మన అరకు కాఫీకి అరుదైన గౌరవం.. పార్లమెంటులో ప్రత్యేక స్టాల్స్

ఇప్పటికే జీఐ గుర్తింపు సాధించిన అరకు కాఫీకి విస్తృత ప్రచారం కల్పించే ఉద్దేశంతో పార్లమెంటులో రెండు స్టాల్స్ ఏర్పాటు చేసేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది.;

Update: 2025-03-24 08:58 GMT

విశాఖ గిరిజనులు పండించే అరకు కాఫీ మరో ఘనత దక్కించుకుంది. ఇప్పటికే జీఐ గుర్తింపు సాధించిన అరకు కాఫీకి విస్తృత ప్రచారం కల్పించే ఉద్దేశంతో పార్లమెంటులో రెండు స్టాల్స్ ఏర్పాటు చేసేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. స్పీకర్ ఓం బిర్లా ఆదేశాలతో సోమవారం ఉదయం లోక్ సభ, రాజ్యసభల్లో రెండు స్టాల్స్ ఏర్పాటు చేశారు. లోక్ సభ భవనాల డైరెక్టర్ కుల్ మోహన్ సింగ్ అరోరా ఆధ్వర్యంలో సంగం 1, 2 కోర్ట్ యార్డు వద్ద స్టాల్స్ ఏర్పాటు చేశారు. సోమవారం నుంచి ఈ నెల 28 వరకు పార్లమెంటు ఆవరణలో అరకు కాఫీ స్టాల్స్ తెరిచివుంచుతారు.

పార్లమెంటు సభ్యులు అల్పాహారం తీసుకునే సంగం క్యాంటీన్ వద్ద గిరిజన కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటైన స్టాల్స్ ను లోక్ సభ క్యాంటీన్ లో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, రాజ్యసభ క్యాంటిన్ లో వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రి పీయుష్ గోయల్ ప్రారంభించారు. గిరిజన వ్యవహారాల మంత్రి జోరల్ ఓరం, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, కూటమి ఎంపీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కాగా, పార్లమెంట్ ప్రాంగణంలో అరకు కాఫీ స్టాల్ ప్రారంభం కావడం గర్వకారణమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎక్స్ లో ట్వీట్ చేశారు. ‘‘అరకు లోయ నుంచి GI ట్యాగ్ పొందిన ఆర్గానిక్ కాఫీ కేవలం ఒక పానీయమే మాత్రమే కాదు. ఇది 1.5 లక్షల గిరిజన రైతుల శ్రమకు దక్కిన ఫలితం, ఎన్నో ఏళ్ల వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్న గిరిజన రైతుల కృషి నేడు అరకు కాఫీని జాతీయ వేదికపై నిలిపింది. గౌరవనీయ ప్రధానమంత్రి మోదీ గారు, గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, అరకు కాఫీ లాంటి GI ఉత్పత్తులు గుర్తింపు పొందుతున్నాయి. ఇది గ్రామీణ ప్రాంతాల సాధికారతకు తోడ్పాటును అందించడమే గాక భారతదేశ సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తోంది. గిరిజన ఉత్పత్తులకు మద్దతుగా నిలిచి పార్లమెంట్లో నేడు అరకు కాఫీని ప్రారంభించిన శ్రీ పీయూష్ గోయల్ గారు, శ్రీ జువాల్ ఓరాం గారు, శ్రీ కిరణ్ రిజిజు గారు, హృదయపూర్వక కృతజ్ఞతలు. సహకరించిన లోకసభ స్పీకర్ ఓం బిర్లా గారికి ప్రత్యేక కృతజ్ఞతలు’’ అంటూ రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేశారు.

Tags:    

Similar News