ఈ రోజు సాయంత్రం భాగ్యనగరిలో 2 భారీ ర్యాలీలు.. బీకేర్ ఫుల్!

క్రికెట్ అభిమానులు రోడ్ల మీదకు రావటం.. జనసంద్రంగా రోడ్లు మారిన నేపథ్యంలో.. హైదరాబాద్ లో ఒక పొలిటికల్ ర్యాలీ.. మరొక క్రీడావిజయోత్సవ ర్యాలీ జరుగుతుందన్న

Update: 2024-07-05 08:09 GMT

అవును.. కొన్ని గంటల వ్యవధిలో హైదరాబాద్ మహానగరంలో రెండు భారీ ర్యాలీలు జరుగుతున్నట్లుగా వాట్సాప్ గ్రూపుల్లో.. సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ రెండు ర్యాలీలకు సంబంధించి మద్దతుదారులుగా చెప్పుకునే వారు ఎవరికి వారుగా పోస్టులు పెడుతుండటం.. అవి కాస్తా అదే పనిగా ఫార్వర్డ్ అవుతున్న నేపథ్యంలో.. ఈ రోజు (శుక్రవారం) సాయంత్రం బయటకు వెళ్లే వాళ్లు కాస్తంత జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

టీ20 వరల్డ్ కప్ గెలిచిన నేపథ్యంలో.. టీమిండియా జట్టులో కీలక ఆటగాళ్లలో ఒకడైన సిరాజ్ నగరానికి వస్తున్న నేపథ్యంలో ఆయన స్నేహితులు పలువురు కలిసి భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు. సిటీ పోలీసుల నుంచి కూడా ఎలాంటి సమాచారం లేదు. వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం జరుగుతున్న దాని ప్రకారం చూస్తే.. మెహిదీపట్నం మొదలుకొని బంజారాహిల్స్ వరకు భారీ ర్యాలీ నిర్వహించేందుకు వీలుగా సన్నాహాలు సాగుతున్నట్లుగా తెలుస్తోంది.

Read more!

మరోవైపు.. ఏపీ ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారి చంద్రబాబు బేగంపేట ఎయిర్ పోర్టుకు రానున్నారు.దీంతో.. ఆయనకు భారీగా స్వాగతం పలికేందుకు వీలుగా తెలుగు తమ్ముళ్లు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. బేగంపేట నుంచి మొదలయ్యే ఈ బైక్ ర్యాలీ.. బాబు నివాసమైన జూబ్లీహిల్స్ వరకు సాగుతుందని చెబుతున్నారు. అదే జరిగితే.. నగరంలోని రెండు కీలకమైన ప్రాంతాల్లో సాగే ర్యాలీలతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాంలకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా శుక్రవారం సాయంత్రాలు రోడ్లు మొత్తం బిజీబిజీగా ఉంటూ.. భారీ ట్రాఫిక్ ఉంటుంది.

తాజాగా రెండు పెద్ద ర్యాలీలు జరుగుతుందన్న ప్రచారం నిజమైతే.. ట్రాఫిక్ కష్టాలు మామూలుగా ఉండవని చెప్పక తప్పదు. గురువారం ముంబయిలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో వేలాదిగా క్రికెట్ అభిమానులు రోడ్ల మీదకు రావటం.. జనసంద్రంగా రోడ్లు మారిన నేపథ్యంలో.. హైదరాబాద్ లో ఒక పొలిటికల్ ర్యాలీ.. మరొక క్రీడావిజయోత్సవ ర్యాలీ జరుగుతుందన్న ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో హైదరాబాదీలు కాస్త ఆలోచించి ఇళ్ల నుంచి బయటకు వెళ్లే విషయంలో ప్లాన్ చేసుకుంటే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకైనా మంచిది జర జాగ్రత్త.

Tags:    

Similar News

eac