వ్యవసాయ ప్రేమికుడు వ్యవసాయ మంత్రి.. ఈసారి భిన్నమే

ముఖ్యమంత్రి (జలగం వెంగళరావు)ని అందించిన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రులుగా పనిచేసిన నాయకులు తక్కువ

Update: 2023-12-09 12:30 GMT

తెలంగాణ కొత్త ప్రభుత్వంలో శనివారం మంత్రులకు శాఖలు కేటాయించారు. వాస్తవానికి గురువారం ముఖ్యమంత్రితో పాటు మంత్రుల ప్రమాణ స్వీకారం సందర్భంగానే ఫలానా శాఖలు కేటాయించరంటూ కథనాలు వచ్చాయి. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యాయి. కానీ, అవేవీ వాస్తవం కాదని తేలింది. దీంతో ఫ్రంట్ లైన్ మీడియా ఏదీ మంత్రుల శాఖల గురించి రాలేదు. శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి సుదీర్ఘ చర్చలు జరిపి ఎవరికి ఏ శాఖ ఇవ్వాలో కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చించి వచ్చారు. శనివారం ఉదయం అసెంబ్లీ ఉండగా.. శాఖల కేటాయింపు పూర్తయింది.

ఉమ్మడి ఖమ్మంకు తొలిసారి..

ముఖ్యమంత్రి (జలగం వెంగళరావు)ని అందించిన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రులుగా పనిచేసిన నాయకులు తక్కువ. శీలం సిద్ధారెడ్డి, తర్వాత కోనేరు నాగేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావు, పువ్వాడ అజయ్ కుమార్, వనమా వెంకటేశ్వరరావులకు మాత్రమే ఆ చాన్స్ దక్కింది. వీరిలో తుమ్మలది భిన్నమైన ఘనత. ఆయన నాలుగో ముఖ్యమంత్రి వద్ద మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అయితే, గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు వద్ద ఆయన సుదీర్ఘ కాలం ఎక్సైజ్, రోడ్లు, నీటి పారుదల శాఖలు చూశారు. నీటి పారుదల శాఖలో చిన్న, భారీ రెండు శాఖలనూ పర్యవేక్షించారు. రోడ్లు భవనాల శాఖ మంత్రిగా అయితే ఉమ్మడి ఖమ్మంలో మారుమూల ప్రాంతానికీ రోడ్లు వేసిన రికార్డు తుమ్మలది. ఓ దశలో ఎక్సైజ్ శాఖ మంత్రిగానూ చేశారు. కేసీఆర్ సీఎం అయ్యాక చేపట్టిన శాఖ కూడా రోడ్లు, భవనాలతో పాటు స్త్రీ శిశు సంక్షేమ శాఖ దక్కింది. ఈసారి మాత్రం రేవంత్ మంత్రివర్గంలో తుమ్మలకు వ్యవసాయ శాఖ లభించడం విశేషం. ఉమ్మడి ఖమ్మం జిల్లా చరిత్రలో వ్యవసాయ శాఖ దక్కిన తొలి మంత్రి తుమ్మల నాగేశ్వరరావే.

వ్యవసాయంపై అత్యంత మక్కువ

వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన తుమ్మల నాగేశ్వరరావుకు వ్యవసాయం అంటే విపరీతమైన ప్రేమ. రాజకీయాలు కాకుంటే.. ఆయన వ్యవసాయం పైనే చూపు నిలుపుతారు. ఎన్నికల్లో ఓటమి పాలైతే వెళ్లి వ్యవసాయం చేసుకుంటానని చెబుతుంటారు. మరోవైపు స్వగ్రామం గండుగులపల్లిలో తుమ్మలకు వ్యవసాయ క్షేత్రం ఉంది. ఇక్కడ ఆయన ప్రయోగాత్మకంగాఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు. ఈ క్షేత్రాన్ని గతంలో పలువురు నాయకులు సందర్శించారు. వ్యవసాయం అంటే అంత ఇష్టపడే తుమ్మలకు వ్యవసాయ దక్కడం విశేషమే.

కొసమెరుపు: తుమ్మల ఆరు నెలల కిందట కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఆ సమయంలో తుమ్మలను రాహుల్ గాంధీ ఆయన వ్యవసాయ క్షేత్రం గురించి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. అంటే.ల తుమ్మల వ్యవసాయం ఢిల్లీ వరకు తెలిసిందన్నమాట.

Tags:    

Similar News