అమెరికాలో ప్లస్ టూ విద్యార్థి కాల్పులు.. ఐదుగురు మృతి
స్కూల్లో చదువుకునే ప్లస్ టూ విద్యార్థి కాల్పులకు తెగబడిన ఉదంతంలో ఐదుగురు అమాయక విద్యార్థులు మృత్యువాత పడ్డారు
అగ్రరాజ్యంలో గన్ కల్చర్ మరోసారి తీవ్ర విషాదాన్ని నింపింది. స్కూల్లో చదువుకునే ప్లస్ టూ విద్యార్థి కాల్పులకు తెగబడిన ఉదంతంలో ఐదుగురు అమాయక విద్యార్థులు మృత్యువాత పడ్డారు. మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ షాకింగ్ ఉదంతం విస్కాన్సిన్ స్టేట్ మాడిసన్ లోని ఒక క్రిస్టియన్ స్కూల్లో చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్ష్యులు అందించిన సమాచారం ప్రకారం అబండంట్ క్రిస్టియన్ స్కూల్లో ప్లస్ టూ (పన్నెండో తరగతి) విద్యార్థి విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. కాల్పుల్లో మరణించిన వారిలో విద్యార్థులు ఉన్నారు.
కిండర్ గార్డెన్ నుంచి ప్లస్ టూ వరకు ఉన్న ఈ స్కూల్లో మొత్తం 400 మంది విద్యార్థులు చదువుతున్నట్లుగా మాడిసన్ పోలీస్ విభాగం ప్రకటన జారీ చేసింది. గాయపడిన వారి శరీరాల్లో పలు బుల్లెట్ల గాయాలు ఉన్నట్లుగా వైద్య వర్గాలు వెల్లడిస్తున్నాయి. కాల్పుల ఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంతం ఉలిక్కిపడింది. కాల్పుల సమాచారం అందుకున్న అధికారులు పెద్ద ఎత్తున పోలీసు వాహనాలు.. అంబులెన్స్ లు.. ఫైరింజన్లను స్కూల్ ఆవరణలో మొహరించారు. రెస్క్యూ నిర్వహించి స్కూల్లో ఉన్న విద్యార్థుల్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. కాల్పుల సమాచారం అందిన వెంటనే.. విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ ప్రాంగణానికి చేరుకున్నారు. వారంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇదిలా ఉండగా.. కాల్పులకు తెగబడిన నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? లేదా? అన్నది తేలాల్సి ఉంది.
విద్యార్థి కాల్పులు జరిపిన ఉదంతానికి సంబంధించిన సమాచారాన్ని దేశాధ్యక్షుడు బైడెన్ కు అందించారు. ఈ ఘటనపై మాడిసన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాల్పులకు తెగబడిన విద్యార్థి వివరాల్ని పోలీసులు వెల్లడించలేదు. తాజా ఉదంతం అగ్రరాజ్యంలోని గన్ కల్చర్ మీద మరోసారి చర్చకు తెర తీసింది. గన్ నియంత్రణ.. స్కూళ్ల భద్రత ఇప్పుడు ఆ దేశంలో రాజకీయ.. సామాజిక సమస్యగా మారటం తెలిసిందే.
ఇటీవల కాలంలో స్కూళ్లలో కాల్పుల ఘటనలు అంతకంతకూ ఎక్కువ అవుతున్న విషయాన్ని ఒక నివేదిక వెల్లడించింది. కే12 స్కూల్ షూటింగ్ డేటాబేస్ వెబ్ సైట్ ప్రకారం.. ఈ ఏడాది అమెరికాలో 322 కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయని సదరు రిపోర్టు పేర్కొంది. . గడిచిన కొన్ని సంవత్సరాలతో పోలిస్తే.. స్కూళ్లలో కాల్పుల ఘటనలు పెరుగుతున్న వైనం ఆందోళనకు గురి చేస్తోంది. 1966 నుంచి ఇప్పటివరకు చోటు చేసుకున్న కాల్పుల ఉదంతాల్లో ఈ ఏడాది రెండో అత్యధికంగా పేర్కొంటున్నారు. గత ఏడాది 349 విషాద ఉదంతాలు చోటు చేసుకుంటే.. ఈ ఏడాది 322 ఘటనలు చోటు చేసుకున్నాయి.