వైసీపీ నేతలకు ఆప్షన్ గా టీడీపీ జనసేన ...?

అందరికీ టికెట్ ఇవ్వలేం కదా అని యార్లగడ్డ వెంకటరావు పార్టీకి గుడ్ బై కొట్టిన సందర్భంలో వైసీపీ నేత సజ్జల రామక్రిష్ణారెడ్డి కామెంట్స్ చేశారు

Update: 2023-08-22 04:01 GMT

వైసీపీ బలమైన పార్టీ అందుకే ఒక్కో సీటుకూ ముగ్గురు నలుగురు పోటీ పడతారు. అందరికీ టికెట్ ఇవ్వలేం కదా అని యార్లగడ్డ వెంకటరావు పార్టీకి గుడ్ బై కొట్టిన సందర్భంలో వైసీపీ నేత సజ్జల రామక్రిష్ణారెడ్డి కామెంట్స్ చేశారు. పార్టీలో ఉన్న వారికి తగిన గౌరవం ఉంటుందని, సీటు దక్కకపోయినా మరో విధంగా న్యాయం చేస్తామని ఆయన చెప్పినప్పటికీ యార్లగడ్డ వెంకటరావు టీడీపీలోకి వెళ్ళిపోయారు.

దీని కంటే ముందు విశాఖ జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ గా ఉన్న పంచకర్ల రమేష్ బాబు జనసేన కండువా కప్పుకున్నారు. ఆయన పెందుర్తి సీటు ఆశించారని, అది సిట్టింగ్ ఎమ్మెల్యేకు కన్ ఫర్మ్ కావడంతో ఆయన పార్టీ మారారు అని ప్రచారం జరిగింది. ఇలా ఇద్దరు కీలక నేతలు తక్కువ సమయంలోనే వైసీపీని వీడి ప్రత్యర్ధి పార్టీలలో చేరిపోయారు. అక్కడ వారికి టికెట్ భరోసా లభించింది అని అంటున్నారు.

ఇదిలా ఉంటే మొత్తం ఏపీలో 175 నియోజకవర్గాలకు వైసీపీ ఒంటరిగా పోటీ చేయబోతోంది. సజ్జల చెప్పిన దాని ప్రకారం చూసినా ప్రతీ సీటుకూ ముగ్గురు వైసీపీ నేతలు పోటీ పడుతున్నారు. ఈ లెక్కన ఒక్కరికే టికెట్ దక్కితే మిగిలిన ఇద్దరూ జంపింగ్ జఫాంగులేనా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.

అలా కనుక చూస్తే వైసీపీలో కీలక నేతలలో 350 మంది దాకా టికెట్ల రేసులో ఉన్నట్లుగా భావించాలి. ఇందులో నుంచి ఎంత మంది పార్టీ కట్టుబాటుని గౌరవించి పెద్దలు చెప్పిన మాటలు విని పనిచేస్తారు అన్నది చూడాల్సి ఉంది. అదే విధంగా పార్టీ ఎంత నచ్చచెప్పినా తన ఫ్యూచర్ ని చూసుకోవడానికి కూడా నేతలు తయారుగా ఉంటారు కాబట్టి ఇందులో ఎంతమంది పార్టీ లైన్ దాటి జనసేన టీడీపీలలో సేఫ్ జోన్ ని వెతుక్కుంటారు అన్నది మరో చర్చ.

అయితే టికెట్ రాకపోతే పార్టీలో ఏదో పదవి ఇస్తామని అధికార పార్టీ చెప్పినా నేతలు ఉంటారా అంటే దాని కంటే ముందు మరో విషయం ఇక్కడ చూడాలి అని అంటున్నారు. ఇప్పటికి ఏపీలో ఎన్నికలు మరో ఏడెనిమిది నెలల సమయం మాత్రమే వ్యవధిలో ఉన్నాయి. ఇప్పటికైతే ఇంకా ఏపీ రాజకీయ ముఖ చిత్రంలో మార్పు పెద్దగా లేదు.

ఎందుకంటే విపక్షాలు విడిగానే ఉంటున్నాయి. పొత్తులు అన్నవి కార్యరూపం దాల్చలేదు. ఒక వేళ పొత్తు పొడిచి టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటే కచ్చితంగా టీడీపీ ఆశావహులలో అతి పెద్ద కదలికే వస్తుంది అని అంటున్నారు. అదే సమయంలో బీజేపీ కూడా పొత్తుకు కూడితే కచ్చితంగా ఏపీ రాజకీయం మారుతుంది అని అంటున్నారు.

అపుడు విపక్ష శిబిరం వైపు ఆశగా వెళ్లే ఆశావహులు చాలా మంది వైసీపీ నుంచి ఉంటారని అంటున్నారు. అయితే ఈ కూటమి గెలుస్తుంది అన్న భరోసా కూడా ఉండాలని అంటున్నారు. ఇప్పటికైతే అనేక సర్వేలు వైసీపీయే ఏపీలో అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయి. అదే టైం లో గతంలోలా కాకుండా చంద్రబాబు తనకు అవసరం ఉన్న చోట మాత్రమే జంపింగ్ జఫాంగులకు టికెట్లు ఇస్తున్నారు పార్టీ నేతలు దండీగా ఉన్న చోట మాత్రం ఆయన వారికే అవకాశాలు ఇస్తున్నారు. దాంతో టీడీపీలో ఖాళీలు కూడా చూసుకుని జంప్ చేయాల్సి ఉంటుంది అని అంటున్నారు.

యార్లగడ్డ వెంకటరావు జంప్ చేశారు అంటే గన్నవరంలో ఖాళీ ఉంది. అదే ఏ తూర్పుకో. వెస్ట్ కో, విజయవాడ సెంట్రల్ లో సీటు కోరి జంప్ చేస్తే టీడీపీ ఇవ్వలేదు అని అంటున్నారు. అపుడు టీడీపీ కూడా వచ్చిన వారికి భరోసా మాత్రమే ఇవ్వగలదు, తమ పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ కానీ నామినేటెడ్ పదవి కానీ ఇస్తామని హామీ ఇవ్వవచ్చు.

అది ఎటూ వైసీపీ నేతలు ఇస్తున్నారు కాబట్టి జంపింగ్ చేసి అనవసర ఆయాసం తెచ్చిపెట్టుకునే నేతలు కూడా ఎవరూ ఉండరని అంటున్నారు. అయితే వీటన్నిటి కంటే ముఖ్యమైన విషయం ఏంటి అంటే విజయం. ఏ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయన్నది మాత్రమే జంపింగులకు ఆస్కారం కల్పిస్తుంది అని అంటున్నారు.

వైసీపీకి ఈ రోజుకు అలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి కాబట్టి కచ్చితంగా ఆ పార్టీ ధీమాగా ఉంది. ఒకరిద్దరు తప్ప తమ పార్టీ నుంచి పెద్దగా జంపింగ్స్ ఉండవని భావిస్తోంది. అయితే వైసీపీ ఆశావహులకు ఇపుడు జనసేన టీడీపీలే ఆప్షన్ గా ఉన్నాయని అంటున్నారు బీజేపీ విషయంలో ఇప్పటిదాకా ఎవరూ తొంగి చూడడంలేదు అని అంటున్నారు.

Tags:    

Similar News