"సిద్ధం" అంటున్న రాయుడు... ఏమిటీ సంగతీ?
సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ఆయనా.. అతి తక్కువ సమయంలోనే యూటర్న్ తీసుకున్నారు.
కొన్ని రోజుల క్రితం ఏపీ రాజకీయాల్లో టీం ఇండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కాస్త సందడి చేసిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ఆయనా.. అతి తక్కువ సమయంలోనే యూటర్న్ తీసుకున్నారు. అనంతరం పవన్ కల్యాణ్ ను కలిశారు. అనంతరం క్రికెట్ మ్యాచ్ ఉందని చెబుతూ.. ఆయన ఏపీ రాజకీయాల్లో ఎక్కడా కనిపించిన దాఖళాలు లేవు! ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి అంబటి రాయుడు పేరు తెరపైకి వచ్చింది. అందుకు ఆయన చేసిన ట్వీటే కారణం!
అవును... ఒకానొక సమయంలో అంబటి రాయుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నిలిచారు. గుంటూరు లోక్ సభ పరిధిలో ప్రజల్లో తిరుగుతూ, ప్రభుత్వ పాఠశాలలను సందర్శిస్తూ సందడి చేశారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.. అమరావతి రైతులతోనూ ముచ్చటించారు. అనంతరం వైసీపీలో చేరారు. దీంతో... గుంటూరు లోక్ సభ స్థానం నుంచి వైసీపీ తరుపున అంబటి రాయుడు బరిలోకి దిగుతున్నారనే ప్రచారం బలంగా జరిగింది.
అయితే అనతికాలంలోనే ఆ ప్రచారం అత్యంత వేగంగా ముగిసిన ఇన్నింగ్స్ లా మారిపోయింది. తర్వాత ఏపీ రాజకీయాల్లో అంబటి రాయుడి చప్పుడు లేదు! ఈ నేపథ్యంలో.. ఎన్నికల షెడ్యూల్ విడుదలై, వైసీపీ అభ్యర్థుల ప్రకటన పూర్తై, ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారిన ఈ సమయంలో తాజాగా అంబటి రాయుడు ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఇందులో భాగంగా... ఈ రోజు వేకువ జామున 3 గంటల సమయంలో "సిద్ధం" అని స్పందించారు.
దీంతో... సోషల్ మీడియా వేదికగా ఏపీ రాజకీయాలపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగా... అంబటి రాయుడు తిరిగి వైసీపీలో చేరబోతున్నారా అనే చర్చ బలంగా నడుస్తోంది. పైగా ఈ రోజు నుంచి "మేమంతా సిద్ధం" అంటూ వైఎస్ జగన్ బస్సు యాత్ర ప్రారంభం కాబోతోంది. సరిగ్గా ఈ సమయంలో తాను కూడా "సిద్ధం" అన్నట్లుగా రాయుడు చేసిన ఈ ట్వీట్ ఆసక్తిగా, తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
దీంతో... వైసీపీలో చేరుతున్నారా అని పలువురు నెటిజన్లు కామెంట్ సెక్షన్ లో క్వశ్చన్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై అంబటి మరింత క్లారిటీ ఇస్తారా.. లేక, ఇంతకంటే ఏమి క్లారిటీ ఇవ్వాలి అని ఎదురు ప్రశ్నిస్తారా అనేది వేచి చూడాలి.
కాగా... గతేడాది డిసెంబర్ లో వైసీపీలో చేరిన అంబటి రాయుడు.. ఈ ఏడాది జనవరి 6న యూటర్న్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. జనవరి 20 నుంచి దుబాయ్ లో జరిగే ఇంటర్నేషనల్ లీగ్ టీ20 లో ఏఐ ఎమిరేట్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రాజకీయాల్లో రాయుడు టాపిక్ కట్ అయినట్లు కనిపిస్తున్న నేపథ్యంలో... తాజాగా "సిద్ధం" అన్నారు.