ఏపీ పాలిటిక్స్‌లో 2024 చ‌రిత్ర‌లో క‌లిసి పోలా.. చ‌రిత్ర సృష్టించింది ..!

మ‌రీ ముఖ్యంగా చూసుకుంటే.. టీడీపీ విజ‌య ర‌హస్యం తెలిసిపోయిన సంవ‌త్స‌రం కూడా ఇదే.

Update: 2024-12-31 09:30 GMT

మార్పు స‌హ‌జం.. కానీ, ఆ మార్పు చ‌రిత్ర సృష్టించిన సంవ‌త్స‌రం 2024. ఢిల్లీ నుంచి ఏపీ వ‌రకు అనేక మార్పుల‌కు ఈ ఏడాది నాంది ప‌లికింది. ప్ర‌భుత్వాల మార్పు నుంచి నాయ‌కుల మార్పు దాకా.. 2024 ఒక చరిత్ర‌ను సొంతం చేసుకుంది. స‌హ‌జంగా ఒక సంవ‌త్స‌రం వెళ్లిపోయి.. మ‌రో సంవ‌త్స‌రం రావ‌డం కామ‌నే. కానీ, 2024కు చాలా ప్ర‌త్యేక‌త ఉంది. గ‌తానికి భిన్నంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ త‌ర్వాత వ‌రుస‌గా మూడోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి రావ‌డం.. హిస్ట‌రీ.

ఏపీ విష‌యానికి వ‌స్తే.. ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు ప్ర‌జ‌ల‌కు పంచాన‌ని చెప్పినా.. జ‌గ‌న్ హ‌వా 2024లో సాగ‌లే దు. 2019లో టీడీపీకి 23 సీట్లే వ‌చ్చిన‌ప్పుడు అయ్యోపాపం అంటే.. అందులోనూ స‌గం రాని ప‌రిస్థితితో వైసీపీ దారుణ ప‌రాభవం పొందింది. ష‌ర్మిల ఎంట్రీతో పుంజుకుంటుందని భావించిన కాంగ్రెస్‌లో ఎక్కడి గొంగ‌ళి అక్క‌డే అన్న‌ట్టుగా ఉంది. ముంద‌స్తు అంచ‌నాలు లేకుండానే బ‌రిలోకి దిగిన జ‌న‌సేన‌.. సాధించి న విజ‌యం అపూర్వం.. అసామాన్యం.

100 శాతం స్ట్ర‌య‌క్ రేటుతో 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్ద‌రు ఎంపీలను గెలిపించుకున్న ఘ‌న‌త ప‌వ‌న్ క‌ల్యాణ్‌కే ద‌క్కింది. కేంద్రంలోనూ కీల‌క పొజిష‌న్‌లో ఉన్నారు. ఎలా చూసుకున్నా జ‌న‌సేన పార్టీకి 2024 ఒక పెద్ద విజ‌యనామ సంవ‌త్స‌ర‌మ‌నే చెప్పాలి. మ‌రీ ముఖ్యంగా చూసుకుంటే.. టీడీపీ విజ‌య ర‌హస్యం తెలిసిపోయిన సంవ‌త్స‌రం కూడా ఇదే. కాలానికి అనుగుణంగా మార్పు స‌హ‌జ‌మే అయినా.. ఆ మార్పు ఒంట‌రిగా సాధ్యం కాద‌నిటీడీపీకి నిరూపించిన సంవ‌త్స‌రం కూడా 2024.

అదే స‌మ‌యంలో ఉద్ధండులైన నాయ‌కుల‌కు ఈ సంవ‌త్స‌రం చేదు జ్ఞాప‌కాలు మిగిల్చ‌గా.. కొత్త త‌రం నాయ‌కులైన గౌతు శిరీష‌, టీజీ భ‌ర‌త్‌, గాలి భాను ప్ర‌కాష్, రెడ్డ‌ప్ప‌గారి మాధ‌వి రెడ్డి వంటి వారిని ప్ర‌జ‌ల‌కు అందించింది. త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు లేని తీర్పుల‌కు వేదిక‌గా కూడా మారిన సంవత్స‌రం 2024.

సో.. ఎలా చూసుకున్నా.. అనేక మార్పుల‌కు, చేర్పుల‌కు కూడా వేదికగా మారింద‌నే చెప్పాలి. వ్యాపారాల ప‌రంగా.. అభివృద్ది ప‌రంగా కూడా.. ఈసంవ‌త్స‌రం చ‌రిత్ర‌లో నిలిచిపోయింది. చ‌రిత్ర‌లో క‌నీవినీ ఎరుగ‌ని న‌ష్టాలు స్టాక్ మార్కెట్ భ‌రించాల్సి వ‌చ్చింది. సో.. 2024 చ‌రిత్ర‌లో క‌లిసి పోలా.. చ‌రిత్ర సృష్టించింది!!

Tags:    

Similar News