సభలు-సంప్రదాయాలు.. ఏం జరిగింది?
అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం.. పట్టు-బెట్టు అలానే కొనసాగింది. ఎవరూ తగ్గలేదు.
రాజకీయ నేతలను ప్రజలు మార్చారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఎవరికి ఎన్ని సీట్లు ఇవ్వాలో అన్ని సీట్లు ఇచ్చారు. ఎవరిని ఎక్క డ కూర్చోబెట్టాలో అక్కడే కూర్చోబెట్టారు. మార్పు వచ్చింది. అయితే.. ఈ మార్పు నాయకుల్లో రాలేదు. సభల్లోనూ రాలేదు. తాజాగా జరుగుతున్న పార్లమెంటు సమావేశాలు .. మరోసారి పాత వాసనల కంపే కొట్టాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం.. పట్టు-బెట్టు అలానే కొనసాగింది. ఎవరూ తగ్గలేదు. దీంతో పార్లమెంటు ఉభయ సభలూ వాయిదా పడ్డాయి.
ఏం జరిగింది?
లోక్‌సభ ఐదోరోజైన శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. ఈ క్రమంలో ప్రభుత్వ పక్షం.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశ పెట్టింది. అయితే.. విపక్ష సభ్యులు మాత్రం నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై చర్చకు పట్టుబట్టారు. లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన నీట్ అంశంపై చర్చించాలని కోరారు. అయితే, స్పీకర్ దీనికి అంగీకరించలేదు.
ఈ నేపథ్యంలో విపక్షసభ్యులు ఆందోళనకు దిగడంతో సభను తొలుత 12 గంటల వరకు వాయిదా వేశారు. అనంతరం సభ తిరిగి ప్రారంభమైనప్పటికీ.. విపక్ష సభ్యులు నీట్ అవకతవకలపై చర్చకు పట్టుబట్టడం తో సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఇక, రాజ్యసభ సమావేశాలు కూడా ఇలానే జరిగాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించాలని బీజేపీ సభ్యులు సుధాంశు త్రివేది ప్రతిపాదించారు. దీంతో చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ధన్యవాద తీర్మానంపై చర్చ చేపట్టారు.
అయితే.. దేశంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న నీట్ అంశాన్ని చర్చకు చేపట్టాలని.. రాజ్యసభలో విపక్ష నాయకుడు మల్లిఖార్జున ఖర్గే సహా పలువురు విపక్ష సభ్యులు పట్టుబట్టారు. ఈ సందర్భంగా చైర్మన్‌కు, సభ్యులకు మధ్య కొంత సేపు వాగ్వాదం జరిగింది. దీంతో చైర్మన్ సభను వాయిదా వేశారు. అంటే.. సభల్లో గతంలో ఉన్న విధానాలు కొనసాగాయి. ఇటు విపక్షం చెబుతున్న వాదనను అధికార పక్షం.. అధికార పక్షం వాదనను విపక్షం వినిపించుకోకపోవడంగమనార్హం. ఫలితంగా సభలు-సంప్రదాయాలు,.. నట్టేట మునుగుతున్నాయి.