విమానంలో మహిళలు, చిన్నారులు... స్క్రీన్స్ పై అడల్ట్ మూవీ!!

అవును... విమానంలో ప్రయాణిస్తున్న ప్రతీ ప్రయాణికుడికి ప్రత్యేకంగా ఉన్న ఎల్.ఈ.డీ. స్క్రీన్ లలో ఓ సినిమా ప్రసారం మొదలైంది.

Update: 2024-10-07 17:30 GMT

ఇటీవల కాలంలో ప్రయాణికులకు విమానాల్లో ఎదురవుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావనే సంగతి తెలిసిందే. వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదీకగా ప్రపంచానికి ఇట్టే తెలుస్తున్నాయి. ఇందులో కొన్ని సదరాగా ఉంటే, మరికొన్ని అసహ్యంగా ఉంటాయి, ఇంకొన్ని జుగుప్సాకరంగాను ఉంటాయి. ఈ క్రమంలో తాజాగా మరో అసభ్యకరమైన వ్యవహారం జరిగింది.

అవును... విమానంలో ప్రయాణిస్తున్న ప్రతీ ప్రయాణికుడికి ప్రత్యేకంగా ఉన్న ఎల్.ఈ.డీ. స్క్రీన్ లలో ఓ సినిమా ప్రసారం మొదలైంది. అయితే అది "అడల్ట్ కంటెంట్" ఉన్న మూవీ. దీంతో... ఆ విమానంలో చిన్నారులతో ప్రయాణిస్తున్న మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కారణం.. అది అడల్ట్ కంటెంట్ ఉన్న మూవీ కాగా.. ఆ స్క్రీన్స్ ని ఆఫ్ చేసే అవకాశం లేని టెక్నికల్ సమస్య తెరపైకి వచ్చింది.

వివరాళ్లోకి వెళ్తే... ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి జపాన్ లోని హనెడాకు క్వాంటాస్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఫ్లైట్ బయలుదేరింది. ఈ సమయంలో ఆ విమానంలోని ప్రయాణికుల్లో చిన్నారులు, మహిళలు చాలా మందే ఉన్నారు. ఈ క్రమంలో... వారందరి కోసం సిబ్బంది ఓ చిత్రాన్ని ప్రదర్శించడం ప్రారంభించింది. అయితే... అది అడల్ట్ కంటెంట్ ఉన్న చిత్రం!

దీంతో... ఆ సమయంలో చిన్నారులు, మహిళలు చాలా ఇబ్బంది పడ్డారు! తమకు ఆ ప్రసారం అవసరం లేదని భావించి.. ఆపేద్ద్దామని ప్రయత్నించినా కుదరలేదు. దీనికి టెక్నికల్ సమస్యే కారణం అని ఎయిర్ లైన్స్ సిబ్బంది భావించారు. దీంతో... కాసేపటి తర్వాత ఎలాగోలా ప్రయత్నించి దాన్ని నిలిపేశారు.

ఆ తర్వాత కాసేపటికి చిన్నపిల్లలకు నచ్చె సినిమాను ప్రదర్శించారు! అయితే... అంతకముందు ఎదురైన అనుభవంతో ఇబ్బంది పడిన పలువురు ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎవరి స్కీన్ వారు ఆపుకునే అవకాశం లేకపోవడంపై ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో క్వాంటాస్ విమానయాన సంస్థ స్పందించింది. ఈ అసౌకర్యానికి క్షమించాలంటూ ఓ ప్రకటన విడుదల చేసింది.

ఈ చేదు అనుభవం ఎదుర్కొన్న ప్రతీ ప్రయాణికుడికి తాము క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపింది క్వాంటాస్ విమానయాన సంస్థ. వెంటనే సినిమాను మార్చేసి, మరో సినిమాను ప్రదర్శించినట్లు చెప్పుకుంది! ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని.. ఇదంతా టెక్నికల్ ప్రోబ్లం వల్లే ఎదురైందని ఈ విమానయాన సంస్థ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.

Tags:    

Similar News