నోరు తెరిచి అడిగితే అమ్మే కాదు.. అమిత్ షా ఇస్తారు

అయితే.. అడిగే తీరులో అడగాలే కానీ.. అమిత్ షా సైతం సానుకూలంగా స్పందిస్తారన్న విషయం తాజాగా మరోసారి ఫ్రూవ్ అయ్యింది.

Update: 2024-01-18 06:30 GMT

అడగకుంటే అమ్మ కూడా అన్నం పెట్టదని అంటారు. అలాంటిది వేర్వేరు భావజాల రాజకీయ పార్టీలు కేంద్ర.. రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే అనుకున్న పనులు అనుకున్నట్లు జరుగుతాయి. ఎవరు అవునన్నా.. కాదన్నా కేంద్రంలో ఉన్న ప్రభత్వ ఆశీస్సులు.. సహకారం లేకుంటే ఏ రాష్ట్ర పరిస్థితి అయినా ఇబ్బందికరంగానే ఉంటుంది. రాజకీయాలు ఎన్ని ఉన్నా.. కొన్ని అంశాలకు సంబంధించి రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ఈ విషయంలో మోడీ సర్కారుకు మంచి మార్కులే పడతాయి.

అవసరం ఉన్నప్పుడు ఒకలా.. అవసరం తీరిన తర్వాత మరోలా వ్యవహరించే తీరు తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు ఎక్కువన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తూ ఉంటుంది. ప్రతి అంశంలోనూ తమదే పైచేయి కావాలన్న తీరు ఒక స్థాయి వరకు ఓకే కానీ.. శ్రుతిమించి తీరు వారిలో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందన్న విమర్శ వినిపిస్తూ ఉంటుంది. పదేళ్ల.. తమ పాలనలో కేంద్రంలోని మోడీ సర్కారు మీద నిత్యం ఏదో విధంగా విరుచుకుపడే తీరు కనిపించటం తెలిసిందే. తమకు కేంద్రం సహకరించటం లేదంటూ కేసీఆర్.. కేటీఆర్ తరచూ విమర్శలు చేసేవారు.

అయితే.. అడిగే తీరులో అడగాలే కానీ.. అమిత్ షా సైతం సానుకూలంగా స్పందిస్తారన్న విషయం తాజాగా మరోసారి ఫ్రూవ్ అయ్యింది. తెలంగాణకు కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కాంగ్రెస్ పార్టీకి చెందిన రేవంత్ రెడ్డి.. ఆ మధ్యన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని.. కేంద్ర మంత్రుల్ని సాదరంగా కలవటం.. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కొన్ని వినతుల్ని వారి ముందు ఉంచటం తెలిసిందే.

ఉప్పు.. నిప్పులా ఉండే కాంగ్రెస్ పార్టీ.. బీజేపీల మధ్య పంచాయితీ నేపథ్యంలో.. ఢిల్లీకి వెళ్లిన రేవంత్ ఏం సాధిస్తారన్న సందేహాన్ని వ్యక్తం చేశారు పలువురు. అయితే.. అడిగే విధంగా అడిగితే.. అమిత్ షా సైతం ఇస్తారన్న విషయాన్ని ప్రూవ్ చేశారు రేవంత్. తెలంగాణ రాష్ట్రానికి అదనంగా ఐపీఎస్ ల అవసరం ఉందని.. వారిని వెంటనే కేటాయించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను అడిగినట్లుగా ఆ మధ్యన ఒక ప్రముఖ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పటం తెలిసిందే.

రేవంత్ చేసిన వినతికి తాజాగా కేంద్రం స్పందించింది. జనవరి 4న ఢిల్లీలో అమిత్ షాను కలిసి అదనపు ఐపీఎస్ లు కావాలని అడగటం.. తాజాగా అందుకు తగ్గట్లే అమలు దిశగా అడుగులు పడటం ఆసక్తికరంగా మారింది. జిల్లాల విభజన.. వివిధ శాఖల పర్యవేక్షణ నిమిత్తం రాష్ట్రానికి 29 మంది అదనపు ఐపీఎస్ పోస్టులను కేటాయించాలని కోరారు. రాష్ట్ర విభజన సమయంలో కేవలం 76 మంది ఐపీఎస్ అధికారుల్ని కేటాయించారని.. అదనపు పోస్టులు అవసరమని పేర్కొన్నారు.

రేవంత్ వినతికి కేంద్ర మంత్రి అమిత్ షా సానుకూలంగా స్పందించారు. రేవంత్ అడిగినంత మంది ఐపీఎస్ లను కేటాయించకున్నా.. తాజాగా ఆరుగురు ఐపీఎస్ లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయేషా ఫాతిమా.. మంధారే సోహం సునీల్.. మనన్ భట్.. పత్తిపాక సాయి కిరణ్.. రాహుల్ కాంత్.. రుత్విక్ సాయిలను తెలంగాణ క్యాడర్ కు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వీరంతా 2022 బ్యాచ్ కు చెందిన వారు. ఈ ఏడాది కొత్తగా వచ్చే బ్యాచ్ తో మిగిలిన పోస్టులు భర్తీ చేసే వీలుందని చెబుతున్నారు. ఇదంతా చూస్తే.. అడగాలే కానీ అమ్మ మాత్రమే కాదు అమిత్ షా కూడా అడిగినవి ఇస్తారన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

Tags:    

Similar News