వైసీపీకి మరో గండం!

టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం రావడంతో కేసుల భయంతో వైసీపీకి ఉన్న 11 మంది ఎమ్మెల్యేల్లో అత్యధికం బీజేపీలో చేరొచ్చని టాక్‌ నడుస్తోంది.

Update: 2024-06-08 15:30 GMT

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో వైసీపీ దారుణ ఓటమిని మూటగట్టుకుంది. కనీసం ప్రతిపక్ష హోదా దక్కాలంటే కావాల్సిన 18 సీట్లను కూడా తెచ్చుకోలేకపోయింది. 175 సీట్లలో పోటీ చేసి కేవలం 11 స్థానాలకే పతనమైంది.

నిన్నటి వరకు ముఖ్యమంత్రిగా వైభోగం చూసిన వైఎస్‌ జగన్‌ కేవలం ఇక పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. ప్రతిపక్ష నేత హోదా దక్కి ఉంటే కనీసం జగన్‌ కు కేబినెట్‌ మంత్రి హోదా లభించేది. అయితే 11 సీట్లకే పతనం కావడంతో ఆ చాన్స్‌ లేకుండా పోయింది.

మరోవైపు వైసీపీ ఎన్నికల్లో చిత్తవ్వడంతో ఆ పార్టీ నేతలు పక్క చూపులు చూస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి, దళిత నేత రావెల కిశోర్‌ బాబు వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన టీడీపీలో చేరడానికి సిద్ధమవుతున్నారు.

అలాగే వైసీపీ నుంచి గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల్లో చాలా మంది బీజేపీ వైపు చూస్తున్నారని అంటున్నారు. ఇదే విషయాన్ని జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కూడా వెల్లడించడం గమనార్హం. ముఖ్యంగా వైసీపీ నుంచి గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల్లో ఆరుగురు రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో వైఎస్‌ జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (పుంగనూరు), పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌ రెడ్డి (తంబళ్లపల్లె), బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి (దర్శి), బాలనాగిరెడ్డి (మంత్రాలయం), ఆకేపాటి అమర్నాథ్‌ రెడ్డి (రాజంపేట) ఉన్నారు. మరో ఇద్దరు ఎస్టీ ఎమ్మెల్యేలు మత్స్యరాస విశ్వేశ్వరరాజు (పాడేరు), రేగం మత్స్యలింగం (అరకు) ఉన్నారు. అలాగే ఇద్దరు ఎస్సీ ఎమ్మెల్యేలు.. తాటిపర్తి చంద్రశేఖర్‌ (యర్రగొండపాలెం), దాసరి సుధ (బద్వేలు) ఉన్నారు. ఒక బీసీ ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి (ఆలూరు) ఉన్నారు.

టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం రావడంతో కేసుల భయంతో వైసీపీకి ఉన్న 11 మంది ఎమ్మెల్యేల్లో అత్యధికం బీజేపీలో చేరొచ్చని టాక్‌ నడుస్తోంది. ఇప్పటికే వీరిలో ఐదారుగురు బీజేపీలో టచ్‌ లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. వైసీపీ తరఫున గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల్లో జగన్‌ కు వీర విధేయులైనవారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి మాత్రమేనని అంటున్నారు.

అయితే వైసీపీ ప్రభుత్వంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నెంబర్‌ టూగా చక్రం తిప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబును తీవ్ర ఇబ్బందులు పెట్టారు. రాయలసీమలో పెద్దిరెడ్డి హవా చలాయించారు. కుప్పంలో, హిందూపురంలో చంద్రబాబును, బాలకృష్ణను ఓడించడానికి పెద్ద ఎత్తున మంత్రాంగం రచించారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు, దాడులు ఇలా పెద్దిరెడ్డి చేసినవి అన్నీఇన్నీ కాదని అంటున్నారు. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చంద్రబాబు ప్రభుత్వం లక్ష్యంగా చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

మరోవైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్‌ రెడ్డి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్‌ గా వ్యవహరించారు. ఈ క్రమంలో పిఠాపురంలో పవన్‌ కళ్యాణ్‌ ను ఓడించడానికి మంత్రాంగాలు రచించారు. ముద్రగడ పద్మనాభాన్ని వైసీపీలోకి తీసుకువచ్చి పవన్‌ పై విమర్శలు చేయించడంలోనూ కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి కుటుంబానికి తీవ్ర ఇబ్బందులు తప్పవంటున్నారు.

ఈ నేపథ్యంలో వైసీపీలో జగన్‌ మినహాయించి మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. ముఖ్యంగా 11 మంది వైసీపీ ఎమ్మెల్యేల్లో ఐదుగురు బడుగు, బలహీనవర్గాల ఎమ్మెల్యేలే. దీంతో ముందుగా వారిపైన బీజేపీ నేతలు దృష్టి సారించారని చెబుతున్నారు. వీరు చేరాక మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలను లాగేయొచ్చని టాక్‌ నడుస్తోంది.

Tags:    

Similar News