అగ్రరాజ్యానికి రూ.5 లక్షల కోట్ల నష్టాన్ని కలిగించిన అగ్నిప్రమాదం!
ఈ భారీ కార్చిచ్చు ఇప్పటివరకు 15,800 ఎకరాలు బుగ్గిపాలు అయినట్లుగా చెబుతున్నారు. ఉడ్లీ ఫైర్ ను ఫైర్ సిబ్బంది అదుపులోకి తీసుకురాగా.. సన్ సెట్ ఫైర్ ప్రస్తుతం హాలీవుడ్ కొండల్ని చుట్టుముట్టిందని
అమెరికా అధ్యక్ష పదవి అంటే మాటలా? సదరు అధ్యక్షుడు అనేటోడు ప్రపంచానికి కనిపించే వాస్తవ పెద్దన్న. అలాంటోడి కొడుకు ఇల్లు తగలబడిపోవటం అంటే.. అగ్నిప్రమాద తీవ్రత ఎంతన్న విషయాన్నిచెప్పకనే చెప్పేస్తుంది. అమెరికాలోని లాస్ ఏంజెలెస్ లో రగిలిన కార్చిచ్చు.. అంతకంతకూ విస్తరిస్తోంది. దీన్ని అదుపు చేసేందుకు చేస్తున్నప్రయత్నాలు ఒక కొలిక్కి రావట్లేదు. లాస్ ఏంజెలెస్ పరిధిలోని ఆరు చోట్ల రగుతులున్న కార్చిచ్చు పుణ్యమా అని ఇప్పటివరకు జరిగిన ఆస్తి నష్టం విలువ ఎంతో తెలుసా? అక్షరాల రూ.5 లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నారు.
ఈ దారుణ కార్చిచ్చు దెబ్బకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొడుకుతో సహా.. హాలీవుడ్ కు చెందిన ప్రముఖుల విలాసవంతమైన విల్లాలు మొత్తం అగ్నికి ఆహుతి అవుతున్నాయి. ఈ మంటల తాకిడికి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రినాటికి 2 వేలకు పైగా ఇళ్లు తగలబడగా.. అందులో అత్యంత విలాసవంతమైన భవనాలు వందలాదిగాఉన్నట్లు చెబుతున్నారు.
ఈ కార్చిచ్చు కారణంగా ఇప్పటివరకు 1.37 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెబుతున్నారు. శుక్రవారం ఈ ప్రాంతంలో గాలుల వేగం ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేయటంతో.. .ఈ కార్చిచ్చు చేసే నష్టం మరెంత భారీగా ఉంటుందన్న భయాందోళనలు ఎక్కువ అవుతున్నాయి.
ఈ భారీ కార్చిచ్చు ఇప్పటివరకు 15,800 ఎకరాలు బుగ్గిపాలు అయినట్లుగా చెబుతున్నారు. ఉడ్లీ ఫైర్ ను ఫైర్ సిబ్బంది అదుపులోకి తీసుకురాగా.. సన్ సెట్ ఫైర్ ప్రస్తుతం హాలీవుడ్ కొండల్ని చుట్టుముట్టిందని.. ఇది వేగంగా విస్తరిస్తోందని చెబుతున్నారు హెలికాఫ్టర్లతో నీళ్లను చిమ్ముతున్నా మంటలు అదుపులోకి రావట్లేదని అధికారులు చెబుతున్నారు. గురువారం రాత్రి వేళకు హాలీవుడ్ కు 8 కిలోమీటర్ల దూరానికి కార్చిచ్చు వచ్చేసినట్లుగా చెబుతున్నారు. శుక్రవారం ఉదయానికి ఇది మరింత దగ్గరకు వచ్చే వీలుంది.
తాజా మంటల కారణంగా రియాల్టీ టీవీ స్టార్ పారిస్ హిల్టన్, నటులు యూజిన్ లెవీ, బిల్లి క్రిస్టల్, జాన్ గుడ్‌మన్ ఇళ్లు సైతం దగ్ధమయ్యాయి. స్టూడియో సిటీ పరిసరాల్లో చాలామంది సినీతారలు తమ ఇళ్లను.. సంపదను కోల్పోయారు. ఒక అంచనా ప్రకారం లగ్జరీ విల్లాలు 2 వేల ఇళ్లు బుగ్గిపాలు అయినట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు జరిగిన ఆస్తి నష్టం రూ.5 లక్షల కోట్లుగా చెబుతున్నా.. వాస్తవంలో మరింత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. 2005లో నెలకొన్న కార్చిచ్చు తర్వాత ఇదే అతి పెద్దదిగా అభివర్ణిస్తున్నారు. తాజా అగ్నిప్రమాదం కారణంగా గాలి నాణ్యత కూడా తీవ్రంగా దెబ్బ తిందని.. ఈ నష్టం అమెరికా ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుందన్న మాట వినిపిస్తోంది.