రెండో విడత నామినేటెడ్ పదవులకు ముహూర్తం ఫిక్స్

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం రెండవ విడత నామినేటెడ్ పదవుల పంపిణీకి డేట్ ని ఫిక్స్ చేసి పెట్టుకుంది అని తెలుస్తోంది.

Update: 2024-10-19 03:48 GMT

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం రెండవ విడత నామినేటెడ్ పదవుల పంపిణీకి డేట్ ని ఫిక్స్ చేసి పెట్టుకుంది అని తెలుస్తోంది. ఈ నెల 23న రెండవ విడత జాబితా రిలీజ్ చేస్తున్నారు. ఈసారి ఎక్కువగానే పదవులు ఉండబోతున్నాయని తెలుస్తోంది. అందులో టీడీపీ నుంచి ఆశావహులకు సీనియర్లకు త్యాగధనులకు పెద్ద పీట వేస్తారు అని అంటున్నారు.

అంతే కాదు బీజేపీ జనసేనల నుంచి ఈసారి ఎక్కువ నంబర్ కే పదవులు దక్కుతాయని చెబుతున్నారు. బీజేపీకి తొలి విడతలో కేవలం ఒక్క కార్పొరేషన్ చైర్మన్ పదవి మాత్రమే దక్కింది. దాంతో కమలం పార్టీ రగిలిపోయింది. అంతే కాదు ఏకంగా కొందరు నేతలు ఏపీలో రాజకీయం గురించి కూటమిలో తమకు సరైన ప్రాతినిధ్యం లేని సంగతి గురించి కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదు చేసినట్లుగా చెబుతున్నారు.

దాంతో కమలం పార్టీకి అసంతృప్తి లేకుండా చూసుకోవాల్సి ఉంది అని అంటున్నారు. అలాగే జనసేన నుంచి కూడా లిస్ట్ వచ్చింది అని అంటున్నారు. గత సారి వారికి మూడు పదవులు దక్కాయి. ఈసారి అలా కాకుండా ఎక్కువ మందికే ఇస్తారని అంటున్నారు. ఏపీలో ఇంకా ఎనభై దాకా కార్పోరేషన్ చైర్మన్ పదవులు ఉన్నాయి. వీటి నుంచి ఈసారి కనీసంగా నలభై దాకా కార్పోరేషన్ చైర్మన్ పదవుల భర్తీకి తీవ్రంగా కసరత్తు చేసి ఎంపిక చేశారు అని అంటున్నారు.

ఈసారి జాబితాలో జనసేనలోని కొందరు ముఖ్యుల పేర్లు కూడా ఉండొచ్చు అని అంటున్నారు. అదే విధంగా తెలుగుదేశంలో పొత్తులలో భాగంగా అసెంబ్లీ ఎంపీ సీట్లు త్యాగం చేసిన వారికి ఈసారి పెద్ద పీట వేస్తారని అంటున్నారు.

ఆ లిస్ట్ లో మాజీ మంత్రులు దేవినేని ఉమా, కే ఎస్ జవహర్, మాజీ ఎమ్మెల్యే పిఠాపురం వర్మ, టీడీపీ అధికార ప్రతినిధిగా సేవలు అందిస్తున్న జీవీ రెడ్డి వంటి వారు ఉన్నారని తెలుస్తోంది. వీరే కాకుండా సామాజిక సమీకరణలలో భాగంగా మరి కొందరికి కూడా పదవులు ఇవ్వాల్సి ఉంది అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఈసారి నామినేటెడ్ విషయంలో సొంత పార్టీలో కానీ మిత్రుల పార్టీలలో కానీ ఏ విధమైన అసంతృప్తి చోటు చేసుకోకుండా పూర్తి న్యాయం చేయడానికి చంద్రబాబు చూస్తున్నారు అని అంటున్నారు.

ప్రాంతాల వారీగా కూడా అన్నీ చూసుకుని అందరికీ పూర్తి న్యాయం చేసేలా జాబితా రెడీ అవుతోంది అని అంటున్నారు. ఈ నెల 23న ఆ జాబితా విడుదల కావచ్చు అని అంటున్నారు. ఒక విధంగా ఈసారి ఎక్కువగా పదవుల పందేరం చేస్తే కూటమిలోని మూడు పార్టీల మీద ఒత్తిడి తగ్గుతుందని అంటున్నారు. అంతే కాదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పదవులను భర్తీ చేస్తే ఎక్కువ మందికి అవకాశాలు రానున్న కాలంలో ఇచ్చేందుకు వీలు అవుతుందని కూడా భావిస్తున్నారు.

Tags:    

Similar News