మ్యూజిక్ ఫెస్ట్ లో మరో ఘోరం... శ్వాస చెక్ చేసి మరీ కాల్పులు!
అవును... ఇజ్రాయేల్ లో హమాస్ ముష్కరులు చేస్తున్న దాడులన్నీ ఒకెత్తు అయితే... మ్యూజికల్ ఫెస్టివల్ లో చేసిన అరాచకం అత్యంత కౄరం అనే చెప్పుకోవాలి.
ఇజ్రాయేల్లో హమాస్ ముష్కరులు చేస్తున్న దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అత్యంత మానవీయమైన సంఘటనలు తెరపైకి వస్తున్నాయి. హృదయవిధారకరమైన ఈ సంఘటనలు హమాస్ ముష్కరుల్లో లోపించిన మానవత్వానికి మచ్చుతునకలనే మాటలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం అదే విషయాన్ని బలపరుస్తుంది.
అవును... ఇజ్రాయేల్ లో హమాస్ ముష్కరులు చేస్తున్న దాడులన్నీ ఒకెత్తు అయితే... మ్యూజికల్ ఫెస్టివల్ లో చేసిన అరాచకం అత్యంత కౄరం అనే చెప్పుకోవాలి. గాజా సరిహద్దులోని కిబ్బుజ్ రీమ్ వద్ద జరిగిన నోవా మ్యూజిక్ ఫెస్టివల్ పై హమాస్ మిలిటెంట్లు విరుచుకుపడి విచ్చలవిడిగా కాల్పులు జరిపిన సంఘటనపై ఇప్పటికే పలు దారుణాలు వెలుగులోకి వచ్చాయి.
ఇందులో భాగంగా... ముష్కరులకు భయపడి చెట్లు, పొదల చాటున దాక్కున్న వారినీ వెతికి మరీ మిలిటెంట్లు కాల్చి చంపారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ వద్ద కాపుకాసి మరీ కర్కసత్వాన్ని ప్రదర్శించారు. ఇదే సమయంలో మరికొంతమంది చనిపోయినట్లు నటించారు. అయితే.. అలా చనిపోయినట్లు నటించిన వారి శ్వాసను పరీక్షించి మరీ కాల్చివేశారు. దీనికి సంబందించిన వివరాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
వివరాళ్లోకి వెళ్తే... ఇజ్రాయెల్ కు చెందిన ప్రముఖ టీవీ హోస్ట్ మాయన్ ఆడం చెల్లెలు మాపల్ ఆడం (27) గత శనివారం తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి నోవా మ్యూజిక్ ఫెస్టివల్ కు వెళ్లిందట. అయితే ఆ ఫెస్టివల్ ప్రారంభమైన కాసేపటికే ఆ ప్రాంతాన్ని హమాస్ ఉగ్రవాదులు చుట్టుముట్టడంతో వీరిద్దరూ పారిపోయేందుకు ప్రయత్నించారట.
ఈ సమయంలో నాలువైపులా సుమారు 50 మంది ముష్కరులు చుట్టుముట్టేసరికి ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితుల్లో ఓ ట్రక్కు కింద దాక్కుని చనిపోయినట్లు నటించారట. అయితే, వీరిని గుర్తించిన ముష్కరులు... దగ్గరికొచ్చి చూసి శ్వాస ఉన్నట్లు గుర్తించి మరీ కాల్పులు జరిపారట. ఈ ఘటనలో మాపల్ ఆడం ప్రాణాలు కోల్పోగా.. ఆమె బాయ్ ఫ్రెండ్ రోయ్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఈ విషయం బయట ప్రపంచానికి తెలిసింది.
ఇదే సమయంలో చనిపోవడానికి ముందు మాపల్ ఆడం కూడా అక్కడి పరిస్థితిని ట్రక్కు కింద నుంచి ఫొటో తీసి తన సోదరికి పంపించింది. ఆ ఫొటోను మాయన్ ఆడం తన ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ జరిగిన దారుణాన్ని వివరించారు. ఇందులో భాగంగా.. "మాపల్ తీసిన చివరి ఫొటో ఇది. ప్రాణాలు కాపాడుకోవడం కోసం కొన్ని గంటల పాటు ఆమె కదలకుండా చనిపోయినట్లు నటించింది. కానీ ఉగ్రవాదులు ఆమెను అతి దారుణంగా చంపేశారు" అని పేర్కొంది.
కాగా... తాజా యుద్ధంలో మ్యూజిక్ పార్టీ వద్ద హమాస్ జరిపిన దాడి అత్యంత ఘోరంగా చెబుతున్నారు. ఈ దాడిలో 260 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. సుమారు 3,000 మంది హాజరయిన ఈ మ్యూజిక్ ఫెస్టివల్ ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే పలు వ్యాన్లలో వచ్చిన 50 మంది సాయుధ ముష్కరులు తుపాకీ గుళ్ల వర్షం కురిపించారు.