జాతీయ పార్టీలు 6.. పదేళ్లలోనే కేజ్రీ ‘‘ఆప్’’నకు హోదా
మద్యం విధానం కేసులో కేజ్రీవాల్ అరెస్టయిన నేపథ్యంలో ఆప్ జాతీయ పార్టీ అనే అంశం ప్రత్యేకంగా నిలుస్తోంది.
దేశంలో ప్రస్తుతం ఉన్న జాతీయ పార్టీలు ఆరు మాత్రమే. అవి కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, సీపీఎం, ఎన్సీపీ.. మరి మిగతా ఆ ఒక్క పార్టీ ఏమిటో తెలుసా..? ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్థాపించిన ఆమ్ ఆద్మీ పార్టీ. మద్యం విధానం కేసులో కేజ్రీవాల్ అరెస్టయిన నేపథ్యంలో ఆప్ జాతీయ పార్టీ అనే అంశం ప్రత్యేకంగా నిలుస్తోంది.
సీపీఐకీ దక్కలేదు..
దాదాపు వందేళ్లుగా దేశ రాజకీయాల్లో ఉన్న సీపీఐ (కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా)కు జాతీయ పార్టీ హోదా పోయింది. ఇంకా దేశంలో ఎన్నో పార్టీలు కనుమరుగై పోతుండగా, జాతీయ హోదా కోల్పోతుండగా ఆప్ మాత్రం ఆ హోదా పొందింది. దీనిని కేవలం పదేళ్లలోనే సాధించింది ఆ పార్టీ. 2014కి ముందు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అన్నా హజారే నేతృత్వంలో లేచిన లోక్ పాల్ ఉద్యమంలో కేజ్రీ ఒకరు. అనంతరం రాజకీయంగా వచ్చిన సవాల్ ను స్వీకరించారు. ఆప్ ను స్థాపించారు. ఎన్నికల గుర్తుకు అప్లై చేయగా ‘‘చీపురు’’ను కేటాయించారు.
రెండు పోయి.. ఒకటి వచ్చింది.
కొన్నేళ్ల కిందటి వరకు దేశంలో 8 పార్టీలు జాతీయ స్థాయి గుర్తింపు పొందాయి. ఇటీవలి కాలంలో రెండు పార్టీలు ఆ గుర్తింపును కోల్పోయాయి. వీటి స్థానంలో ఆప్ వచ్చింది. నిరుడు గుజరాత్ ఎన్నికల్లో ఆప్ 12.9 శాతం ఓట్లు సాధించింది. దీంతో జాతీయ హోదా ఖరారైంది. తక్కువ సమయంలో జాతీయ గుర్తింపు పొందిన పార్టీల్లో ఒకటిగా కూడా ఘనత సాధించింది. ప్రస్తుతం పంజాబ్, ఢిల్లీలో అధికారంలో ది. గుజరాత్, గోవాల్లో ఎమ్మెల్యేలు ఉన్నారు.. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీల్లో ప్రాతినిధ్యం లభించడంతోనే జాతీయ గుర్తింపు దక్కింది.
జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే
1. సాధారణ ఎన్నికల్లో పార్లమెంట్ లేదా అసెంబ్లీ స్థానాల్లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో పోటీ చేయాలి. ఎన్నికల్లో పోలైన, చెల్లిన ఓట్లలో 6 శాతం సాధించాలి. కనీసం ఒక రాష్ట్రం నుంచి నాలుగు లోక్‌సభ స్థానాలు గెలవాలి.
2. ఏవైనా నాలుగు రాష్ట్రాల నుంచి 11 లోక్‌సభ సీట్లు (2 శాతం సీట్లు) సాధించాలి. గెలుపొందిన అభ్యర్థులు కనీసం 3 రాష్ట్రాల నుంచి ఎన్నికవ్వాలి.
3. కనీసం నాలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొంది ఉండాలి. జాతీయ పార్టీగా పేరు నమోదు చేసుకునే పార్టీ గుర్తు.. దేశంలోని మరే ఇతర పార్టీ చిహ్నంగా ఉండకూడదు.