దీనివల్లే రాబోయే రోజుల్లో 100 కోట్ల మంది బలి!
గ్లోబల్ వార్మింగ్ (భూమి వేడెక్కడం, భూతాపం) ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది.
గ్లోబల్ వార్మింగ్ (భూమి వేడెక్కడం, భూతాపం) ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. ఇష్టానుసారంగా అడవులను నరికేయడం, విపరీతంగా శిలాజ ఇంధనాలు వాడకం, ప్లాస్టిక్ వినియోగం, ప్రకృతిని నాశనం చేస్తున్న మానవ చర్యలు ఇలా తదితర కారణాలతో భూమి వేడెక్కుతోంది. దీంతో రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోతాయని అంచనాలు ఉన్నాయి. ఈ ఏడాది మేలో ఇరాన్ లోని చురు ఎడారిలో 50 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే ఎప్పుడూ శీతలంగా ఉండే యూరోపియన్ దేశాలు కూడా అధిక ఉష్ణోగ్రతలకు అల్లాడిపోయాయి. అమెరికాలోనూ భారీ ఉష్ణోగ్రతలకు ప్రజలు పిట్టల్లా రాలిపోయారు.
ఇక మనదేశంలోనూ భారీ ఉష్ణోగ్రతలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం వర్షాకాలం అయినా చాలా ప్రాంతాల్లో వేసవిని తలపించేలా ఉష్ణోగ్రతలు ఉండటం గమనార్హం. వీటన్నింటికీ గ్లోబల్ వార్మింగే కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న కాలం మానవాళికి అనేక కష్టాలను తెచ్చిపెడుతుందని అంటున్నారు. కోవిడ్ సృష్టించిన విలయాన్ని మించి మానవాళి నాశనమయ్యే పరిస్థితులు ఉత్పన్నమవుతాయని పేర్కొంటున్నారు.
వాతావరణ మార్పులతో రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల మంది ప్రజలు మరణిస్తారని శాస్త్రవేత్తలు తాజాగా బాంబుపేల్చారు.
ఈ వంద కోట్ల మంది ఏదో ఒక ప్రాంతానికే చెందినవారు కాదు. ఇందులో ప్రపంచంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఉన్నారు.
యూనివర్శిటీ ఆఫ్ వెస్ట్రన్ అంటారియో ఇటీవల వాతావరణ మార్పులపై ఒక పరిశోధన చేసింది. ఈ పరిశోధనలో అనేక విస్మయకర అంశాలు వెలుగుచూశాయి. భవిష్యత్తులో పెరగబోయే ఉష్ణోగ్రతలు మానవుల మరణాలకు ఎలా కారణమవుతాయో తెలుసుకున్నారు.
గ్లోబల్ వార్మింగ్ మానవాళికి పెనుముప్పును తెస్తోందని శాస్త్రవేత జాన్ పియర్స్ హెచ్చరించారు. ఖచ్చితంగా ఎంతమంది చనిపోతారనేది చెప్పలేనప్పటికీ 100 కోట్ల మంది అయితే ఖాయంగానే ఉంటారని ఆయన బాంబుపేల్చారు. ఏటా భూతాపం పెరుగుతున్న తీరు చూస్తుంటే రానున్న కాలంలో ప్రపంచం నిప్పుల కొలిమిలా మారనుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో గ్లోబల్ వార్మింగ్ ను అరికట్టాలంటే వాతావరణ మార్పులపై దృష్టి సారించాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కర్బన ఉద్గారాలను పూర్తిగా నియంత్రించాలి. ఒక ఉద్యమంలాగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ప్రభుత్వాలు కర్బన ఉద్గారాల కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలి. ఇందుకు ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించే చర్యలు చేపట్టాలి.
ముఖ్యంగా ప్రపంచంలో శిలాజ ఇంధనాల (పెట్రోలు, డీజిల్, బొగ్గు) వాడకాన్ని వీలైనంత త్వరగా నిలిపివేయాలని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. శిలాజ ఇంధనాలు వాతావరణ మార్పులకు, భూతాపానికి ప్రధాన కారణమని చెబుతున్నారు. అన్ని ప్రభుత్వాలు కార్బన్ వేస్ట్ మేనేజ్‌మెంట్, కార్బన్ డయాక్సైడ్ ను సహజంగా నిల్వ చేయడానికి దోహదపడే టెక్నాలజీని అభివృద్ధి చేయాలని సూచిస్తున్నారు.