నాదెండ్ల మీద పెద్ద ఆరోపణే మరి !?

నాదెండ్ల చార్జి తీసుకోగానే రేషన్ షాపుల మీద వరస దాడులు చేస్తున్నారు. ఆయనే స్వయంగా వెళ్ళి మరీ తూనికలు కొలతలూ చెక్ చేస్తున్నారు.

Update: 2024-07-15 16:25 GMT

చంద్రబాబు కేబినెట్ లో వివాద రహిత మంత్రిగా ఉన్న వారిలో నాదెండ్ల మనోహర్ ఒకరు. ఆయన జనసేనలో టాప్ టూ లీడర్. ఆయన తన మంత్రిత్వ శాఖల విషయంలో పూర్తి అవగాహనతో నిబద్ధతతో పనిచేస్తున్నారు. ఆయన పౌర సరఫరాల శాఖను ఇచ్చారు. ఈ శాఖలో నాదెండ్ల వరస సమీక్షలు నిర్వహించడమే కాకుండా రేషన్ దుకాణం లోకి వెళ్ళి అక్కడ తనిఖీలు చేపడుతున్నారు.

తూనికలు కొలతలు చెక్ చేస్తూ తప్పుడుగా వ్యవహరించే డీలర్ల మీద కేసులకు అధికారులను ఆదేశిస్తున్నారు. అయితే నాదెండ్ల ఈ విధంగా సర్ప్రైజ్ రైడ్స్ చేయడం రాజ్యాంగ విరుద్ధం ఇల్లీగల్ అని రిటైర్డ్ బ్యూరో క్రాట్, ఆం ఆద్మీ పార్టీ రాష్ట్ర నాయకుడు పీవీఎస్ శర్మ ఎక్స్ వేదికగా తప్పు పట్టారు. ఆయన చంద్రబాబుకు తన ట్వీట్ ద్వారా ట్యాగ్ చేస్తూ ఒక మంత్రి ఎలాంటి వారెంట్ లేకుండా రేషన్ దుకాణాలలోకి నేరుగా పోవడం చట్ట విరుద్ధం అని స్పష్టం చేశారు.

అంతే కాదు వరస దాడులు చేస్తూ రేషన్ డీలర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అని ఆరోపించారు. చిన్న చిన్న రేషన్ దుకాణాలలోకి మంత్రి వెళ్తూ ఈ విధంగా రైడ్స్ చేయడం తప్పు అన్నారు. ఇది సాంకేతికంగా కూడా సరైన చర్య కాదని దీనిని చక్కదిద్దేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబుని కోరారు.

నాదెండ్ల చార్జి తీసుకోగానే రేషన్ షాపుల మీద వరస దాడులు చేస్తున్నారు. ఆయనే స్వయంగా వెళ్ళి మరీ తూనికలు కొలతలూ చెక్ చేస్తున్నారు. బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు విషయంలో కూడా వారు తప్పులు చేస్తే పట్టుకుంటున్నారు. అయితే ఇది కరెక్ట్ విధానం కాదన్నదే శర్మ అభిప్రాయం. ముందుగా వారంట్ ఇచ్చి ఆ మీదటనే దాడులు చేయాలని సూచిస్తున్నారు.

ఈ విధంగా చేయడం వల్ల రేషన్ డీలర్లలో భయాందోళనలు ఒక్క సారిగా పెరిగిపోతున్నాయని అన్నారు. ఇలా రాజ్యాంగపరంగా మంత్రి చేస్తున్నది తప్పు అని దీనిని ముఖ్యమంత్రి చక్కదిద్దాలని శర్మ కోరుతున్నారు. మరి దీని మీద సీఎం హోదాలో బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.

ఏది ఏమైనా నాదెండ్ల మీద ఈ తరహా ఆరోపణలు రావడం కొంత విస్మయమే అని అంటున్నారు. అదే సమయంలో రేషన్ డీలర్లు కమిషన్ తీసుకుని పనిచేసే వారు. వారు ప్రభుత్వ ఉద్యోగులు కారు. వారికి ఏ రకమైన గౌరవ వేతనం కూడా దక్కదు. దాంతో పాటుగా తూకాలలో ఎక్కడైనా పొరపాట్లు జరిగినా సరుకు తక్కువ వచ్చినా కొంతమంది డీలర్లు అకారణంగా బలి అవుతున్నారు అన్న చర్చ ఉంది.

ఇక మినిస్టర్ హోదాలో ఎపుడూ ఎవరూ పెద్దగా రేషన్ షాపులను గతంలో తనిఖీ చేసినది లేదు. కానీ నాదెండ్ల మాత్రం ఈ విషయంలో కొత్త పద్ధతిలో వెళ్తున్నారు. మరి ఇందులో రాజ్యాంగ బద్ధత లేదు అని ఆప్ నాయకుడు శర్మ అంటున్నారు. చూడాలి మరి ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అవుతుందో.

Tags:    

Similar News