స్మగ్లర్లు హీరోలా..? మంత్రి సత్యకుమార్ కామెంట్స్ వైరల్

అడవి దొంగలలను హీరోలుగా చూపించడం ఎంతవరకు కరెక్ట్ అన్న ఆలోచనలో ఆ మధ్య డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్ కామెంట్స్ చేశారు.

Update: 2025-02-17 11:50 GMT

పుష్ప2 సినిమా విడుదల తర్వాత హీరో అల్లు అర్జున్ తీవ్ర విమర్శల పాలవుతున్నారు. గత ఏడాది డిసెంబరులో ఈ సినిమా విడుదల అవ్వగా, హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరగడం, అదో వివాదంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో అల్లు అర్జున్ అరెస్టు అయ్యారు కూడా.. అయితే ఆ సినిమాలో ఎర్ర చందనం స్మగ్లర్ పాత్రలో హీరో అల్లు అర్జున్ నటించారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద సరికొత్త రికార్డులు నమోదు చేసిన కలెక్షన్ల సునామీ తెచ్చింది. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వ పెద్దలు మాత్రం పుష్ప పాత్రపై పరోక్షంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు.

అడవి దొంగలలను హీరోలుగా చూపించడం ఎంతవరకు కరెక్ట్ అన్న ఆలోచనలో ఆ మధ్య డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్ కామెంట్స్ చేశారు. ‘‘ఒకప్పుడు హీరోలు అడవులను కాపాడే వారు. కానీ ఇప్పుడు అడవులను ధ్వంసం చేసేవాళ్లు హీరోలవుతున్నారు’’ అంటూ పవన్ చేసిన కామెంట్స్ హీరో అల్లు అర్జున్ ను ఉద్దేశించినవేనన్న ప్రచారం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. మెగా, అల్లు అభిమానుల మధ్య సోషల్ మీడియా వార్ వరకు దారితీశాయి. అయితే కొద్దికాలం తర్వాత ఈ వివాదం ముగిసిపోగా, తాజాగా అవే తరహా కామెంట్లను వినిపించారు బీజేపీ నేత, మంత్రి సత్యకుమార్.

ఎన్నికలకు ముందు నంద్యాల వైసీపీ అభ్యర్థికి మద్దతుగా అల్లు అర్జున్ ప్రచారం చేయడంతో మెగా, అల్లు కుటుంబాల మధ్య గ్యాప్ వచ్చిందని అప్పట్లో ప్రచారం జరిగింది. తాను వైసీపీకి వ్యతిరేకంగా పోరాడితే తన కుటుంబ సభ్యుడు ఆ పార్టీకి మద్దతుగా వెల్లడం డిప్యూటీ సీఎం పవన్ కు ఆగ్రహం తెప్పించదని విశ్లేషించారు. అందుకే పుష్ప సినిమా విడుదలకు ముందు పవన్ కామెంట్స్ ద్వారా టార్గెట్ చేశారనే అభిప్రాయం వ్యక్తమైంది.

ఇక బీజేపీ నేత మంత్రి సత్యకుమార్ కూడా పవన్ కామెంట్స్ ను కోట్ చేసినట్లు అల్లు అర్జున్ ను పరోక్షంగా టార్గెట్ చేసినట్లు చెబుతున్నారు. పైగా ఏ నేలపై మెగా-అల్లు కుటుంబాల మధ్య వివాదం మొదలైందో.. అదే నంద్యాల గడ్డపై నుంచి సత్యకుమార్ విమర్శలు చేయడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. మంత్రి హోదాలో నంద్యాల జిల్లాలో ఓ పాఠశాల వార్షికోత్సవానికి హాజరైన సత్యకుమార్ ప్రసంగిస్తూ తెలుగు సినిమాల్లో స్మగ్లర్లు, బందిపోట్లను హీరోలుగా చూపడాన్ని తప్పుబట్టారు. సమాజానికి ఆదర్శవంతమైన సినిమాలు తీయాల్సిందిపోయి, బందిపోట్లు, స్మగ్లర్ల బయోగ్రఫీలను సినిమా తీయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ మంత్రి ప్రశ్నించారు. వీరప్పన్, పూలన్ దేవి వంటి వారి జీవిత చరిత్రలను సినిమాగా తీసి ఏం సందేశం ఇస్తున్నారని నిలదీశారు.

మంత్రి సత్యకుమార్ ఏ ఉద్దేశంతో ఆ కామెంట్స్ చేశారోగానీ, రీసెంట్ గా వచ్చిన పుష్ప సినిమాలో హీరో స్మగ్లర్ పాత్రను పోషించడం, ఆ హీరోకు నంధ్యాలతో ప్రత్యేక అనుబంధం ఉండటం రాజకీయంగా చర్చకు దారితీసింది. తాజా కామెంట్స్ ద్వారా ఎప్పుడో ఆగిపోయిన రచ్చను మరో సారి సత్యకుమార్ రాజేస్తున్నారా? అనే ప్రశ్న ఉదయిస్తోంది. మొత్తానికి నంద్యాల గడ్డపై సత్యకుమార్ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

Tags:    

Similar News