మనల్ని వదిలేస్తాడు. రథన్ అనే మ్యూజిక్ డైరెక్టర్ చెన్నైలో ఉంటాడు. అక్కడ ఉండి బతికిపోయాడు అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఉంటే చాలా గొడవలు అయ్యేవి" అని యశస్వి ఆవేద‌న వ్య‌క్తం చేస్తూనే, సంగీత దర్శకుడిపై నిప్పులు చెరిగారు.

ర‌ధ‌న్ పై ఇలాంటి విమ‌ర్శ‌లు రావ‌డం కొత్తేమీ కాదు. ‘అర్జున్ రెడ్డి’ స‌మ‌యంలోనూ ఎలాంటి సమస్యే వచ్చింది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా అతనిపై ఓ ఇంటర్వ్యూలో తీవ్ర స్థాయిలో మండిప‌డ్డాడు. ఒకానొక దశలో 'ఈ సినిమా నేను వదిలేస్తే నువ్వు ఇప్పుడు ఏం చేస్తావ్' అని రధన్ అన్నాడని సందీప్ తెలిపారు. అందుకే అర్జున్ రెడ్డిలో కొంత భాగం బ్యాగ్రౌండ్ స్కోర్ హర్షవర్ధన్ రామేశ్వరన్ తో చేయించుకున్నట్లు వెల్లడించారు. శర్వానంద్ హీరోగా నటించిన 'రాధ' సినిమా టైంలోనూ రధన్ తో ఇష్యూ వచ్చినట్లు అప్పట్లో రూమర్స్ వినిపించాయి. ఇప్పుడు 'సిద్ధార్థ్ రాయ్' విషయంలోనూ సంగీత దర్శకుడు ఇబ్బంది ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

రథన్ మంచి పాటలు ఇస్తాడని, బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా ఇస్తాడని, మంచి టెక్నీషియ‌న్‌ అని పేరు తెచ్చుకున్నాడు. అదే సమయంలో కమిట్మెంట్ లేని టెక్నీషియ‌న్‌ అని, అనుకున్న స‌మ‌యానికి అవుట్ పుట్ ఇవ్వ‌డని, ద‌ర్శ‌క నిర్మాత‌ల్ని ఇబ్బంది పెడుతుంటాడని ఇండస్ట్రీలో చాలామంది చెబుతుంటారు. అందుకే అన్ని చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చినా, సరైన అవకాశాలు అందుకోలేక‌పోయాడనే టాక్ వుంది. ఇప్పుడు 'సిద్ధార్థ్ రాయ్' దర్శకుడు కూడా అతనిపై షాకింగ్ కామెంట్స్ చేసారు. మరి దీనిపై రధన్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Tags:    

Similar News