వైసీపీ బిగ్ డెసిషన్ ని కూటమి తిరగతోడాల్సిందేనా ?

అయితే ఒకసారి ఈ డిమాండ్లు కనుక ఓకే చేస్తే మళ్లీ అదంతా కలసి పెద్ద ఇష్యూ అవుతుందని భావించిన వైసీపీ ప్రభుత్వం ఏమీ చేయకుండా అలాగే ఉంచేసింది.

Update: 2024-11-18 00:30 GMT

ఏపీలో పదమూడు జిల్లాలతో 2014లో ఏర్పడింది. అయితే ఆ తరువాత పది జిల్లాలతో ఉన్న తెలంగాణా 31 జిల్లాలుగా రూపాంతరం చెందింది. దాంతో ఏపీలోనూ కొత్త జిల్లాల డిమాండ్లు వచ్చాయి. అయితే 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఈ విషయంలో తొందర పడలేదు. పైగా విభజనతో అనేక కష్టాలతో కునారిల్లిన ఏపీలో కొత్త జిల్లాలు పెను సవాళ్ళుగా మారుతాయని భావించింది అని అంటారు.

అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మాత్రం కొత్త జిల్లాల మీద మొగ్గు చూపించింది ఏకంగా 13 జిల్లాను 26గా మార్చింది. ఇది మంచిదే అనుకున్నా అందులో కొంత శాస్త్రీయత లోపించింది అని అంతా నాడే విమర్శలు చేశారు. వైసీపీ ప్రజా ప్రతినిధులు కూడా తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టిన సందర్భాలు ఉన్నాయి. అది అన్నమయ్య జిల్లా కేంద్రం విషయంలోనూ కనిపించింది.

అలాగే ఇతర జిల్లాలలోనూ మార్పుచేర్పులు చేయమని నాడే డిమాండ్లు వచ్చాయి. అయితే ఒకసారి ఈ డిమాండ్లు కనుక ఓకే చేస్తే మళ్లీ అదంతా కలసి పెద్ద ఇష్యూ అవుతుందని భావించిన వైసీపీ ప్రభుత్వం ఏమీ చేయకుండా అలాగే ఉంచేసింది. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ మాత్రం కొత్త జిల్లాల విషయంలో ఏర్పడిన ఇబ్బందులను తమ పార్టీ అధికారంలోకి వస్తే చక్కదిద్దుతామని అందరికీ మేలు చేసేలా చూస్తామని చెప్పింది.

ఇవన్నీ పక్కన పెడితే విశాఖ జిల్లాలో గ్రామీణ ప్రాంతం లేదు, అలాగే కొన్ని జిల్లాలకు జిల్లా కేంద్రాలు దూరంగా ఉన్నాయి. మరి కొన్ని జిల్లాలలో ఇబ్బందులు పలు రకాలుగా ఉన్నాయి. వారు ఉన్నది ఒక చోట అయితే విసిరేసినట్లుగా వేరే జిల్లాలో కలిపారు అని అంటున్నారు. దాంతో దీని మీద టీడీపీకి చెందిన మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు తన మండపేట నియోజకవర్గాన్ని తూర్పు గోదావరి జిల్లాలోనే కలిపేయాలని అసెంబ్లీలో డిమాండ్ పెట్టారు.

మండపేటను కోనసీమ జిల్లాలో కలిపారు అని ఆయన చెప్పారు. రాజమండ్రికి చేరువగా ఉన్న తమ జిల్లాను తూర్పు గోదావరిలో కలపడమే మేలు అని ఆయన అంటున్నారు. ఇక చూస్తే పెద్దదైన తూర్పు గోదావరి జిల్లా అతి పెద్ద జిల్లాగా ఉంది. దానిని కొత్త జిల్లాల పేరుతో నాలుగు భాగాలుగా చేశారు. తూర్పుగోదావరి జిల్లా, కోనసీమ జిల్లా, అల్లూరు జిల్లా, కాకినాడ జిల్లాలుగా చేశారు.

అయితే ఈ విభజన వల్ల ఇబ్బందులు ఉన్నాయని అంటున్నారు. దాంతో మరోసారి జిల్లాల పునర్ విభజన విషయం పరిశీలించాలని అంతా కోరుతున్నారు. అదే విధంగా హిదూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయమని స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

అలాగే ఇతర ప్రాంతాల నుంచి కూడా డిమాండ్లు ఉన్నాయి. మరి కూటమి ప్రభుత్వం ఈ విషయంలో ఏమి చేస్తుంది అన్నది చూడాల్సి ఉంది. అయితే చాలా మటుకు కొత్త జిల్లాల సమస్యలను పరిష్కరించే దిశగా కూటమి ఆలోచన చేస్తుంది అని అంటున్నారు. కొత్త జిల్లాలు 26గా ఉన్నా జిల్లా పరిషత్తులు మాత్రం ఇంకా విభజించబడలేదు. అవి పదమూడుగానే ఉన్నాయి.

వాటికి 2026లో ఎన్నికలు పెడితే అపుడు కొత్త జిల్లాల పేరిట పెడతారని అంటున్నారు. అయితే కొత్త జిల్లాలలో మార్పు చేర్పులను కూటమి ప్రభుత్వం చేస్తుందా అన్నది చూడాల్సి ఉంది. చేస్తే కనుక ఏ అంశాలను గమనంలోకి తీసుకుంటుంది అన్నది కూడా చూడాలి. పాతిక లోక్ సభ సీట్లను ప్రాతిపదికగా తీసుకుని వైసీపీ కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. అయితే టీడీపీ కూటమి ఈ విషయంలో కనుక డెసిషన్ తీసుకుంటే అది ఒక కీలక నిర్ణయంగానే ఉంటుంది అని అంటున్నారు. మరి వైసీపీ నిర్ణయాన్ని తిరగతోడేందుకు కూటమి సిద్ధంగా ఉందా అంటే చూడాల్సి ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News