పవన్ ను ఏసుకునే హడావుడిలో అంబటి మిస్టేక్ చేశారా?
రాష్ట్రానికి మంత్రి అయినప్పటికీ.. తన సొంత శాఖ మీద కంటే కూడా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు.
రాష్ట్రానికి మంత్రి అయినప్పటికీ.. తన సొంత శాఖ మీద కంటే కూడా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు. ఏ చిన్న అవకాశాన్నివదలకుండా.. జనసేనాని చేసే ప్రతి పనిని వేలెత్తి చూపిస్తూ ఆన్ లైన్ లోనూ.. ఆఫ్ లైన్ లోనూ విరుచుకుపడుతుంటారు. తాజాగా అంబటి పెట్టిన పోస్టు కొత్త చర్చకు తెర తీయటమే కాదు.. అంబటి అలాంటి తప్పు చేయటమా? అని ప్రశ్నిస్తున్నారు. ఏపీలో విపక్ష టీడీపీతో పొత్తుకు సిద్ధమైన పవన్ పై అధికార వైసీపీ నేతలు పెద్దఎత్తున విరుచుకుపడటం తెలిసిందే.
తాజాగా తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీతో కలిపి పొత్తు పెట్టుకొని పోటీ చేయాలని డిసైడ్ చేసిన వేళ.. మంత్రి అంబటి రాంబాబు సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. ఆ పోస్టులో భాగంగా ఆయనో ఫోటోను షేర్ చేశారు. అందులో ఒకవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పవన్ ఫోటోను.. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి ఉన్న ఫోటోల్ని షేర్ చేశారు. ఈ సందర్భంగా పవన్ పై తనదైన రీతిలో సెటైర్లు వేశారు అంబటి.
‘‘విలువలు లేని తమకే ఇది సాధ్యం’’ అంటూ పవన్ పై సంచలన పంచ్ వేశారు అంబటి. పవన్ కల్యాణ్ పై తరచూ విరుచుకుపడే ఆయన.. అందుకు భిన్నంగా తాజా ఎపిసోడ్ లో పవన్ ను కెలికే ప్రయత్నంలో అంబటి అత్యుత్సాహాన్ని ప్రదర్శించారని చెబుతున్నారు. పవన్ మీద ఉన్న గురిని ఆయనకు పరిమితం చేయకుండా.. తాజా పోస్టులో తెలంగాణ బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న కిషన్ రెడ్డితో కలిసి ఫోటో దిగటాన్ని అంబటి తప్పు పట్టటాన్ని తీవ్రంగా రియాక్టు అవుతున్నారు.
సాధారణంగా పవన్ ను.. పవన్ ప్లస్ చంద్రబాబును టార్గెట్ చేయటంలో మంత్రి అంబటికి కొత్త కాకున్నా.. కిషన్ రెడ్డిని సీన్లోకి తీసుకొచ్చి ఆయనపైనా సెటైర్లు వేయటం ఇబ్బందికరమంటున్నారు. ఇంతకాలం ఏపీ అధికార పార్టీతో చక్కటి సంబంధాల్ని ప్రదర్శిస్తున్న వేళ.. అందుకు భిన్నంగా ఆయన్ను టార్గెట్ చేసేలా అంబటి ట్వీట్ ఉందంటున్నారు. ఇలాంటివి బీజేపీ అగ్రనాయకత్వానికి ఇబ్బందికరంగా మారతాయని చెబుతున్నారు. ఎంత పవన్ ను ఏసుకోవాలనుకుంటే మాత్రం.. వెనుకా ముందు చూసుకోకుండా కేంద్ర మంత్రి కమ్ టీ బీజేపీ సారధి కిషన్ రెడ్డిపై వ్యంగ్య వ్యాఖ్యలు వేయటం అంబటికి తలనొప్పిగా మారుతుందంటున్నారు. పవన్ మీద ఫైర్ అయ్యే తొందరలో కిషన్ రెడ్డిని అనవసరంగా టచ్ చేశారన్న మాట వినిపిస్తోంది. మరి.. ఈ ప్రచారానికి అంబటి ఎలాంటి సమాధానాన్ని ఇస్తారో చూడాలి.