నగరాలను చుట్టేస్తున్న నిద్రలేమి.. ఇప్పటికైనా మేలుకోకపోతే కష్టమే..

దేశవ్యాప్తంగా ఉన్న వారిలో ప్రతి ముగ్గురిలో ఇద్దరు అలసట, నీరసం లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Update: 2024-09-11 10:30 GMT

నగరాలు అభివృద్ధి కేంద్రాలు.. టెక్నాలజీకి, సాఫ్ట్వేర్ కంపెనీలకు.. ఉద్యోగ అభివృద్ధికి.. యువత భవితకు స్తంభాలు లాంటివి. అయితే ప్రస్తుతం ఈ నగరాలు అలసట కేంద్రాలుగా మారుతున్నాయి. యువత భవిత ప్రశ్నార్ధకంలో పడడంతో పాటు వారి ఆరోగ్యం పై కూడా వీటి తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు లాంటి నగరాలలో 80% కంటే ఎక్కువ మంది ప్రస్తుతం నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఇది వారి ఆరోగ్యంతో పాటు మానసిక స్థితిపై కూడా ప్రభావం చూపిస్తోంది.

దేశవ్యాప్తంగా ఉన్న వారిలో ప్రతి ముగ్గురిలో ఇద్దరు అలసట, నీరసం లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎటువంటి అనారోగ్యమైన సమస్య లేనప్పటికీ రోజువారి పనులు చేసుకోవడానికి కూడా వీరు నిస్సత్తుగా చూపిస్తున్నారు. శ్రామిక జనాభాలో ఈ అలసట ఎక్కువగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇది ముఖ్యంగా పోషకాహార లోపం అని కొందరు భావిస్తున్నారు. మరికొందరు అసలు ఇప్పుడు జీవనశైలే సరిగ్గా లేదని.. ప్రజలు తమ చుట్టూ ఉన్న వాతావరణం తో పాటు రోజువారి అలవాట్లలో కూడా ఎంతో మార్పు తీసుకురావాలని సూచిస్తున్నారు.

కంటి నిండా నిద్ర, పౌష్టికాహారం లోపించడమే వీటికి ముఖ్య కారణం అని.. అందుకే రోజంతా ఉత్సాహంగా ఉల్లాసంగా.. ఉండలేకపోతున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ముఖ్యంగా చేతిలో మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత గంటలకొద్దీ సోషల్ మీడియాలో గడపడానికి ప్రాధాన్యత ఇస్తూ అర్ధరాత్రి వరకు మేలుకోవడం ప్రస్తుతం ట్రెండింగ్ గా ఉంది. దీంతో శరీరంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది.

నిద్రించాల్సిన సమయంలో నిద్ర పోకుండా.. పగటిపూట నిద్రపోవడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు. అందుకే 85% వరకు ప్రజలు తీవ్రమైన అలసటతో బాధపడుతున్నారని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.

'బేయర్స్ హెల్త్ డివిజన్' సంస్థ హైదరాబాదు లాంటి 10 మహా నగరాలలో నిర్వహించిన అధ్యయనంలో కొన్ని ఆశ్చర్యకర విషయాలు వెల్లడయ్యాయి. జాతీయ పోషకాహార వారోత్సవం సందర్భంగా ఆ సంస్థ ఈ వివరాలను ఇటీవల వెల్లడి చేసింది.

ఈ అధైనాల ప్రకారం సుమారు 78 శాతం మంది 25-35 సంవత్సరాల మధ్య వయసు వారు పగటిపూట మత్తుగా ఉంటున్నారు. వీరిలో చాలామంది ఎప్పుడు నిస్సత్తువుగా ఏదో కోల్పోయినట్టుగా ఉంటున్నారు. ఇటువంటి సమస్యలు ఎక్కువైతే డ్రగ్స్ లాంటి దురాలవాట్లు సులభంగా అలవాటు అవుతాయి. ఈ సమస్యలో మన సమాజం చిక్కుకోకుండా ఉండాలి అంటే మన రోజువారి అలవాట్లు పూర్తిగా మార్చుకోవాలి. శరీరానికి తగినంత నిద్ర ఇవ్వడంతో పాటు వ్యాయామాన్ని కూడా అందివ్వాలి. పౌష్టికాహారాలతో పాటు సహజంగా లభ్యమయ్యే ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. తల్లిదండ్రులు టీనేజర్స్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇవన్నీ ఇప్పటినుంచే నేర్పిస్తే వారు భవిష్యత్తులో ఇబ్బంది పడకుండా ఉంటారు అంటున్నారు నిపుణులు.

Tags:    

Similar News