ప్ర‌త్యేక హోదానే కాంగ్రెస్ అస్త్రం.. జ‌నాలు న‌మ్మేనా?

కానీ గెలిచాక సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ఎన్నిక‌ల్లో ఈ ప్ర‌త్యేక హోదా అస్త్రాన్ని కాంగ్రెస్ వాడుకునేందుకు సిద్ధ‌మైంది

Update: 2024-04-06 13:16 GMT

ఎన్నిక‌లు వ‌చ్చాయంటే చాలు ఏపీకి ప్ర‌త్యేక హోదా టాపిక్ క‌చ్చితంగా వార్త‌లో ఉండాల్సిందే. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఏపీకి జ‌రిగిన మొద‌టి ఎన్నిక‌ల్లో టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన కూట‌మి ఇదే విష‌యాన్ని చెప్పింది. ప్ర‌త్యేక హోదా తెస్తామ‌ని చెప్పి అధికారంలోకి వ‌చ్చింది. ఆ త‌ర్వాత ఆ విష‌యాన్నే మ‌ర్చిపోయింది. 2019లో జ‌గ‌న్ కూడా త‌మ ఎంపీల‌ను గెలిపిస్తే కేంద్రం మెడ‌లు వ‌చ్చి ప్ర‌త్యేక హోదా సాధిస్తామ‌ని గొప్ప‌లు చెప్పారు. కానీ గెలిచాక సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ఎన్నిక‌ల్లో ఈ ప్ర‌త్యేక హోదా అస్త్రాన్ని కాంగ్రెస్ వాడుకునేందుకు సిద్ధ‌మైంది.

తాజాగా కాంగ్రెస్ ప్ర‌క‌టించిన మేనిఫెస్టోలో ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని ఆ పార్టీ చెప్పింది. నిజానికి ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని మొట్ట‌మొద‌టిగా చెప్పింది కాంగ్రెస్ పార్టీనే. విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం అప్ప‌టి ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ ఆ మేర‌కు హామీనిచ్చారు. కానీ ఆ త‌ర్వాత జ‌రిగిన రెండు ఎన్నిక‌ల్లోనూ కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి రాలేక‌పోయింది. అధికారంలో ఉన్న బీజేపీ.. ఏపీకి ప్ర‌త్యేక హోదా అనే విష‌యాన్ని ప‌ట్టించుకోలేదు. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం దీన్ని వాడుకోవ‌డం త‌ప్ప బీజేపీ అస‌లేం చేయ‌లేదు.

ఇప్పుడు మ‌రోసారి ఎన్నిక‌ల నేప‌థ్యంలో బీజేపీ కానీ టీడీపీ కానీ వైసీపీ కానీ ప్ర‌త్యేక హోదా గురించి అస‌లు మాట్లాడ‌ట‌మే లేదు. బీజేపీ ఏమో అది ముగిసిన అధ్యాయ‌మ‌ని అంటోంది. కానీ కాంగ్రెస్ మాత్రం తాము అధికారంలో వ‌స్తే త‌ప్ప‌కుండా ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది. ప్ర‌త్యేక హోదా అనేది ఏపీ ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వం, భావోద్వేగాల‌తో ముడిప‌డి ఉంది. ఈ నేప‌థ్యంలో ఈ అంశాన్ని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది. కానీ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తుందా? అన్న‌దే ఇక్క‌డ ప్ర‌శ్న‌. ప్ర‌స్తుత జాతీయ రాజ‌కీయ ప‌రిణామాలను పరిశీలిస్తే బీజేపీనే హ్యాట్రిక్ కొట్టే అవ‌కాశ‌ముంద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చేది ఎప్పుడు? ఏపీకి ప్ర‌త్యేక హోదా ద‌క్కేది ఎప్పుడు? అని ఏపీ ప్ర‌జ‌లు ఊసూరుమంటున్నారు.

Tags:    

Similar News