విశాఖ, ఉప్పాడ, అంతర్వేది, పేరుపాలెం బీచ్ లలో పరిస్థితి ఇదే!

వాయుగుండం ప్రభావంతో చెన్నై, బెంగళూరు మహానగరాలు చిగురుటాకులా వణుకుతున్న వేళ.. ఏపీలో పలు జిల్లాల్లోనూ భారీవర్షాలు కురుస్తున్నాయి

Update: 2024-10-17 09:41 GMT

వాయుగుండం ప్రభావంతో చెన్నై, బెంగళూరు మహానగరాలు చిగురుటాకులా వణుకుతున్న వేళ.. ఏపీలో పలు జిల్లాల్లోనూ భారీవర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ జిల్లాలతో పాటు ఉమ్మడి నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, ఈస్ట్, విశాఖ జిల్లాల్లో కొన్ని చోట్ల జనజీవనం స్తంభించేస్థాయిలో భారీ వర్షాలు కురిసాయి. ఇక సముద్ర తీరప్రాంతాల్లో పరిస్థితి అల్లకల్లోలంగా ఉందని అంటున్నారు.

అవును... వాయుగుండం ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం స్తంభించిపోయింది. మరోపక్క విశాఖపట్నం, కాకినాడ, పేరుపాలెం, అంతర్వేది తీరాల్లో సముద్రపు అలలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి. విశాఖలోని ఆర్కే బీచ్, మెగల్తూరు మండలంలోని పేరుపాలెం బీచ్ ల వద్ద అలలు షాపులను తాకుతున్నాయి.

దీంతో... ఇటీవల కాలంలో ఇలా ఎప్పుడూ జరగకపోవడంతో పేరుపాలెంలో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు! ఇక కాకినాడ జిల్లాలోని ఉప్పాడ తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. రాకాసి అలలు భారీగా ఎగసిపడుతున్నాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు, ఇళ్లు నేల కూలాయి. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేదిలోనూ సముద్రం అల్లకల్లోలంగా ఉంది.

ప్రధానంగా పల్లిపాలెంలో ఇళ్లు, బీచ్ రోడ్డును అలలు ముంచెత్తాయి. ఇక ఇదే జిల్లాలోని ఓడలరేవు తీరంలోనూ అలలు ఉధృతంగా ఎగసిపడుతున్నాయి. ఈ సమయంలో... ఓ.ఎన్.జీ.సీ. ఫ్లాంట్ ను సముద్రపు నీరు తాకింది.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పరిస్థితులపై కలెక్టర్లు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్లు.. సీఎంకు పరిస్థితి వివరించారు. ఈ సందర్భంగా.. సాగునీటి ప్రవాహల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. చెరువులు, వాగుల పరిస్థితినీ ఎప్పటికప్పుడు సమీక్షించాలని బాబు సూచించారు.

Tags:    

Similar News