అనంత్ అంబానీ ఎంత పెట్ లవ్వరో తెలిస్తే అవాక్కే

దాని పిల్లల్ని తనతో తీసుకెళ్లేందుకు దాదాపు ఐదారు నెలల పాటు ముంబయి - హైదరాబాద్ షటిల్ కొట్టిన వైనాన్ని ప్రస్తావిస్తున్నారు.

Update: 2024-03-10 05:22 GMT

అనంత్ అంబానీ అన్నంతనే రెండు అంశాలు ఇప్పటివరకు చర్చకు వచ్చేవి. అందులో మొదటిది ఆయన బరువు. రెండోది ఆయన.. జంతువుల పట్ల ఉన్న ప్రేమ. ఇప్పుడు మూడో అంశం చేరింది. అది..ఆయన ఇటీవల ప్రేమించి పెళ్లాడిన రాధిక. అంగరంగ వైభవంగా జరిగిన వారి పెళ్లి దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారింది. సంపన్న వర్గాల్లో వారి పెళ్లి జరిగిన తీరు గురించి గంటల తరబడి మాట్లాడుకునేలా చేసింది. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్ తో నిర్వహించిన ఈ పెళ్లి ఖర్చు ఒక లెక్క అయితే.. ఈ పెళ్లి వేళ అనంత్ అంబానీకి ఉన్న జంతు ప్రేమకు సంబంధించిన సరికొత్త అంశాలు వెలుగు చూశాయి.

గతంలో ఒక అరుదైన జంతువు కోసం హైదరాబాద్ లోని ఒక ప్రముఖ బిల్డర్ వద్దకు తరచూ అనంత్ ప్రత్యేకంగా వచ్చేవారని.. దాని పిల్లల్ని తనతో తీసుకెళ్లేందుకు దాదాపు ఐదారు నెలల పాటు ముంబయి - హైదరాబాద్ షటిల్ కొట్టిన వైనాన్ని ప్రస్తావిస్తున్నారు. అంతేకాదు.. అరుదైన జీవరాశుల్ని పెంచే అలావాటున్న అనంత్ వద్ద అలస్కన్ మలామ్యూట్ జాతికి చెందిన కుక్క కూడా ఉందని తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

కారణం.. ఈ కుక్క వేడి వాతావరణాన్ని అస్సలు తట్టుకోలేదు. అలాంటప్పుడు ముంబయిలో ఎలా ఉందన్న ప్రశ్న. దానికి అనంత్ చెప్పే సమాధానం ఏమిటో తెలుసా? ఆ కుక్కను ఉంచేందుకు పూర్తిగా చల్లగా ఉండే వాతావరణ పరిస్థితుల్ని క్రియేట్ చేసి.. దాన్ని అల్లారు ముద్దుగా పెంచేసుకుంటున్నారు. ఇక.. అనంత్ పెళ్లాడిన రాధిక విషయానికి వస్తే.. ఆమె ఆయన బాల్య స్నేహితురాలే కాదు. అనంత్ మాదిరి ఆమె కూడా జంతు ప్రేమికురాలు కూడా.

తన ఇంట్లో కొన్ని రకాల ఎగ్జోటిక్ పెట్స్ ను అనంత్ అంబానీ పెంచుతుంటారు. ఇంతకూ ఆయనకు ఆ ఇష్టం ఎక్కడి నుంచి వచ్చింది? అన్న ప్రశ్న వేస్తే.. ముకేశ్ అంబానీ దంపతుల వల్లనే వచ్చిందని చెబుతారు. వాళ్ల అభిరుచుల్ని చూసి పెరగటం కారణంగా తనకు జంతువులంటే ప్రేమ పెరిగిందని.. ఆ ఆసక్తితో జంతువులకు సంబంధించిన అన్ని అంశాల మీదా తనకు అవగాహన ఉందని చెబుతారు. తనను తన స్నేహితులు యానిమల్స్ ఎన్ సైక్లోపీడియా అని పిలుస్తుంటారని చెప్పిన వైనం చూస్తే.. ఆయనకు జంతువులు.. వాటికి సంబంధించిన అంశాల మీద ఎంత అవగాహన ఉందన్నది ఇట్టే అర్థమవుతుంది.

జంతువుల మీద ఉన్న ప్రేమతోనే "వన్ తార" పేరుతో జంతు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించటంతో పాటు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జంతువుల్ని కాపాడటం.. వాటికి అవసరమైన వైద్య చికిత్సలు చేయించటం.. వాటికి నివాసాన్ని ఏర్పాటు చేయటం లాంటి కార్యక్రమాల్ని తాను చేస్తున్నట్లు చెబుతారు. ఇదంతా సరే..ఆయన అంత బరువు ఎందుకు పెరిగారు? మధ్యలో తగ్గారు కదా? మళ్లీ ఎందుకు పెరిగారు? అన్న సందేహానికి సమాధానం ఆయనే చెబుతారు.

చిన్నతనం నుంచి ఆస్తమా ఉండటంతో స్టెరాయిడ్లు వాడేవాడినని.. ఆ మందుల కారణంగా ఆకలి పెరగటంతో విపరీతంగా తీనేయటమే తాను బరువు పెరగటానికి కారణమి చెబుతారు. దాదాపు 200 కేజీల బరువు పెరిగిన తర్వాత.. బరువు తగ్గేందుకు తన ఫుడ్ లో మార్పులు చేసుకోవటం కఠినమైన వ్యాయామం చేశారు. ఈ క్రమంలో18 నెలల్లో వంద కేజీల బరువు తగ్గినప్పటికీ.. మళ్లీ స్టెరాయిడ్ల పుణ్యమా అని బరువు పెరిగిన విషయాన్ని అనంత్ అంబానీ చెబుతారు. ఏమైనా మిగిలిన పారిశ్రామికవేత్తల పిల్లలకు భిన్నంగా అనంత్ అంబానీనిలుస్తారని మాత్రం చెప్పక తప్పదు.

Tags:    

Similar News