తుఫానాంధ్రా...సీఎం ఎవరైనా పెను సవాళ్ళే

ఏపీని కీర్తించడానికి ఎన్నో పేర్లు ఉన్నాయి. ఏపీకి విశాలమైన తొమ్మిది వందల కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉందని గర్వంగా చెప్పుకోవచ్చు

Update: 2024-10-15 03:47 GMT

ఏపీని కీర్తించడానికి ఎన్నో పేర్లు ఉన్నాయి. ఏపీకి విశాలమైన తొమ్మిది వందల కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉందని గర్వంగా చెప్పుకోవచ్చు. అదే సమయంలో తీర ప్రాంతం ఆనుకుని తొమ్మిది ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి. దాంతో ఏపీకి అతి పెద్ద నష్టం కూడా ఉంది.

తరచూ సంభవించే తుఫాన్లు ఏపీని నష్టపరుస్తున్నాయి. సముద్రగర్భంలో ఎన్నో అల్ప పీడనాలు పుడతాయి. కానీ అవి బలపడే వాతావరణం ఏర్పడినపుడే బయటకు కనిపిస్తాయి. గతంలో అయితే తుఫాన్లకు ఒక సీజన్ ఉండేది. ఎక్కువగా అవి వర్షాకాలంలో వచ్చేవి. అవి నైరుతి రుతు పవనాల ప్రభావంతో ఏర్పడేవిగా ఉండేది .

ఇక ఈశాన్య రుతు పవనాల ప్రభావంతో శీతాకాలంలో తుఫాన్లు కూడా వస్తూంటాయి. ఏపీలో వాటికి సీజన్ అక్టోబర్ నవంబర్ నెలలు. 1977 అందరికీ గుర్తుండే ఉంటుంది. నవంబర్ లో వచ్చిన పెను తుఫాను ఉప్పెనగా మారి దివిసీమ మొత్తం మింగేసింది. ఆనాటి ఏపీని అల్లకల్లోలం చేసి పారేసింది.

ఇలా తుఫాన్లతో ఏపీ ఎపుడూ ఇబ్బంది పడుతూనే ఉంది. అయితే ఇటీవల కాలంలో ప్రకృతిలో చోటు చేసుకుంటున్న అనేక పరిణామాల వల్ల తుఫాన్లు కూడా క్రమం తప్పుతున్నాయి. జోరు పెంచుకుంటున్నాయి. సీజన్ లో కాకుండా తరచూ వస్తున్నాయి. ప్రకృతికి అనర్ధంగా చేసే పనుల వల్లనే ఈ వాతావరణం మార్పులు అని అంటున్నారు.

దీని వల్లనే క్లౌడ్ బరస్ట్ ఏర్పడుతోందని ఫలితంగా ఒక పెద్ద నదీ జలాన్ని ఒక నగరం మీద కుమ్మరిస్తూ దారుణమైన జల విలయానికి కూడా ఈ తుఫానులు వానలు కారణం అవుతున్నాయని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. ఇక ఇపుడు చూస్తే తుఫాన్ల సీజనే. కానీ ఈ ఏడాదిలో చూస్తే ఎక్కువగా తుఫాన్లు ఇప్పటికే వచ్చేశాయి.

ఇపుడు మరిన్ని క్యూలో ఉన్నాయి. దాంతో తుఫాను అంటే ఏపీ హడలిపోతోంది. ఇటీవల బెజవాడ వరదలు గోదావరి జిల్లాలో పంట మునకలు తీరని నష్టాలు గుర్తు చేసుకుని బాబోయ్ అని అంటున్నారు. కానీ ప్రకృతి మాత్రం గర్జిస్తోంది

ఇక ఇదే అక్టోబర్ నెలలో మూడు తుఫాన్లు వరసగా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అందులో తొలి తుఫాను మొదలైంది. దక్షిణాంధ్ర మీద అది తీవ్ర ప్రభావం చూపే ప్రభావం కనిపిస్తోంది. ఇప్పటిదాకా మధ్య కోస్తా ఉత్తరాంధ్ర దారుణంగా నష్టపోయాయి. ఇపుడు దక్షిణాంధ్ర వంతు అని తలచుకుంటేనే ఏపీకి ఎంతటి కష్టం అన్న భావన కలుగుతోంది.

ఇదిలా ఉంటే విభజన ఏపీలో చూస్తే గత పదేళల్లో ఎన్నో తుఫాన్లు హడలెత్తించాయి. 2014లో చూస్తే ఇదే అక్టోబర్ లో హుదూద్ తుఫాను విశాఖ మీదుగా తీరం దాటి మెగా సిటీని అల్లకల్లోం చేసి పారేసింది. ఆ నష్టం అంతా ఇంతా కాదు, ఇక దాని ప్రభావం మొత్తం ఉత్తరాంధ్ర మీద బాగా పడింది. ఈ రోజుకీ ఆ నష్టం అలాగే ఉంది

ఇక 2015 డిసెంబర్ లో వచ్చిన వార్దా తుఫాను ఏపీని కల్లోలంగా మార్చింది. దీని ప్రభావంతో నెల్లూరు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలు విలవిలలాడాయి. 2018 అక్టోబర్ నెలలో వచ్చిపడిన తిత్లీ తుఫాను ఏకంగా ఉత్తరాంధ్రాలో బీభత్సాన్ని సృష్టించింది. ఈ తుఫాను దెబ్బకు శ్రీకాకుళం విజయనగరం భారీ ఎత్తున నష్టపోయాయి. అదే 2018లో వచ్చిన పెతాయ్ తుఫాను ప్రభావంతో ఉభయ గోదావరి జిల్లాలతో పాటు క్రిష్ణా జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి.

అదే విధంగా చూస్తే 2021లో చూస్తే సెప్టెంబర్ నెలలో గులాబ్ వచ్చింది. దాని వల్ల ఉత్తరాంధ్రలోని విశాఖ విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు పూర్తిగా దెబ్బతినిపోయాయి. ఇక 2022 డిసెంబర్ లో వచ్చిన మాండాస్ తుఫాన్ ప్రభావంతో చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, కడప జిల్లాలు పూర్తిగా వణికిపోయాయి. అపారమైన నష్టాన్ని చూశాయి.

ఇక 2023లో మిచౌంగ్ పేతుతో తుఫాని డిసెంబర్ నెలలో వచ్చింది. ఈ తుఫాను ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు, గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాలు దారుణంగా నష్టం చూశాయి. ఇపుడు ఈశాన్య రుతు పవనాలు ఎంట్రీతోనే మూడు వరస తుఫాన్లు సంభవిస్తున్నాయి. డిసెంబర్ నెలలోగా మరెన్ని వస్తాయో అని అంతా కలవరపడుతున్నాయి.

ఉమ్మడి ఏపీలో అయితే ఆదుకోవడానికైనా ఒక ఆర్థిక భరోసా ఉండేది. విభజన ఏపీలో సవాలక్ష సమస్యలకు తోడు ఈ తుఫాన్లు కూడా ఏపీని కష్టాల కడలిలోకి నెట్టేస్తున్నాయని అంటున్నారు. ఇక వాతవరణంలో చోటు చేసుకుంటున్న మార్పులతో సగటున నెలకో భారీ తుఫాను రావడం కూడా తీర ప్రాంత రాష్ట్రం అయిన ఏపీకి పెను శాపంగా మారుతోంది అని అంటున్నారు. ఎవరు సీఎం గా ఉన్న పెను సవాలుగానే ఈ తుఫాన్లు ఉంటున్నాయని అంటున్నారు.

Tags:    

Similar News