అనుపమ్ ఖేర్ ఫోటోతో కరెన్సీ.. గుజరాత్ వ్యాపారికి షాకిచ్చిన దొంగలు

ఇందుకోసం ఒక ఫేక్ ఆఫీసును ఏర్పాటు చేసి మరీ మోసానికి పాల్పడిన వైనం చూస్తే.. అవాక్కు అవ్వాల్సిందే.

Update: 2024-10-01 04:13 GMT

సినిమాల్లో కూడా ఈ తరహా మోసాన్ని చూపించలేదనే చెప్పాలి. ఖతర్నాక్ స్కెచ్ తో రూ.1.30కోట్ల భారీ మొత్తాన్ని కొట్టేసిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. సినిమాటిక్ గా ఉన్న ఈ భారీ మోసంలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఫోటోతో ఫేక్ కరెన్సీని క్రియేట్ చేయటం.. ఒక బడా బంగారు వ్యాపారిని అడ్డంగా బుక్ చేశారు. ఇందుకోసం ఒక ఫేక్ ఆఫీసును ఏర్పాటు చేసి మరీ మోసానికి పాల్పడిన వైనం చూస్తే.. అవాక్కు అవ్వాల్సిందే. గుజరాత్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతంలోకి వెళితే..

అహ్మదాబాద్ కు చెందిన బంగారు వ్యాపారి మోహుల్ ఠక్కర్ కు ఇటీవల ఒకరు ఫోన్ చేశారు. తనను తాను ప్రశాంత్ పటేల్ గా పరిచయం చేసుకున్న అతను.. స్థానికంగా ఉన్న ఒక నగల షాపు మేనేజర్ గా తనను తాను పరిచయం చేసుకున్నాడు. సదరు వ్యాపారి తనకు తెలిసిన వాడే కావటంతో.. మేనేజర్ పేరుతోచెప్పిన వ్యక్తి మాటల్ని నిజమని నమ్మాడు. తనకు 2.1 కిలోల బంగారం కావాలని.. ధర విషయంలోకాస్త అటు ఇటుగా మాట్లాడుకొని చివరకు రూ.1.60 కోట్లకు డీల్ కుదుర్చుకన్నారు.

సెప్టెంబరు 24న ఫోన్ చేసిన సదరు వ్యక్తి తాము కోరిన బంగారాన్ని షాపునకు పంపాలని కోరారు. దీంతో.. ఠక్కర్ తన మనుషులకు 2.1 కేజీల బంగారాన్ని ఇచ్చి వారి వద్దకు పంపాడు. ఠక్కర్ మనుషులు హవాలా వ్యాపారి షాపునకు చేరుకున్నారు. అప్పటికే వీరి కోసం ముగ్గురు వ్యక్తులు వెయిట్ చేస్తున్నారు. షాపులోని నోట్ల లెక్కింపు మిషన్ ను తీసుకొచ్చి 26 బండిళ్లలో ఉన్న నోట్లను లెక్కించటం మొదలు పెట్టారు. తమ వద్ద రూ.1.30 కోట్లు మాత్రమే ఉన్నాయని.. మిగిలిన రూ.30 లక్షలు పక్కనున్న షాపు నుంచి తెస్తామంటూ వెళ్లారు.

తమతో పాటు బంగారు బిస్కెట్లను చెక్ చేయిస్తామని తీసుకెళ్లారు. అయితే.. వారు అటు వెళ్లగానే.. వారిచ్చిన బ్యాగులోని కరెన్సీ కట్టల్లో జాతిపిత మహాత్మ గాంధీ బొమ్మకు బదులుగా బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ బొమ్మ ఉండటంతో కంగుతిన్నారు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బదులుగా రెసోల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరు మీద ఉండటంతో ఠక్కర్ మనుషులు షాపులో ఉన్న వ్యక్తిని ప్రశ్నించారు.

అయితే..తనకు ఇవేమీ తెలియదని.. నోట్ల లెక్కింపు మిషన్ ను తెమ్మంటే మాత్రమే తెచ్చానని.. ఆ నోట్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పటంతో.. తమను మోసం చేసిన విషయాన్ని గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని ఠక్కర్ కు ఫోన్ చేసి చెప్పారు. ఆయన గుండె ఆగినంతపనైంది. ఎంతసేపు వెయిట్ చేసినా వారు తిరిగిరాలేదు. మరో వైపు ఆ షాపు సెటప్ సైతం ఇటీవలే అద్దెకు తీసుకున్నట్లుగా గుర్తించారు. ఇంత దారుణంగా మోసం చేసిన వారిపై ఠక్కర్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు.. కేసు నమోదు చేసిన పోలీసులు మోసగాళ్లను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సినిమాటిక్ గా ఉన్న ఈ మోసం స్థానిక వ్యాపారుల్లో సంచలనంగా మారింది.

Tags:    

Similar News