తెరపైకి కొత్త టెన్షన్... నేతల కోసం ఏపీ హైకోర్టులో ప్రత్యేక బెంచ్!
సుప్రీం ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ లోని ఎమ్మెల్యేలు, ఎంపీలపై విచారణ పెండింగ్ లో ఉన్న క్రిమినల్ కేసుల వివరాలు కోరుతూ ఏపీ హైకోర్టు.. విజయవాడలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు ఆదేశాలు ఇచ్చింది.
ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణకు ప్రత్యేక బెంచ్ లను ఏర్పాటు చేయాలని సుప్రీం ధర్మాసనం పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై దాఖలైన పిటిషన్ పై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఇందులో భాగంగా... ప్రజాప్రతినిధులపై పెండింగ్ లో ఉన్న క్రిమినల్ కేసుల సత్వర విచారణకు ప్రత్యేక బెంచ్ లను ఏర్పాటు చేయాలని హైకోర్టులను ఆదేశించారు. ఈ సమయంలో ఏపీలో నేతలకు కొత్త టెన్షన్ స్టార్ట్ అయ్యిందని తెలుస్తుంది!
అవును... వచ్చే ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. దేశంలో క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ఎంపీలు, ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు ఇటీవల భారీ షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... వీరిపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణను వేగవంతం చేసేందుకు వీలుగా హైకోర్టులో స్పెషల్ బెంచ్ లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ సమయంలో ఏపీలో ఎంపీ, ఎమ్మెల్యేలపై నమోదైన 78 కేసులపై నివేదిక తెప్పించుకున్న హైకోర్టు.. వీటికోసం ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది.
సుప్రీం ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ లోని ఎమ్మెల్యేలు, ఎంపీలపై విచారణ పెండింగ్ లో ఉన్న క్రిమినల్ కేసుల వివరాలు కోరుతూ ఏపీ హైకోర్టు.. విజయవాడలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు ఆదేశాలు ఇచ్చింది. దీనిపై స్పందించిన విజయవాడ కోర్టు.. 78 మంది ప్రజాప్రతినిధులపై ఉన్న పెండింగ్ కేసుల్ని హైకోర్టుకు నివేదించింది. దీంతో... వీటిని సత్వరమే విచారించేందుకు వీలుగా పూర్తి వివరాలతో రిపోర్టు అందజేసింది.
దీంతో.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటయ్యే ఈ ప్రత్యేక బెంచ్.. కేవలం ప్రజా ప్రతినిధులపై ఉన్న పెండింగ్ క్రిమినల్ కేసుల్ని మాత్రమే విచారిస్తోంది. దీంతో ఈ విచారణ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో బెంచ్ పనిచేయనుందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ 78 కేసుల్లో ఉన్న ప్రజాప్రతినిధులకు షాక్ లు తగులుతాయా.. క్లీన్ చీట్ లు వచ్చి మరింత కంఫర్ట్ ని ఇస్తాయా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
వాస్తవానికి ఎన్నికల వేళ అఫిడవిట్లలో తమపై ఉన్న పెండింగ్ కేసుల వివరాలను పేర్కొనాల్సి వస్తుంది. ఆ సంగతి అలా ఉంటే... తాజాగా ఏర్పాటుచేయబోతున్న స్పెషల్ బెంచ్ ఈ ఈ 78 కేసుల్లోనూ ప్రజాప్రతినిధులుగా ఉన్నవారికి రెండేళ్లకు పైగా శిక్ష విధిస్తే... సీన్ మొత్తం రివర్స్ అయిపోతుంది! కారణం... ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎన్నికల్లో పోటీకి రెండేళ్లకు పైగా శిక్ష పడినవారు అనర్హులయ్యే పరిస్ధితి ఉంటుంది.
ఈ నేపథ్యంలో సరిగ్గా ఎన్నికలకు మరో మూడు నాలుగు నెలల సమయం ఉందనగా... హైకోర్టు ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేసి జరిపే విచారణలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంటోంది. ఈ 78 కేసుల్లోనూ ఎలాంటి తీర్పులు రాబోతున్నాయి.. ఇప్పుడున్న నేతల్లో ఎంత మంది అనర్హులయ్యే అవకాశం ఉంది.. మరెంత మందికి క్లీన్ చీట్ దొరికే ఛాన్స్ ఉందనేది వేచి చూడాలి! ఏది ఏమైనా... ఎన్నికలు సమీపిస్తున్న ఏపీ రాజకీయాల్లో ఇది కీలక పరిణామమే!