17 మందిని కాల్చి చంపిన నిందితుడు.. తన మెదడు ఇచ్చేందుకు సిద్ధం!

నికోలస్‌ క్రజ్‌ అనే యువకుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 13 మంది స్కూల్‌ పిల్లలతో మరో నలుగురు స్కూల్‌ సిబ్బంది అశువులు బాశారు.

Update: 2024-07-10 23:30 GMT

ఎనిమిదేళ్ల క్రితం.. సరిగ్గా 2018 ఫిబ్రవరి 14న అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న పార్క్‌ ల్యాండ్‌ లోని ఓ స్కూల్‌ కాల్పుల మోతతో దద్దరిల్లిన సంగతి తెలిసిందే. నికోలస్‌ క్రజ్‌ అనే యువకుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 13 మంది స్కూల్‌ పిల్లలతో మరో నలుగురు స్కూల్‌ సిబ్బంది అశువులు బాశారు. ఈ కేసు అమెరికాలో గన్‌ కల్చర్‌ కు పరాకాష్టగా నిలిచింది. ఈ దారుణానికి కారణమైన నికోలస్‌ క్రజ్‌ ను పోలీసులు అరెస్టు చేశారు. న్యాయస్థానం అతడికి జీవిత ఖైదు విధించింది.

8 ఏళ్ల క్రితం జరిగిన ఘటనను ఇప్పటికీ బాధితులు ఎవరూ మర్చిపోలేదు. ఆ ఘటన ఇంకా వారి కళ్ల ముందే పీడకలలా వెంటాడుతూనే ఉంది. ఈ క్రమంలో ఈ కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. 17 మంది మరణానికి కారణమైన కిరాతకుడు నికోలస్‌ క్రజ్‌ తన మెదడును దానం చేసేందుకు అంగీకరించడం హాట్‌ టాపిక్‌ గా మారింది.

నికోలస్‌ క్రజ్‌ ఇంత దారుణానికి పాల్పడటానికి కారణమేంటì ? ఇందుకు అతడు ఈ కిరాతకానికి ఒడిగట్టాడో తెలుసుకోవడానికి నాటి కాల్పుల ఘటనల్లో బాధితుడైన ఆంథోనీ బోర్గెస్‌ నిందితుడి మెదడు కావాలని కోరాడు. నాడు కాల్పుల ఘటనలో విద్యార్థిగా ఉన్న ఆంథోనీ బోర్గెస్‌ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. అతడి శరీరంలోకి ఐదు బుల్లెట్లు దూసుకువెళ్లాయి. ఈ ప్రమాదంలో అనేక సర్జరీలు జరిగాక అతికష్టం మీద బోర్గెస్‌ ప్రాణాలతో బయటపడ్డాడు.

ఈ నేపథ్యంలో నిందితుడు నికోలస్‌ క్రజ్‌ మెదడు కావాలని.. దానిపై సైంటిస్టులు అధ్యయనం చేస్తే అతడు ఈ కిరాతకానికి ఎందుకు పాల్పడ్డాడో, దీనికి అతడిని ప్రేరేపించిన ఘటనలు ఏంటో తెలుస్తుందని ఆంథోనీ అభిప్రాయపడ్డాడు. దీనికి నిందితుడు కూడా అంగీకరించడం విశేషం, ఈ మేరకు ఇరువురి మధ్య ఒప్పందం కుదిరింది.

నిందితుడు నికోలస్‌ క్రజ్‌ మీద పరిశోధనలు చేస్తే.. అతడు ఎందుకు ఇంత మంది అమాయకులను బలిగొన్నాడో తెలిస్తే భవిష్యత్తులో అటువంటి ఘటనలను నిరోధించవచ్చని ఆంథోనీ బోర్గెస్‌ అభిప్రాయపడ్డాడు. ఈ నేపథ్యంలో అతడు ఈ కేసులో న్యాయపోరాటం మొదలుపెట్టాడు. నిందితుడు నికోలస్‌ క్రజ్‌ బ్రెయిన్‌ కావాలని కోరారు. దీనికి నిందితుడు కూడా అంగీకరించడంతో ఆంథోనీ కోరిక నెరవేరింది.

ఆంథోనీ.. నికోలస్‌ క్రజ్‌ మెదడును మాత్రమే కాకుండా అతడి పేరును సినిమాలు, వెబ్‌ సిరీస్‌ లు, పుస్తకాలు, మీడియాలోనూ వాడుకోవడానికి హక్కులు పొందాడు. అంతేకాకుండా నాటి కాల్పుల ఘటనలో చచ్చి బతికిన ఆంథోనీకి నిందితుడు 4.3 లక్షల డాలర్లు ఇవ్వడానికి ఒప్పందం కూడా కుదిరింది.

ఈ నేపథ్యంలో గతంలో అమెరికా చరిత్రలో ఇలాంటి సెటిల్మెంట్‌ తాము ఎప్పుడూ చూడలేదని న్యాయవాదులు చెబుతున్నారు. మరోవైపు బాధితులకు ఇప్పటికే ఆ స్కూల్‌ 26 మిలియన్‌ డాలర్లను నష్టపరిహారంగా అందజేసింది.

Tags:    

Similar News