విజయుడికే పట్టం
అలంపూర్ నియోజకవర్గం నుంచి అబ్రహం మరోసారి పోటీ చేస్తారని కేసీఆర్ ప్రకటించిన తర్వాత అక్కడి బీఆర్ఎస్ లో తీవ్ర అసంత్రుప్తి నెలకొందని తెలిసింది.
తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పేరు ప్రకటించినా ఆ నాయకుడికి నిరాశే మిగిలింది. పార్టీ మరోసారి తనపై నమ్మకం పెట్టుకుందని, ఈ సారి కూడా విజయం సాధించాలని ప్రచారాన్ని షురూ చేసిన ఆ ఎమ్మెల్యేకు బీఆర్ఎస్ షాకిచ్చింది. ఆయనకు కాకుండా అదే స్థానం నుంచి మరో నేతకు బీ ఫాం ఇవ్వడంతో సదరు ఎమ్మెల్యే కంగు తిన్నారు. ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు అబ్రహం. అలంపూర్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అబ్రహం పేరును మొదట బీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించారు. కానీ ఇన్ని రోజులుగా బీ ఫాం ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టారు. ఇప్పుడు విజయుడుకి కేటీఆర్ ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు బీ ఫాం అందివ్వడం హాట్ టాపిక్ గా మారింది.
అలంపూర్ నియోజకవర్గం నుంచి అబ్రహం మరోసారి పోటీ చేస్తారని కేసీఆర్ ప్రకటించిన తర్వాత అక్కడి బీఆర్ఎస్ లో తీవ్ర అసంత్రుప్తి నెలకొందని తెలిసింది. జోగులాంబ గద్వాల జిల్లా బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి మొదటి నుంచి అబ్రహం అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూనే వస్తున్నారు. ఆయనకు టికెట్ ఇస్తే పార్టీ కోసం పని చేయమని కూడా చెప్పారని తెలిసింది. ప్రజల్లో అబ్రహంపై వ్యతిరేకత ఉందని కూడా అధిష్ఠానం ద్రుష్టికి వెళ్లినట్లు సమాచారం. మరోవైపు తన అనచరుడు విజయుడుకి అవకాశం ఇవ్వాలని వెంకట్రామిరెడ్డి ఒత్తిడి తీసుకొచ్చారు.
చివరకు అబ్రహంను కాదని విజయుడుకే పార్టీ బీ ఫాం అందించింది. ఇప్పుడు హఠాత్తు పరిణామంతో అబ్రహం ఆలోచనలో పడ్టారని చెబుతున్నారు. ఆయన బీజేపీలోకి వెళ్లే ఇదే నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశాలున్నాయనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ 119 మంది అభ్యర్థులకు బీ ఫాంలు పంపిణీ చేసింది. ఇన్ని రోజులూ పెండింగ్ లో పెట్టిన గోషామహల్ లో నందకిశోర్ వ్యాస్, నాంపల్లిలో సీహెచ్ ఆనంద్ కుమార్ లకు బీఆర్ఎస్ అవకాశం ఇచ్చింది.