అక్కడ బాహుబలి నేత.. మోడీ ఎదుట మాత్రం చిత్తే
తాజాగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీ మరోసారి వారణాసి నుంచి బరిలోకి దిగుతున్నారు
దశాబ్దాల తర్వాత భారీ లక్ష్యంపై గురి పెట్టారు నరేంద్ర మోడీ. అప్పుడెప్పుడు ఇందిరమ్మ హయాంలో 400ప్లస్ సీట్ల భారీ విజయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ మేజిక్ ను.. తనదైన శైలిలో తన హయాంలో రిపీట్ చేయాలని తపిస్తున్నారు నమో. ఇందుకోసం ఆయన చేసిన ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. సొంతంగా 370 స్థానాల్లో విజయం సాధించి.. మిత్రులతో కలిపి 400 ప్లస్ స్థానాల్ని విజయం సాధించాలన్న ఆయన అభిలాష ఏమవుతుందన్నది మరికొన్ని రోజుల్లో తేలనుంది.
తాజాగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీ మరోసారి వారణాసి నుంచి బరిలోకి దిగుతున్నారు. 2014లో తొలిసారి ఎంపీగా బరిలోకి దిగిన ఆయన విజయం సాధించటం తెలిసిందే. అప్పట్లో రెండు స్థానాల నుంచి పోటీ చేసిన ఆయన రెండుచోట్లా విజయం సాధించారు. వారణాసి స్థానాన్ని తనతో ఉంచుకున్న ఆయన 2019లోనూ అదే స్థానం నుంచి పోటీ చేశారు. ముచ్చటగా మూడోసారి వారణాసి నుంచి ఆయన బరిలోకి దిగుతున్నారు.
మరి.. ఆయనపై పోటీ చేసేందుకు గడిచిన రెండుసార్లు ఓటమి పాలైన కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ మరోసారి పోటీకి దిగుతున్నారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే పూర్వాంచల్ లో అజయ్ రాయ్ కు బాహుబలి నేతగా గుర్తింపు ఉంది. కానీ.. అంతటి నాయకుడు సైతం మోడీ ముందు మాత్రం ఓటమి తప్పని పరిస్థితి. మరో అంశం ఏమంటే.. ఆయన రాజకీయ ప్రస్థానం సైతం బీజేపీ నుంచే మొదలైంది. ఈ రోజున బీజేపీని తన కనుసైగతో శాసించే మోడీతో ఎన్నికల్లో ఢీ కొట్టటం అజయ్ రాయ్ ప్రత్యేకతగా చెప్పాలి.
రాయ్ అభ్యర్థిత్వాన్ని తాజాగా కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేసింది. ఐదుసార్లు యూపీ ఎమ్మెల్యేగా గెలిచిన ట్రాక్ రికార్డు ఉన్న ఆయన 2014, 2019లో మాత్రం ఎంపీగా మోడీ మీద పోటీ చేసి ఓటమిపాలయ్యారు. గడిచిన రెండుసార్లు ఆయన మూడో స్థానంలో నిలిచారు. ఈసారి మాత్రం తన గెలుపు ఖాయమన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు.. ఆయన లేవనెత్తిన నినాదం మోడీ బయట వ్యక్తి అని.. తాను లోకల్ అని చెబుతున్నారు. ఈసారి యూపీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో.. ఈ కలయిక మోడీని చిత్తు చేస్తుందని చెప్పటం ఆసక్తికరంగా మారింది.
అజయ్ రాయ్ ప్రస్థానం ఏబీవీపీతో మొదలైంది. బీజేపీ యువ మోర్చా నేతగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన 1996లో కొలాస్లా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. మూడుసార్లు బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2009లో మాత్రం బీజేపీ నుంచి వీడిపోయి సమాజ్ వాదీ పార్టీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా వారణాసి నుంచి పోటీ చేసి ఓడారు. 2014లో మోడీ తాను వారణాసి నుంచి బరిలోకి దిగుతున్నట్లుగా ప్రకటించటంతో ఆయన్ను తమ అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది.
ఆ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వారణాసి బరిలో దిగటంతో ఆయన రెండోస్థానంలో నిలవగా.. రాయ్ మూడోస్థానానికి పరిమితమయ్యారు. 2019లోనూ ఆయన మోడీపై బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లోనూ సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి షాలినీ యాదవ్ రెండో స్థానంలో నిలవగా.. రాయ్ మూడోస్థానంలో నిలిచారు.తాజా ఎన్నికల్లో సమాజ్ వాదీ అభ్యర్థి లేకపోవటం.. వారు సైతం తనకు మద్దతుగా నిలవనున్న నేపథ్యంలో ఈసారి సంచలన విజయం తన సొంతంగా ఆయన ధీమాను ప్రదర్శిస్తున్నారు.
మూడుసార్లు వారణాసి అభ్యర్థిగా పోటీ చేసి ఓడినప్పటికీ రాయ్ ను తమ అభ్యర్థిగా కాంగ్రెస్ ఎంపిక చేసుకోవటానికి కారణం.. .ఆయన బలమైన భూమిహార్ వర్గానికి చెందిన వారు కావటమే. ఈ వర్గానికి బ్రాహ్మణుల మద్దతూ ఉంటుంది. అయితే.. ఇటీవల కాలంలో పెరిగిన మోడీ గ్రాఫ్ కు రాయ్ తట్టుకుంటారా? అన్నది ప్రశ్న. ఆయన మిగిలిన మరే అభ్యర్థి మీద పోటీ చేసినా విజయం నల్లేరు మీద నడకగా అభివర్ణిస్తారు. కానీ.. మోడీ మీద పోటీ అంత సులువు కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.