బీజేపీ ఎంపీ సంచలనం.. 400ప్లస్ సీట్ల లక్ష్యం వెనుక మోడీ ఎజెండా ఇదేనట!

దీనికి సంబంధించి ఆయన ఒక్కొక్కటిగా చేస్తున్న ప్రయత్నాలు.. ఆ దిశగా అడుగులు పడేలా చేస్తున్నాయన్న వాదన వినిపిస్తోంది.

Update: 2024-03-11 07:30 GMT

ఈ వారంలో విడుదల అవుతుందని భావిస్తున్న సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ కు కాస్త ముందు నుంచే.. టార్గెట్ 400ప్లస్ ఎంపీ సీట్లను సొంతం చేసుకోవటానికి వీలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెద్ద ఎత్తున ప్లానింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన ఒక్కొక్కటిగా చేస్తున్న ప్రయత్నాలు.. ఆ దిశగా అడుగులు పడేలా చేస్తున్నాయన్న వాదన వినిపిస్తోంది. ఇంతకూ 400ప్లస్ ఎంపీల టార్గెట్ ఎందుకు? అంత భారీ లక్ష్యాన్ని మోడీ ఎందుకు పెట్టుకున్నారన్న ఆసక్తికర ప్రశ్నకు సమాధానంగా ఇందిరమ్మ నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేయటమేనని చెప్పటం తెలిసిందే.

అయితే.. ఇందిరమ్మ హయాంలో నెలకొల్పిన రికార్డును బద్ధలు కొట్టటం వెనుక మోడీ మాష్టారి అసలు ఎజెండా వేరే ఉందా? అన్న ప్రశ్నకు అవుననే రీతిలో బీజేపీ ఎంపీ ఒకరు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారంగా మారాయి. మాజీ కేంద్ర మంత్రిగా.. బీజేపీ ఎంపీగా సుపరిచితుడైన అనంత్ కుమార్ హెగ్డే తాజాగా సంచలన వ్యాఖ్య చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో తాము కానీ 400ప్లస్ సీట్లు సాధించి.. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాతే ఏం జరుగుతుందో చెప్పేశారు.

ముచ్చటగా మూడోసారి ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. హ్యాట్రిక్ ప్రభుత్వం రాజ్యాంగంలో కొన్ని మార్పులు చేయనున్నట్లుగా చెప్పారు. రాజ్యాంగ పీఠికలో ఉన్న లౌకికవాదం పదాన్ని తొలగించనున్నట్లుగా పేర్కొని పెను దుమారానికి కారణంగా మారుతున్నారని చెప్పాలి. అనవసరమైన అంశాల్ని కాంగ్రెస్ బలవంతంగా జొప్పించిందని చెప్పిన ఆయన.. ‘రాజ్యాంగాన్ని నాటి కాంగ్రెస్ సర్కారు వక్రీకరించింది. ముఖ్యంగా హిందూ సమాజాన్ని అణిచివేసే చట్టాల్ని తీసుకొచ్చింది. వాటిలో మార్పులు చేయాలంటే బీజేపీకి ప్రస్తుతం ఉన్న మెజార్టీ సరిపోదు. కాంగ్రెస్ మెజార్టీ ఎంపీ స్థానాల్ని గెలవలేదు. మోడీ నాయకత్వంలోని బీజేపీ సర్కారు మూడింట రెండింతల సీట్లను గెలుస్తుంది. లోక్ సభ.. రాజ్యసభల్లో మూడింట రెండు వంతుల సీట్లను గెలుస్తుంది. అదే స్థాయిలో 20 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వస్తుంది. అలా వచ్చినంతనే రాజ్యాంగంలో మార్పులు తీసుకురావొచ్చు. బీజేపీ కూటమి 400 ప్లస్ సీట్లు సాధిస్తే.. రాజ్యసభలో మెజార్టీ మరింత పెరగటానికి దోహదపడుతుంది’ అంటూ వెల్లడించిన విషయాలు ఇప్పుడు పెను దుమారంగా మారాయి.

తాజా ఎన్నికల్లో బీజేపీ 400 ప్లస్ ఎంపీ స్థానాల్ని గెలుపొందటం వెనుకున్న అసలు కారణం ఇదే.. అన్నట్లుగా బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారటంతో కర్నాటక డిప్యూటీ సీఎం స్పందించారు. తాజాగా డీకే శివకుమార్ మాట్లాడుతూ.. బీజేపీ రాజ్యాంగ వ్యతిరేక పార్టీగా పేర్కొన్నారు. అంబేడ్కర్ రాసిన రాజ్యంగంపై బీజేపీకి ఎంత వ్యతిరేకత ఉందన్న విషయం బీజేపీ ఎంపీ మాటలతో అర్థం చేసుకోవచ్చంటూ మండిపడుతున్నారు.

కీలకమైన ఎన్నికల వేళలో ఎంపీ అనంతకుమార్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సైతం స్పందించింది. ఆయన చేసిన వ్యాఖ్యలన్ని వ్యక్తిగతమైనవి చెబుతూ నష్ట నివారణ ప్రయత్నాల్ని ముమ్మరం చేసిందని చెప్పాలి. ఆయన వెల్లడించిన ఆలోచనలు ఆయన వ్యక్తిగతమైనవని.. పార్టీకి సంబంధం లేవని ప్రకటించింది. అంతేకాదు.. ఆయన వ్యాఖ్యలకు వివరణను కోరనున్నట్లుగా పేర్కొన్నారు. ఇదంతా చూస్తే.. మోడీ అసలు ఎజెండా ఇదేనా? అన్న సందేహం కలుగక మానదు. ప్రస్తుతం బీజేపీ స్సందిస్తూ తమకు ఎంపీ అనంతకుమార్ వ్యాఖ్యలతో సంబంధం లేదని చెబుతున్నా.. ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన రచ్చ మాత్రం ఒక స్థాయి వరకు వెళ్లటం ఖాయమంటున్నారు.

Tags:    

Similar News