ఏసుదాసుకు శబరిమలలో అరుదైన గౌరవం
ఆయన పుట్టిన రోజైన జనవరి 12న (శుక్రవారం) శబరిమలలోని అయ్యప్ప ఆలయంలో ట్రావెన్ కోర్ దేవస్థానం ప్రత్యేక పూజల్ని నిర్వహించింది.
తన గానంతో కోట్లాది మంది మనసుల్ని దోచేయటంతో పాటు.. తన తీరుతో అందరి మన్ననలు పొందే ఏసుదాసు అన్నంతనే.. శబరిమల అయ్యప్ప స్వామిపై ఆయన పాడిన పాటలు ఇట్టే గుర్తుకు వస్తాయి. అన్నింటికి మించి.. అయ్యప్ప స్వామిని ఉద్దేశించి.. పవళింపు సేవ వేళ (హరిహరాసనం గేయం) ఆయన ఆలపించిన గీతాన్ని.. చివరకు స్వామి వారి మూల విరాట్ వేంచేసి ఉండే శబరిమల ఆలయంలోనూ వినియోగించటం తెలిసిందే.
పుట్టుక ఏ మతమన్నది ఎవరి చేతిలో ఉండదు. ఆ మాటకు వస్తే కళకు.. కళాకారుడికి మతం అన్నది అడ్డుకట్ట కానే కాదు. ఏసుదాసు విషయంలోనూ అదే నిజమని చెప్పాలి. ఆయన హిందువు కాకపోవచ్చు. కానీ.. భక్తి పారవశ్యంతో ఆయన ఆలపించిన భక్తి గీతాల్ని విన్నప్పుడు రోమాలు నిక్క బొడుచుకోవటమే కాదు అలౌకిక ఆనందాన్ని.. తీవ్రమైన భావోద్వేగాన్ని కలిగిస్తాయన్నది తెలిసిందే.
అలాంటి ఏసుదాసుకు తాజాగా శబరిమల అయ్యప్ప ఆలయంలో సమున్నత గౌరవం లభించింది. ఆయన పుట్టిన రోజైన జనవరి 12న (శుక్రవారం) శబరిమలలోని అయ్యప్ప ఆలయంలో ట్రావెన్ కోర్ దేవస్థానం ప్రత్యేక పూజల్ని నిర్వహించింది. అయితే.. ఏసుదాసు ప్రస్తుతం ఇండియాలో లేరు. ఆయన ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. అయితే.. ఏసుదాసు పుట్టిన రోజు సందర్భంగా ఆయన కోసం ప్రత్యేక పూజల్ని నిర్వహించారు.
ఉత్తర ఆషాఢం పూజల కోసం ఆలయాన్ని శుక్రవారమే ఓపెన్ చేశారు. ఈ సందర్భంగా అర్చకులు గణపతి హోమం చేశారు. ఏసుదాసు పుట్టిన రోజు కూడా శుక్రవారమే కావటంతో.. ఆయన పేరుతో అయ్యప్పస్వామికి నెయ్యాబిషేకం.. సహస్రనామార్చన.. ఇతర పూజలు చేసినట్లుగా ట్రావెన్ కోర్ వెల్లడించింది. అమెరికాలో ఉన్న ఏసుదాసుకు స్వామి వారి తీర్థప్రసాదాల్ని పంపనున్నట్లుగా వెల్లడిచింది.