వావ్ అనంతపురం: అక్కడ అతివలే అత్యధిక ఓటర్లు
అసెంబ్లీ ఎన్నికలకు గడువు దగ్గరకు వస్తోంది. షెడ్యూల్ ప్రకారం చూస్తే.. మరో మూడు నెలల్లో షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది.
అసెంబ్లీ ఎన్నికలకు గడువు దగ్గరకు వస్తోంది. షెడ్యూల్ ప్రకారం చూస్తే.. మరో మూడు నెలల్లో షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది. అయితే.. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల్ని కాస్త ముందుకు జరిపినా జరపొచ్చు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక (లోక్ సభ) ఎన్నికలు ఒకేసారి జరగనున్న విషయం తెలిసిందే. వీటితో పాటు మరికొన్ని రాష్ట్రాలకు ఎన్నికలు జరిగే పరిస్థితి. ఇదిలా ఉంటే.. ఎన్నికల్లో కీలకమైన ఓటర్ల జాబితాను సిద్దం చేస్తున్నారు ఎన్నికల సంఘం. తాజాగా విడుదలైన గణాంకాల్ని చూస్తే.. అనంతపురం జిల్లాలో ఆసక్తికర అంశం వెలుగు చూసింది.
ఈ జిల్లాలోని ఓటర్లలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అత్యధికంగా ఉండటం ఆసక్తికకరంగా మారింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం ఓటర్లు 19,94,544 మంది ఉండగా.. అందులో పురుష ఓటర్లు 9,88,176 కాగా.. మహిళా ఓటర్లు 10,06,123 ఓటర్లు ఉన్నారు. ఇతరులు 245 మంది ఉన్నారు. సర్వీసు ఓటర్లు 2115.. దివ్యాంగులు 27,817.. ఎన్ఆర్ఐలు 121 మందితో కలిపితే మొత్తం 19,96,659 మంది ఓటర్లుగా తేల్చారు. గత ఏడాది జనవరి 5న విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాతో పోలిస్తే.. తాజా జాబితాలో 16,884 మంది ఓటర్లు పెరిగారు.
ఇంతకూ పెరిగిన మహిళా ఓటర్లు ఏయే నియోజకవర్గాలకు చెందిన వారు? వారి సంఖ్య ఎంత పెరిగిందన్నది చూస్తే.. అనంతపురం అర్బన్ గా చెప్పాలి. ఇక్కడ 5780 మంది మహిళా ఓటర్లు పెరిగితే (గత ఏడాది జనవరి 5 జాబితాతో పోలిస్తే).. ఉరవకొండలో 4086 మంది ఓటర్లు.. శింగనమలలో 2182 మంది.. రాయదుర్గం 2033.. రాప్తాడులో 2వేల మహిళా ఓటర్లు పెరిగారు. ఒక్క కల్యాణదుర్గంలో మాత్రమే గత ఏడాదితో పోలిస్తే 691 మంది మహిళా ఓటర్లు తగ్గారు.
గత ఏడాది జాబితాతో పోలిస్తే ఓటర్ల సంఖ్య తొలగింపు కంటే పెరుగుదలే ఎక్కువగా ఉంది. 8 నియోజకవర్గాల పరిధిలో మొత్తం 1.04 లక్షల ఓటర్లు పెరగ్గా.. 87,529 మంది ఓటర్లను తొలగించారు. మొత్తంగా ఓటర్లు పెరిగిన నియోజకవర్గాల్లో అనంతపురం అర్బన్ మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ ఏకంగా 20,663 మంది ఓటర్లు పెరిగితే.. రాప్తాడులో 17,994 మంది.. రాయదుర్గంలో 16,678.. గుంతకల్లులో 11,865.. ఉరవకొండలో 11,717 ఓట్లు పెరిగాయి.
తొలగించిన ఓట్లు.. నియోజకవర్గాల్ని చూస్తే.. రాప్తాడులో 17,994 ఓట్లు తీసేశారు. రాయదుర్గంలో 14,645.. అనంత అర్బన్ లో 14,883.. గుంతకల్లులో 11,863 ఓట్లు తొలగించినట్లుగా తేల్చారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం ఓటర్లలో 71 వాతం యువత.. మధ్య వయస్కుల ఓటర్లే అధికంగా ఉన్నారు. వయసుల వారీగా చూస్తే.. 20-29 ఏళ్ల మధ్య వారు 3.54 లక్షలు ఉంటే.. 30-39 మధ్య ఉన్నోళ్లు 5.83 లక్ష్లు.. 40-49 ఏళ్ల మధ్య 4.25 లక్షలు.. 50-59 మధ్య 2.95 లక్షలు.. 60-69 మధ్య 1.79 లక్షలు.. 70-79 మధ్య 91,542 మంది ఉండగా.. 80 ఏళ్లకు పైబడిన వారు26,963 మంది ఓటర్లుగా తేల్చారు.