షర్మిల చేరికపై బ్రదర్‌ అనిల్‌ కుమార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

ఈ క్రమంలో షర్మిలకు పార్టీ కండువా కప్పాక మల్లికార్జున ఖర్గే.. అనిల్‌ కు కూడా కండుపా కప్పబోయారు.

Update: 2024-01-05 08:17 GMT

వైఎస్సార్టీపీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేసిన వైఎస్‌ షర్మిల ఆ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా షర్మిలతోపాటు ఆమె భర్త అనిల్‌ కుమార్‌ సైతం ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్‌ అగ్ర నేతలు రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గే, షర్మిలతోపాటు అనిల్‌ కూడా వేదికపై ఆశీనులయ్యారు. ఈ క్రమంలో షర్మిలకు పార్టీ కండువా కప్పాక మల్లికార్జున ఖర్గే.. అనిల్‌ కు కూడా కండుపా కప్పబోయారు. అయితే ఆయన నవ్వుతూ తిరస్కరించిన వీడియో వైరల్‌ అయ్యింది.

కాగా కాంగ్రెస్‌ పార్టీలో చేరాక షర్మిలతో ఆమె భర్త అనిల్‌ కూడా మీడియాతో మాట్లాడారు. షర్మిలకు పార్టీని నడపగల సామర్థ్యం ఉందని, ఏపీ రాజకీయాల్లో ఆమె ప్రభావం తప్పకుండా ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో అనిల్‌ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

ఇదేకోవలో ఏపీలో జగన్‌ కు వ్యతిరేకంగా పనిచేయాల్సిన పరిస్థితి వస్తే షర్మిల ఏం చేస్తారని అనిల్‌ ను మీడియా ప్రశ్నించింది. కాంగ్రెస్‌ అధిష్టానం ఆదేశాల ప్రకారం షర్మిల పూర్తిస్థాయిలో పనిచేస్తారని, ఆమెకు ఏ బాధ్యత అప్పగించిన సమర్థవంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించడం విశేషం. కాంగ్రెస్‌ ఫ్యామిలీలో తాము కూడా భాగమైనందుకు సంతోషంగా ఉందన్నారు. దేశంలోనే అతిపెద్ద సెక్యులర్‌ పార్టీ కాంగ్రెస్‌ అని గుర్తు చేశారు. ఆ పార్టీ వల్ల దేశానికి మంచి జరుగుతుందని తెలిపారు.

కాగా కొద్ది రోజుల క్రితం అనిల్‌ ను.. కడప విమానాశ్రయంలో టీడీపీ నేతలు, మాజీ ఎమ్మెల్సీలు బీటెక్‌ రవి, దేవగుడి నారాయణరెడ్డి సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలు కడప జిల్లాకు సంబంధించి పలు రాజకీయ అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్టు ప్రచారం జరిగింది.

వచ్చే ఎన్నికల్లో బ్రదర్‌ అనిల్‌ కుమార్‌ తన భార్య షర్మిలకు వెనుకండి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్‌ సంస్థలను, సంఘాలను ఏకతాటిపై నిలిపి వైసీపీ విజయానికి అనిల్‌ కృషి చేశారు. అలాగే క్రైస్తవ మత ప్రభోదకుడిగా ఉండటంతో పెద్ద ఎత్తున క్రిస్టియన్లను వైసీపీ వైపు మళ్లేలా చేశారు.

దీంతో గత ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీల ఓట్లతోపాటు క్రిస్టియన్‌ ఓట్లను వైసీపీ పెద్ద ఎత్తున దక్కించుకుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బ్రదర్‌ అనిల్‌ కాంగ్రెస్‌ పార్టీకి అండగా నిలవచ్చని అంటున్నారు. అందులోనూ షర్మిలకు పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉండటంతో తన భార్య విజయానికి అనిల్‌ కృషి చేస్తారని చెబుతున్నారు.

Tags:    

Similar News