ఆంధ్రప్రదేశ్ లోనూ హైడ్రా!?
తెలంగాణలో హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేసి చెరువులు, నాళాలను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే.
తెలంగాణలో హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేసి చెరువులు, నాళాలను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. పేదలు, ధనికులు అనే తేడా లేకుండా ఎవరి అక్రమ నిర్మాణాలు ఉన్నా హైడ్రా కూల్చివేస్తోంది. ఈ వ్యవస్థపై ఓవైపు ప్రశంసలు, మరోవైపు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా హైడ్రాను ఏర్పాటు చేయాలని పర్యావరణవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా విజయవాడలో కొద్ది రోజుల క్రితం సంభవించిన వరదలకు అక్రమ నిర్మాణాలే కారణమని వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బుడమేరు కాలువను ఆక్రమించి భారీ ఎత్తున నిర్మాణాలు చేపట్టడమే ఇంతటి విపత్తుకు కారణమైందని అంటున్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణలో మాదిరిగానే ఏపీలోనూ కూటమి ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. దీనిపై తాజాగా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
చెరువులు, వరద కాలువల్లో ఆక్రమణల తొలగింపునకు తెలంగాణలోని హైడ్రా తరహాలో రాష్ట్రంలోనూ ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుకు అవసరమైతే కొత్త చట్టం తీసుకొస్తామని నారాయణ తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నేతలు జలవనరులను ఆక్రమించారని ఆరోపించారు. భారీగా చేపట్టిన అక్రమ నిర్మాణాలతో వరద నీరు నివాస ప్రాంతాలను ముంచెత్తిందన్నారు.
ఆక్రమ నిర్మాణాల తొలగింపుతోనే భవిష్యత్తులో విజయవాడ తరహా విపత్తులు రాష్ట్రంలో తిరిగి తలెత్తవని నారాయణ అభిప్రాయపడ్డారు. ఈ తరహా ఆక్రమణల విషయంలో ఏ పార్టీకి చెందిన వారైనా ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. అయితే పేదలకు చెందిన నిర్మాణాల విషయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాకే తొలగిస్తామని చెప్పారు.
విజయవాడలో బుడమేరు వరదలు మానవ తప్పిదం కాదని.. గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. కొందరు స్వార్థంతో నీటి వనరులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాల కారణంగా లక్షలాది మంది ప్రజలు వరదలతో తీవ్రంగా నష్టపోతున్నారని నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని ఉపేక్షించబోమని హెచ్చరించారు.
గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడలో ముంపు సమస్య తలెత్తకుండా ప్రారంభించిన వరదనీటి ప్రవాహ ప్రాజెక్టు పనులను గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. అక్రమ నిర్మాణాలకు అండగా నిలిచిన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు.
బుడమేరు పొంగటంతో విజయవాడలో మూడు రోడ్లకు దాదాపు 40 చోట్ల గండ్లు కొట్టాల్సి వచ్చిందని నారాయణ తెలిపారు. ముంపు నీటిని పంపింగ్ చేసి బయటకు పంపామన్నారు.
విజయవాడలో బుడమేరు కాలువతోపాటు రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లోనూ నీటి వనరుల ఆక్రమణలపై సర్వే ప్రారంభిస్తామని తెలిపారు. ఇందుకోసం అధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తామన్నారు. వరదనీటి కాలువల వెడల్పు ఎంత? అవి ఎంతవరకు ఆక్రమణలకు గురయ్యాయి? ఆక్రమిత ప్రాంతంలో ఎన్ని నిర్మాణాలు ఉన్నాయి? వాటిలో పేదలవి ఎన్ని? పెద్దలకు చెందినవి ఎన్నో గుర్తిస్తామని వెల్లడించారు.
నారాయణ వ్యాఖ్యలతో ఏపీలోనూ హైడ్రా వ్యవస్థ ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే హైడ్రా తెలంగాణలో మాదిరిగా ఎలాంటి సంచలనాలకు కేంద్రంగా మారుతుందో వేచిచూడాల్సిందే.