ఆకాశమే హద్దుగా.. 10 గ్రాముల బంగారం ధర అంతనా?
మొత్తంగా చూస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.71,300కు చేరింది.
ఆకాశమే హద్దుగా పెరుగుతోంది బంగారం ధర. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు.. స్థానికంగా పెళ్లిళ్ల సీజన్ కావటంతో డిమాండ్ అంతకంతకూ ఫెరుగుతోంది. మొత్తంగా చూస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.71,300కు చేరింది. 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం ధర రూ.64వేల వద్దకు చేరుకుంది. దీంతో.. సరికొత్త ధరలను చేరుకున్నట్లైంది. గడిచిన కొన్నేళ్లుగా పది గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.60-70 వేల మధ్య ఉన్న సంగతి తెలిసిందే. తాజా పెరుగుదలతో రూ.70వేల మార్కును దాటినట్లైంది.
వారం వ్యవధిలో బంగారం ఔన్సు ధర 90 డాలర్ల మేర పెరగటం గమనార్హం. 31.10 గ్రాములను ఒక ఔన్స్ గా లెక్కిస్తారన్న సంగతి తెలిసిందే. వారం క్రితం దీని ధర 2165 డాలర్లు ఉంటే తాజాగా అది కాస్తా 2255కు పెరగటం గమనార్హం. భారీగా బంగారం ధరలు పెరగటంతో అమ్మకాలు తగ్గుతున్నాయి. ఇక్కడే మరో ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించాలి. గత ఏడాది అక్షయ త్రతీయ రోజున బంగారం 24 క్యారెట్లు 10 గ్రాములు రూ.62,400 ఉంటే.. ఏడాది వ్యవధిలో రూ.9వేలు పెరగటం గమనార్హం.
కొంతకాలంగా బంగారం ధరలు పెరుగుతున్నా.. ఇంత భారీగా పెరగటం మాత్రం ఈ మధ్య కాలంలోనేనని చెప్పాలి. గడిచిన 45 రోజుల్లో బంగారం ధర 15 శాతానికి పైగా పెరిగింది. ధర ఎంత పెరుగుతుంది? ఎప్పుడు తగ్గుతుంది? అన్నది నిపుణులు సైతం అంచనా వేయటం కష్టంగా ఉందని చెబుతున్నారు. ఈ ఏడాదిలో వడ్డీరేట్లు తగ్గిస్తామని అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రకటించటం.. రూపాయితో పోలిస్తే డాలర్ మారకపు విలువ బాగా పెరగటం తెలిసిందే.
బంగారం ధర గడిచిన 20 ఏళ్లలో ఎంత భారీగా పెరిగిందో చూస్తే అవాక్కు అవ్వాల్సిందే. 2004 (అంటే 20 ఏళ్ల క్రితం) ఏప్రిల్ 22న 24 క్యారెట్ల బంగారం ధర రూ.5800గా ఉండేది. ఈ ఏడాది ఏప్రిల్ 1న (సోమవారం) అదే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.71,300 చేరుకుంది. అంటే 20 ఏళ్లలో 1129.3 శాతం పెరిగింది. ఈ నెల 26తో పెళ్లి ముహుర్తాలు ముగియనున్నాయి. వచ్చే వారం వచ్చే శ్రీరామనవమి తర్వాత కొన్ని ముహుర్తాలు ఉన్నాయి. ఏప్రిల్ 26 నుంచి మూఢం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మూడు నెలల పాటు ముహుర్తాలు లేని పరిస్థితి నెలకొంది.